ఎంతటి పెద్ద సంస్థ అయినా చిన్నగానే మొదలవుతుంది. ఈనాడింత
గొప్పగా హైదరాబాదులో ఒక లాండ్ మార్క్ మాదిరిగా
పేరు తెచ్చుకున్న ప్రెస్ క్లబ్
పుట్టుక కూడా అంతే. బషీర్ బాగ్ చౌరాస్తాకు దగ్గరలో ఫతే మైదాన్ వద్ద, నరసంచారం అంతగా కనబడని ప్రాంతంలో, యాభయ్ ఏళ్ళ క్రితం ఒక చిన్న రేకుల
షెడ్డులో పురుడు పోసుకుంది. ప్రెస్ క్లబ్ ఏర్పడిన పదేళ్లకు కాబోలు నేను రేడియో
విలేకరిగా 1975 లో హైదరాబాదులో పాదం మోపాను. ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టిన ఆ వేళావిశేషం
ఎట్టిదో కానీ, దానితో నా అనుబంధం నేటికీ
కొనసాగుతూనే వస్తోంది.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో
నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా, క్లబ్ కార్యదర్శిగా, వివిధ హోదాల్లో అనేక దశాబ్దాలపాటు ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో
క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.
వార్తా పత్రికల్లో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించి విలేకరులకు
ప్రెస్ క్లబ్ తో సాన్నిహిత్యం ఎక్కువ, ఎందుకంటె ఓ మోస్తరు
విలేకరుల సమావేశాలకు అదే నెలవు. పగలు విధి
నిర్వహణ కారణంగా ప్రెస్ క్లబ్ కి
వెళ్ళే విలేకరులకు సాయంత్రం కాలక్షేపాలకు కూడా అదే విడిది.
ప్రెస్ క్లబ్ బషీర్
బాగ్ ప్రాంతంలో వున్నప్పుడు నేను పనిచేసే ఆకాశవాణి కేంద్రం దానికి కూతవేటు దూరంలో
లేదా నడిచి వెళ్ళగలిగేంత దాపులో వుండడం
కూడా అ క్లబ్ తో నా అనుబంధం బలపడడానికి దోహదం చేసి వుంటుంది. చిన్నపాటి విలేకరుల
సమావేశాలే కాకుండా ముఖ్యమంత్రులు, విదేశీ అతిధులు, ప్రముఖ క్రీడాకారులు, ఉన్నతాధికారులతో ‘మీట్ ది ప్రెస్’ పేరిట జరిగే సమావేశాలు కూడా ప్రెస్
క్లబ్ లోనే జరిగే సాంప్రదాయం కారణంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనతి కాలంలోనే
నగరంలో ఒక ముఖ్యమైన లాండ్ మార్క్ హోదాను సముపార్జించుకుంది.
అనేక మంది ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే
తొట్టతొలి ‘మీట్ ది ప్రెస్’ అక్కడే జరిగేది. నాకు తెలిసి దాదాపు ప్రతి ముఖ్యమంత్రి
కూడా ఏదో ఒక సందర్భంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ని సందర్శించి విలేకరులతో మాటామంతీ
సాగించిన వాళ్ళే.
(ప్రముఖ క్రికెట్ కీడాకారుడు కపిల్ దేవ్ తో)
అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి
కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. కపిల్ దేవ్, క్లైవ్ లాయడ్, అజహరుద్దీన్,
ఎం.ఎల్. జయసింహ, ఎంపైర్ రామస్వామి వంటి అంతర్జాతీయ
క్రికెట్ దిగ్గజాలు హైదరాబాదు ప్రెస్ క్లబ్ ని సందర్శించడం నాకెరుక. క్లబ్ తరపున
నిర్వహించిన సార్క్ మీడియా టోర్నమెంటు క్లబ్ చరిత్రలో ఒక ముఖ్యమైన పుట. చెన్నైలోని
అమెరికన్ ఎంబసీ సహకారంతో హైదరాబాదులో
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై
ఒక సదస్సు నిర్వహించడం జరిగింది.
సదస్సు అనగానే తటాలున ఒక విషయం గుర్తుకు వస్తుంది.
క్లబ్ స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భం పురస్కరించుకుని
రజతోత్సవాలు జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. అప్పుడు కార్యదర్శి ఎం.ఎస్. శంకర్.
నేను వైస్ ప్రెసిడెంటుని. ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందుకు వచ్చి సహాయ హస్తం
అందించే వ్యక్తి జ్వాలా నరసింహా రావు. మా ముగ్గురికీ ఒక ఆలోచన వచ్చింది. ఎన్నికల
సంస్కరణలపై ఒక సదస్సు నిర్వహించి, ఆనాడు భారత ఎన్నికల సంఘం ప్రధాన
కమీషనరుగా వున్న శేషన్ తో కీలక ప్రసంగం ఇప్పిస్తే యెట్లా ఉంటుందని. అనుకున్నదే
తడవు, తన ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్ళిన
జ్వాలా పనిగట్టుకుని వెళ్లి శేషన్ ని కలిసి విషయం ఆయన చెవిన వేసాడు. తరువాత కొద్ది
రోజులకే శేషన్ హైదరాబాదు వచ్చి రాజభవన్
గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం పెట్టారు. అది కాగానే వెళ్లి
ఆయన్ని కలవాలని మా ప్లాను. అయితే ఆరోజు విలేకరుల మీద ప్రత్యేకించి ఫొటోగ్రాఫర్ల
మీద ఆయన విశ్వరూపం ప్రదర్శించడం చూసి మేమే
సంకోచించి ఆయన్ని కలవాలనే ఉద్దేశ్యం
విరమించుకోవాలనుకున్నాం. ఇంతలో ఒక అధికారి వచ్చి
‘శంకర్ ఎవరు, శేషన్ గారు రమ్మంటున్నారు’ అని
పిలిచాడు. ముగ్గురం తటపటాయిస్తూనే లోపలకు వెళ్లాం. బయట చూసిన మనిషికీ, లోపల మమ్మల్ని ఆయన పలకరించిన తీరుకూ హస్తిమ శకాంతరం తేడా
కనిపించింది. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, కూర్చోబెట్టి వివరాలు అడిగి తెలుసు కున్నారు. అప్పటికే ఆ గదిలో వున్న ఒక వ్యక్తిని చూపెడుతూ, ‘నాకు ఇంగ్లీష్ నేర్పిన
గురువుగారు’ అంటూ మాకు పరిచయం చేసారు. పేరు వినగానే మాకు అర్ధం అయింది, హిందూ ఆంగ్ల దినపత్రికలో వారం వారం ‘నో యువర్ ఇంగ్లీష్’ శీర్షిక
రాసేది ఆయనే అని.
మా సదస్సుకు రావడానికి దాదాపు అంగీకరించినట్టే మాట్లాడారు.
ఈలోగా అనుకోని పరిణామం సంభవించింది. శేషన్ బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి
మాట్లాడాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. పత్రికలు ఆ విషయం పేర్కొంటూ , ‘న్యాయస్థానం శేషన్ ని నోరు మూసుకోమంద’ని అభివర్ణించాయి.
దాంతో శేషన్ ప్రసంగం లేకుండానే ప్రెస్
క్లబ్ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది.
రవీంద్రభారతిలో కవి సమ్మేళనం బాధ్యత సీనియర్ సభ్యుడు డి.
వెంకట్రామయ్య భుజాన వేసుకుంటే, ఉర్దూ ముషాయిరా నిర్వహణను మరో
సీనియర్ మోహన్ దివాకర్ తన భుజస్కంధాలకు
ఎత్తుకున్నాడని నాటి విషయాలను సోమశేఖర్
గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో జనం ఘనంగా చెప్పుకునే కలర్ టీవీని ఈసీఐఎల్ వాళ్ళు
క్లబ్ కి కానుకగా ఇవ్వడం, ఓసారి క్లబ్ కు వచ్చిన స్టేట్ బాంక్ సీజీఎం శ్రీ పురోహిత్
అక్కడికక్కడే క్లబ్ కి కావాల్సిన ఫర్నిచర్
ని విరాళంగా ప్రకటించడం మరి కొన్ని జ్ఞాపకాలు. అలాగే క్లబ్ సోమాజీ గూడాకు మారినప్పుడు, ఓసారి కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు
వచ్చింది. నేను వెంటనే ఆ రోజుల్లో స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న
ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోను చేసి టెన్నిస్ టేబుల్ విరాళంగా ఇవ్వడానికి వీలు
పడుతుందా అని అడిగాను. దానికి ఆయన జవాబుగా, ‘అక్కడ (క్లబ్ లో ) ఎంతసేపు
వుంటార’ని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి వస్తున్నారేమో అనుకున్నాము. కానీ
ఆయనఉద్దేశ్యం వేరు. మేము అడిగినవన్నీ అదే
రోజు క్లబ్ కి చేర్పించేసారు.
ఎంపీ రవీంద్రనాథ్, ములుగు సోమశేఖర్, ఎమ్మెస్ శంకర్, దేవులపల్లి అమర్, వల్లీశ్వర్, నగేష్ కుమార్ మొదలయిన వారితో
కలిసి అనేక కార్యవర్గాల్లో పనిచేసే అవకాశం నాకు లబించింది. ఒక ఏడాది క్లబ్
కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఆ ఏడాది కార్యవర్గ సభ్యుల సహకారంతో, ‘క్లబ్ లో సభ్యుడే ప్రధానం’ (Member
is supreme) అనే
నినాదంతో చేయగలిగిన కొన్ని మంచి పనులు
చేసి చూపించడం జరిగింది. వాటిని పేర్కొంటే స్వోత్కర్ష అవుతుంది. అభివృద్ధి అనేది
నిరంతర ప్రవాహం వంటిది. దానిమీద ఎవరిదో ఒకరి ముద్ర వేయాలని ప్రయత్నించడం వృధా. ఒక
వేళ వేయాలని అనుకున్నా సాగే ప్రవాహంపై అది నిలవదు,
నిలబడదు.
అందుకే ఒక మాట. ప్రెస్ క్లబ్ ఈనాడు ఇంతటి ఉచ్ఛస్థితిలో వుందంటే
దానికి కారణం సభ్యులుగా, హితైషులుగా ఉంటూ వస్తున్న ‘ఎందరో
మహానుభావులు’.
వారందరికీ వందనాలు.
ఈ ఏడాది డిసెంబరు మొదట్లో హైదరాబాదు ప్రెస్ క్లబ్
స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన
కార్యక్రమానికి తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై నా వంటి అనేకమంది సీనియర్ సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు
రవీంద్రభారతిలో నిర్వహించిన స్వర్ణోత్సవంలో
గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర
మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా
ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా మరోమారు ఈ సత్కారం స్వీకరించే
అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు.
నవతరం నాయకత్వంలో ప్రెస్ క్లబ్ మరింత పురోగతి సాధించాలని
మనసారా కోరుకుంటున్నాను.
(13-12-2015)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి