23, డిసెంబర్ 2015, బుధవారం

అనుచరుల తప్పులు – నాయకుల తలనొప్పులు

సూటిగా.....సుతిమెత్తగా......

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 24-12-2015, THURSDAY)

నాయకుడు అనే వాడు తన అనుచర గణానికి అనునిత్యం సరయిన దిశానిర్దేశనం చేస్తుండడమే కాదు, తానూ ఒక నిత్య విద్యార్ధి మాదిరిగా కొత్త పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. ఈ క్రమంలో తప్పులు దిద్దుకుంటూ వుండడమే కాకుండా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఈ పనిలో పడ్డట్టు కానవస్తోంది.
గత  సోమవారం నాడు రాష్ట్ర శాసన మండలి సమావేశంలో ఆయన  చేసిన ప్రసంగం, టీడీఎల్పీ సమావేశంలో తెలుగు దేశం అధినేత  మాట్లాడిన తీరు ఇందుకు అద్దం పడుతోంది.  
‘అవసరమయితే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమే. కానీ చట్టబద్ధ పరిపాలనలో ఎక్కడా రాజీ పడను’ అంటూ, కాల్ మనీ  వ్యవహారంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు.
అదే రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం సమావేశంలో ప్రసంగించిన అధినాయకుడు చంద్రబాబు,  ‘స్నేహాల విషయంలో జాగ్రత్తగా మెలగమ’ని పార్టీ శాసన సభ్యులకు హితవు పలికారు. ’అధికారులు తప్పు చేస్తే అది అధికార వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరు తప్పు చేసినా అది తనకు చెడ్డ పేరు తెస్తుంద’ని చంద్రబాబు నిర్మొహమాటంగానే వున్నమాట చెప్పారు.
చాణక్యుడి  రాజధర్మం చెప్పేది ఏమిటంటే, రాజు దగ్గర పనిచేసేవాళ్ళే కాదు, ఆయన ప్రజల్లో ఎవరు నేరాలు చేసినా అందులో రాజుకు కూడా బాధ్యత వుంటుంది. అసలు నేరాలు జరక్కుండా చూడడం  పాలకుల ప్రధాన కర్తవ్యం.
ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే పాలకులు. కానీ, కాలక్రమంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే వాళ్ళుగా  మిగిలిపోయి,  ప్రజాప్రతినిధులే పరిపాలకులుగా మారిపోయారు. వారు ప్రజాప్రతినిధులే కాదు, ప్రభుత్వానికి కూడా ప్రతినిధులే. ఆ రకంగా వారు చేసే మంచి చెడులన్నీ ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతాయి. మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వారిది చెడు నడత అయితే వారి ప్రభుత్వానికే  చెడ్డ పేరు వస్తుంది. ఆ మంచిచెడులన్నీ ఆఖరికి ప్రభుత్వాధినేత ఖాతాలో పడతాయి. ఈ వాస్తవం తెలుసు కనుకే చంద్రబాబునాయుడు తన పార్టీవారికి ఈ రకమైన హితబోధ చేసివుంటారనుకోవాలి.
 కాల్ మనీ ఉదంతం బయటపడిన అనంతరం  రెచ్చిపోతున్న ప్రధాన  ప్రతిపక్షాన్ని  శాసనసభలో ఇరుకున పెట్టే విధంగా ఆయన ఒక  ప్రకటన చేసినప్పటికీ, ఎక్కడో మనసు మారుమూలల్లో తన సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఇందులో వుందన్న అపరాధ భావన వుండబట్టే, మనసులోని మాటను   ఈ విధంగా బయటపెట్టి వుండవచ్చు కూడా.  దానికి తోడు, ఈ  మొత్తం వ్యవహారంలో ఆయనకూ, ఆయన కుమారుడికీ ప్రమేయం ఉందంటూ సభాసాక్షిగా  ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి చేసిన ఆరోపణలు చంద్రబాబును మరింత కలతపెట్టివుంటాయి. ఎవరో, ఎక్కడో  చేసిన పనికి తనని ముడిపెట్టి మాట్లాడడం  ఆయన్ని కలచివేసి వుంటుంది. బహుశా ఈ కారణమే,  వైసీపీ సభ్యురాలు రోజాను  అసెంబ్లీ నుంచి ఏకంగా ఏడాదిపాటు సభనుంచి బహిష్కరించాలనే నిర్ణయం దిశగా అడుగు వేయించి వుంటుంది.
నవజాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి దాదాపు పద్దెనిమిది మాసాలు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఎన్నికల అనంతరం చేసిన తాజా వాగ్దానాలు వెరసి ముప్పందుమై సర్కారు మీద మోయలేని భారాన్ని మోపాయి. రాజధానిలేని నగరం కూడా లేని కొత్త రాష్ట్రంలో పాలన కుదురుకునేలా చేయడానికే తెలుగుదేశం అధినేత సర్వశక్తులూ వొడ్డి పనిచేయాల్సిన స్థితి. ఓ పక్క ఆర్ధిక లోటు. మరో పక్క అంతా  బాగుందని పైకి  చెబుతూ,  కొత్త రాష్ట్రానికి  సరికొత్త పెట్టుబడులని ఆకర్షించే క్రమంలో  అనవసరపు ఆడంబరాలు ప్రదర్శిస్తూ,  డాంబికపు ప్రకటనలు చేస్తూ రావాల్సిన పరిస్తితి,   నూతన రాజధాని నిర్మాణంలో  విమర్శలకు గురవుతున్న ‘గుప్పెడు మూసి వ్యవహరించే విధానం’. కేంద్రంలోని మిత్ర పక్షం బీజేపీ నుంచి ‘ఆశించని’ సాయం  ఏదోఒక రూపంలో అందుతున్నప్పటికీ, ‘ఆశించిన’ సాయం విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి. మరోవైపు ఏకైక ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సీ.పీ.  నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు.  వీటికి తోడు నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరం  రూపుదిద్దుకోకోకముందే బయట పడుతున్న వికృత వ్యాపార, వాణిజ్య  ధోరణులు, నివ్వెరపరుస్తున్న  నెయ్యి కల్తీ,  ఉసుర్లు  తీస్తున్న  మద్యం కల్తీ సంఘటనలు. ఇసుక మాఫియా సంగతి చెప్పాల్సిన పనిలేదు.
సామాన్యంగా ఇటువంటి తలనొప్పులు ఏ రాజకీయ నాయకుడికయినా తప్పని నొప్పులే. ఎంతటి కుదురున్న నాయకుడినయినా కుదేలుచేసే అంశాలే. అయితే, చంద్రబాబు నాయుడుకి వున్న ఏకైక యోగ్యత ఆయన సమర్ధత. ఆ ఒక్క లక్షణమే,  ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా  ఆయన్ని ఆయన అభిమానులు పెంచుకున్న అభిమానం  దూరం చేయలేకపోయాయి. ఇన్ని ఇబ్బందులు చూస్తూ, ఇన్ని సమస్యలు గమనిస్తూ ఆయన్ని గురించి  ‘అయ్యో పాపం’ అనుకునేవాళ్ళే కానీ, మొత్తం పాపం ఆయనదే అనేవాళ్ళు తక్కువ. ప్రత్యేకించి సాంఘిక మాధ్యమాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువ.
ఈ నేపధ్యంలో, ఈ కాల్ మనీ రాకెట్ బయట పడింది.  ఉత్త అప్పులు, వడ్డీల  వ్యవహారం అయితే ఇంత ప్రాచుర్యం వచ్చేది కాదు. ఇందులో దాగున్న ఒక అమానుష కోణం  వెలుగు చూడడంతో ప్రతి ఒక్కరూ ఆక్షేపించక తప్పని పరిస్తితి. బాకీల వసూళ్ళ పేరుతొ భయపెట్టి, ప్రలోభపెట్టి మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే వార్తలు రావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ లో పడిపోయింది. బాధిత స్త్రీలే స్వయంగా బయటకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాలను బయటపెడుతూ వుండడం చంద్రబాబు వంటి నాయకుడికి హరాయించుకోలేని విషయంగా తయారయింది. ఈ దందా నడుపుతున్న ముఠాలతో సంబంధం వున్నట్టు  మొదట బయటపడిన  పేర్లలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు బడా నాయకులవి వుండడం  పాలక పక్షం అధినేతను మరింత ఇరుకున పెట్టింది. దీనికి తోడు, కేసు దర్యాప్తు చేస్తున్న  సంబంధిత పోలీసు అధికారి సెలవుపై వెడుతున్నారనీ, ఆయన స్థానంలో మరో అధికారి బాధ్యతలు స్వీకరించి  దర్యాప్తు కొనసాగిస్తారనీ వెలువడ్డ వార్తలు కొంతవరకు పాలకపక్షం నైతికతను  దెబ్బతీసాయి.  ఆ తరువాత అదే అధికారిని కొనసాగిస్తూ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా ఈ మొత్తం వ్యవహారంలో పాలకపక్ష నాయకులకు సంబంధం వుందన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది. కాకపొతే, చంద్రబాబు తన అనుభవం మొత్తం రంగరించి శాసన సభలో విషయ ప్రస్తావన వచ్చే సమయానికల్లా,  ఈ కేసులో అరెస్టు అయిన వారిలో  ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పీ.తాలూకువాళ్ళే  అత్యధిక  సంఖ్యలో వున్నారని గణాంకాలతో సహా వివరించి  చెప్పి, చాకచక్యంగా  ‘బంతి’ ని అవతల కోర్టులోకి నెట్టేశారు.


రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ కీలక అంశంపై  శాసన సభలో సమగ్రమైన చర్చ జరిగేలోగానే ఇది మరో మలుపు తిరిగింది. కాల్ మనీ రాకెట్  లో అప్పులిచ్చిన పెద్దలు, అప్పులు  తీసుకున్న మహిళలను చట్ట విరుద్ధంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.  ఈ అంశం శాసన సభ గడప ఎక్కేసరికి,  ఒక మహిళా సభ్యురాలిని తోటి సభ్యురాలు అసభ్య పదజాలంతో దూషించిందని అధికార పక్షం తీసుకున్న నిర్ణయం కధను మరోమలుపు తిప్పింది. అలా ప్రవర్తించిన సభ్యురాలు రోజాను ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేసేవరకు వెళ్ళింది. సభానాయకుడిని కూడా ఆ సభ్యురాలు వదిలిపెట్టలేదనీ, సభాగౌరవం కాపాడడం కోసం ఇంతటి కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చిందనీ ప్రభుత్వం తరపున  వివరణ ఇచ్చారు. అయితే దాన్ని అంగీకరించకుండా  ఆగ్రహించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ ఏకంగా  మిగిలిన సమావేశాలనే  బహిష్కరిస్తున్నట్టు  సంచలనాత్మక ప్రకటన చేసి కధను మరో మలుపు తిప్పారు. 
కధ ఇంతటితో కూడా ఆగలేదు సరికదా మరో మలుపు తిరిగింది. 
వైసీపీ సభ్యురాలు రోజాపై ఏడాది పాటు వేసిన బహిష్కరణ వేటు మంగళవారం నాటికల్లా అనర్హత వేటుగా మార్పుచేసే ప్రయత్నాలు జరిగాయి. దీనికి నాందిగా సభలో పలువురు టీడీపీ మహిళాసభ్యులు, మహిళా మంత్రులు, సీనియర్ సభ్యులు గత సమావేశాల్లో రోజా ప్రవర్తన గురించి ప్రస్తావించి, అప్పటికీ ఇప్పటికీ ఆమెతీరులో తేడా లేదనీ, అసభ్యకరంగా మాట్లాడడం ఆమెకు అలవాటని,  అంచేత ఆమెపై అనర్హత వేటు వేసి, తిరిగి సభలో ప్రవేశించకుండా చూడాలనీ, అప్పుడే సభలో హుందాగా మెలగాల్సిన అవసరం ఇతర సభ్యులకు  తెలిసివస్తుందనీ సూచన చేసారు. రోజా వ్యాఖ్యలు తనను మానసికంగా ఎంతో వేదనకు గురిచేశాయని  టీడీపీ సభ్యురాలు అనిత కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటి రికార్డులను, పాత రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు హామీ ఇచ్చారు. ఇదే  జరిగితే, ఒక సభ్యుడు లేదా సభ్యురాలిపై అనర్హత వేటు పడడం అన్నది తెలుగు శాసనసభ చరిత్రలో మొట్టమొదటిసారి  అవుతుంది.  ఇంతవరకు ఇలాటి పరిణామం కనీవినీ ఎరుగని సంగతే.
రోజా సభలో ఎలాటి వ్యాఖ్యలు చేసారు అనేదానిపై ఇంతవరకు అధికారిక సమాచారం లేదు. కానీ పత్రికల్లో వచ్చిన దాన్నిబట్టి  చూస్తే  అవి చాలా  దారుణంగా వున్నాయని అనిపిస్తుంది. పత్రికల వారితో మాట్లాడినప్పుడు కూడా ఆమె తన వాదనను సమర్ధించుకుంటూ మాట్లాడారు కాని, పత్రికా వార్తల్ని ఖండించలేదు కనుక అవి నిజమే అయివుండాలి. అలాంటప్పుడు క్రమశిక్షణాచర్య ఎదుర్కోకతప్పదు. అయితే రోజా మరో ఆరోపణ చేసారు. తమ సభ్యులను, తమ నాయకుడిని ఉద్దేశించి కొందరు తెలుగు దేశం సభ్యులు, మంత్రులు  చేస్తున్న అవహేళనలు, హావభావాలు  మరింత  అసభ్యకరంగా వుంటున్నాయన్నది ఆమె  అభియోగం. అవి రికార్డులకి ఎక్కడం లేదని ఆరోపణ. ఇవన్నీ వింటుంటే అసెంబ్లీ కూడా ‘ర్యాగింగు’ వేదికగా మారిపోయిందేమో అనిపిస్తోంది. 
సభలో క్రమశిక్షణ నెలకొల్పడం గురించి ఎవరికీ విభిన్న  అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక మహిళా శాసన సభ్యురాలి కంటి తడికి కారణమైన మరో సభ్యురాలిపై తగు విచారణ జరిపి కఠిన చర్య తీసుకుంటే అభ్యంతర పెట్టేవాళ్ళు వుండరు. అయితే, ఇంత రగడకు కారణమైన కాల్ మనీ రాకెట్ వల్ల, దాన్ని ఆసరాగా తీసుకుని నిర్వాహకులు సాగించిన నీచ, నికృష్ట కామకలాపాల వల్ల పండంటి  సంసారాలు  ఛిద్రం చేసుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న బాధిత మహిళల కన్నీటిని కూడా తుడవాల్సిన అవసరం ప్రభుత్వానికి వుంది. కంటి  తుడుపు చర్యలతో సరిపుచ్చితే మాత్రం తమ పార్టీ వారిని కాపాడుకోవడంలో చూపిన శ్రద్ధను,   బాధిత మహిళల పట్ల చూపడం లేదనే అపప్రధను తెలుగు దేశం పార్టీ మూటగట్టుకోక తప్పదు.
ఉపశ్రుతి: ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయిదు రోజులపాటు జరిగి మొన్న మంగళవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడ్డాయి.  వాదప్రతివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో  వున్నపుణ్యకాలం  ఆవిరి అయిపోయింది. వైసీపీ శాసనసభాపక్షం విడిగా సమావేశమై స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని బట్టి సభలో ఉభయ పక్షాలు తమ తమ వైఖరికి కట్టుబడే వున్నాయని, ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గే సర్దుబాటు తత్వంతో లేవనీ అర్ధం అవుతోంది.
ఈ నేపధ్యంలో, అసెంబ్లీ  సమావేశాలు  ఎలా జరిగాయని ఓ మిత్రుడు అడిగినప్పుడు  చాలా పాత విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.
నలభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు రేడియో కేంద్రంలో వార్తలు చదివేందుకు న్యూస్ రీడర్లను ఎంపిక చేసేనిమిత్తం  రాత పరీక్ష, ఇంటర్యూలు నిర్వహించారు.  పరీక్షలో నెగ్గిన అభ్యర్ధులను  స్టూడియోలో కూర్చోబెట్టి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డు చేయించారు. అభ్యర్ధులను  ఎంపిక చేయాల్సిన ఒక పెద్ద మనిషి, వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ టేపును భద్రపరచమని సూచించారు. ‘అంత బాగా  చదివిందా’ అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు.  ‘వార్తలు ఎలా చదవకూడదో  అన్నదాన్ని బోధపరచడానికి ముందు ముందు ఆ టేపు  పనికొస్తుంద’న్నది ఆయన టీకా  తాత్పర్యం. (23-12-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Photo Courtesy Image Owner


5 కామెంట్‌లు:

  1. భండారువారూ,
    http://praggna.blogspot.in/2015/12/blog-post_22.html టపావద్ద ఒక వీడియో ఉంది. అందులో గౌరవశాసనసభ్యురాలు రోజాగారి మాటలు ఏమిటో స్వయంగా ఆమె అంటున్నప్పుడే వినవచ్చును. ఈ వీడియో సమగ్రమా కాదా అన్నది తెలియదు. అది వేరే విషయం.

    రిప్లయితొలగించండి
  2. @శ్యామలీయం -ధన్యవాదాలు. అనలేదని నేను అనలేదు. అధికారికంగా విడుదల చేస్తే బాగుండేది. వాళ్ళు అంటే వైరి పక్షం వాళ్ళు అడిగితె ఇవ్వలేదంటున్నారు. కానీ సాంఘిక మాధ్యమాల్లో మాత్రం ఆ వీడియోలు కనబడుతున్నాయి.

    రిప్లయితొలగించండి

  3. >>> ఒక అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ టేపును భద్రపరచమని సూచించారు. ‘అంత బాగా చదివిందా’ అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. ‘వార్తలు ఎలా చదవకూడదో అన్నదాన్ని బోధపరచడానికి ముందు ముందు ఆ టేపు పనికొస్తుంద’న్నది

    ఈవిడ ఆ తరువాయి మరీ ప్రాచుర్యం పొందిన జిలేబి అని గ్రేప్ వైన్ న్యూసు :)

    జేకే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఇంత రగడకు కారణమైన కాల్ మనీ రాకెట్ వల్ల, దాన్ని ఆసరాగా తీసుకుని నిర్వాహకులు సాగించిన నీచ, నికృష్ట కామకలాపాల వల్ల పండంటి సంసారాలు ఛిద్రం చేసుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న బాధిత మహిళల కన్నీటిని కూడా తుడవాల్సిన అవసరం ప్రభుత్వానికి వుంది.

    మా ఆడవాళ్ళకు పనీపాటా ఉండదు, ప్రభుత్వానికి కూడా పనిలేదా ? ఎవరు ఎందుకు కన్నీరు కారుస్తున్నారో ఎవరికైనా అర్ధం అవుతుందా ? ఓంకార్ రియాలిటీ షో లాగా తయారయ్యారు.ఒకరేమో తిట్టినందుకు బాధపడకపోగా సస్పెండ్ చేసినందుకు కన్నీరు కారుస్తున్నారు.ఇంకొకరేమో రోజా తిట్టినందుకు కాకుండా దళితురాలైనందుకు కన్నీరు కారుస్తున్నారు.ఈ మహిళల కన్నీరు చూసి మీరు చలించిపోతుంటే చదివి నేను కన్నీరు కారుస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  5. నీహరిక గారు>ఒకరేమో తిట్టినందుకు బాధపడకపోగా సస్పెండ్ చేసినందుకు కన్నీరు కారుస్తున్నారు.
    శ్యామలీయం> మీ రన్నది అక్షరాలా నిజం. కన్నీరు రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారన్న మాట.

    నీహరిక గారు>ఇంకొకరేమో రోజా తిట్టినందుకు కాకుండా దళితురాలైనందుకు కన్నీరు కారుస్తున్నారు.
    శ్యామలీయం>అదీ‌ నిజమే కావచ్చును. పైకి మాత్రం‌ తిట్టినందుకూ అంటారు దళితురాల్నీ‌ అంటారు. దళితవ్యక్తి కాకపోతే‌ తిట్టవచ్చునా? ఏంటో‌ గోల!

    నీహారిక గారు> ఈ మహిళల కన్నీరు చూసి మీరు చలించిపోతుంటే చదివి నేను కన్నీరు కారుస్తున్నాను.
    శ్యామలీయం> బాగా చెప్పారు. వీళ్ళా మన లీడర్లూ అని యావద్దేశమూ కన్నీళ్ళు కార్చాలి మరి. కాని మనం‌ ఇలాంటివాటిని చూసిచూసి మొద్దుబారిపోయామే!

    రిప్లయితొలగించండి