24, నవంబర్ 2015, మంగళవారం

ఏకపక్ష విజయంలో బహుముఖ కోణాలు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 26-11-2015, THURSDAY)
ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన  అతిరధ మహారధులెందరో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  దొరక్క, ఇండిపెండెంటుగా పోటీ చేసి కనుమూరి బాపిరాజు, ఆ పెను ప్రభంజనంలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచి బయటపడి, మొదటి సారి శాసన సభలో అడుగు పెట్టారు. సహజంగా హాస్య ప్రియుడయిన బాపిరాజు ఆనాటి హైదరాబాదు విలేకరులతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమాల్లో విసిరే ముష్టిఘాతాలకు విలన్లు కుదేలవడం తెలుసు. కానీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతూనే ఆయన కొట్టిన దెబ్బకు  మా అందరికీ కాళ్లూ చేతులూ విరిగిపోయాయి. నడుములు కుంగిపోయాయి. ఒకడికి కాలు పొతే, మరొకడికి కన్ను పోయినట్టయింది   మా పరిస్థితి. (ఇండిపెండెంటుగా గెలిచినా ఆయన కాంగ్రెసు మనిషే). ఎన్నికల్లో చావుదెబ్బ తినడం అంటే ఏమిటో చెప్పడానికి  బాపిరాజుగారు ఆ రోజుల్లో చెప్పిన భాష్యం అది. మళ్ళీ ఇన్నాల్టికి వరంగల్ ఉప ఎన్నిక ఫలితం రూపంలో అలాంటి రాజకీయ అద్భుతం చోటుచేసుకుంది. సుమారు ఏడాదిన్నర క్రితం కొంచెం అటూ ఇటూగా నాలుగు లక్షల మెజారిటీతో గెలుచుకున్న వరంగల్ లోక సభ స్థానాన్ని టీ.ఆర్.ఎస్. తిరిగి అంతకు మించిన మెజారిటీతో నిలబెట్టుకుని కొత్త రాష్ట్రంలో ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పింది.


అర్ధం చేసుకోవాల్సిన  విషయం ఏమిటంటే, ఏడాదిన్నర కాలంలోనే మెజారిటీ పడిపోయి ఓటమిని మూటగట్టుకునేంతగా కేసీఆర్ నేతృత్వంలోని టీ.ఆర్.ఎస్.  సర్కారు, తన  కొంగున కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు. అలాగని, ఇంత గొప్ప మెజారిటీ తెచ్చుకుని, ఎన్నికల బరిలో వున్నమొత్తం ఇరవైరెండు మంది ప్రత్యర్ధులకు  డిపాజిట్లు సయితం దక్కనంతగా ఘన విజయం సాధించే  అద్భుతమైన ఘన కార్యాలు ఈ ఏన్నర్ధం కాలంలో చేసిన దాఖలా కూడా ఏమీ లేదు. మరి ఎందుకిలా జరిగింది? ఎందుకిలా వచ్చిందీ ఫలితం?
ఎందుకంటే, ఘోరంగా ఓడిపోయిన వారిది ఎక్కువగా  స్వయంకృతాపరాధమే.      
‘తెలంగాణా ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే నిరుటి ఎన్నికల్లో గెలవలేకపోయామని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ,  ఆ విషయాన్ని మరోమారు తెలంగాణా ప్రజల ముందుకు తెచ్చి ఈ ఉపఎన్నికలో అయినా పోయిన పరువు నిలబెట్టుకోవాలని  ఢిల్లీ నాయకుల్ని సయితం వరంగల్ ప్రచారంలోకి దింపింది. తెలంగాణా బిల్లు లోకసభ ఆమోదం పొందే సమయంలో స్పీకర్ గా వున్న మీరా కుమార్ మొదలయిన వారితో అలనాటి అంశాలను మళ్ళీ చెప్పించి, ప్రజల మనసులు గెలవాలని ప్రయత్నం చేసింది. మరో వైపు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సహజంగా తలెత్తగల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకులు చేసారు. నామినేషన్ సమయంలో అభ్యర్ధిని మార్చాల్సిన విషమ పరిస్తితి నుంచి కొంత బయట పడ్డట్టు మొదట్లో అనిపించినా చివరకు ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది.
మరోవైపు కేంద్రంలో అధికారంలోవున్న  బీజేపీ, పొరుగు రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ, గత ఎన్నికలల్లో కుదుర్చుకున్న పొత్తుకు కొనసాగింపుగా ఈ ఉపఎన్నికలో మరోమారు జతకట్టి పోటీ చేసాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో తమకూ కొంత వాటా వుందని నమ్ముతున్న బీజేపీ సహజంగానే ఆ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర సాయం లేకుండా కొత్త తెలంగాణా రాష్ట్రం మనుగడ కష్టం కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించడం వరంగల్ ఓటర్ల విధాయకం అని నమ్మచూపే పద్దతిలో ఆ పార్టీ ప్రచారం సాగింది. ఇక ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ నాయకత్వం, బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేసింది కాని, సైకిల్ గుర్తుకు ఓటువేయడానికి అలవాటుపడిన టీడీపీ కార్యకర్తల ఓట్లు ఏమాత్రం కమలం గుర్తుకు బదిలీ అవుతాయన్న  విషయంలో ఎవరి అనుమానాలు వారికి పోలింగుకి ముందర నుంచీ వున్నాయి. చివరాఖరుకు అవే నిజమయ్యాయా అన్నట్టు ఫలితం వెలువడింది. ఓటమిలో పాలుపంచుకున్న టీడీపీ నాయకత్వానికి మిగిలిన ఒకే ఒక ఉపశమనం ఏమిటంటే,  ఈ ఎన్నికల్లో సొంతంగా  అభ్యర్ధిని  నిలబెట్టకుండా, ఆ స్థానాన్ని మిత్ర పక్షం అయిన బీజేపీకి ఒదిలివేయడమే.  
ఇక వామపక్షాలు ఏకంగా ఒక ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి నిలిపాయి. వై.ఎస్.ఆర్. పార్టీకి తెలంగాణాలో బలం లేకపోయినా అభ్యర్ధిని నిలబెట్టింది. జగన్ మోహన్ రెడ్డి సభలకు భారీగా తరలివచ్చిన జనాలను అయినా ఓట్లుగా మలచుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.
ఇన్ని పార్టీలు రంగంలో వున్నప్పుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి పాలక పక్షానికే ఉపకరిస్తుంది. అయితే ఇన్ని పార్టీలు ప్రచార పర్వంలో విసిరే ఆరోపణలకు, విమర్సలకు ఒంటరిగా జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా పాలక పక్షం నాయకులపై పడుతుంది. అందుకే ప్రచార సమయంలో ప్రతి అంశం వివాదాంశంగా మారి, మీడియాలో పలు రూపాల్లో రూపాంతరం చెంది, నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పేరుకుపోయి ఉన్నదేమో అని ప్రతిపక్షాలే నమ్మే స్థితి ఏర్పడింది. చివరికి ఈ నమ్మకమే వాస్తవ స్థితిని  సయితం  గుర్తించలేని పరిస్థితిలోకి వాటిని నెట్టి వేసింది. నిజానికి అధికారంలోకి  వచ్చిన రెండేళ్లలోపు వచ్చిపడే ఉపఎన్నికలు ఏ పాలకపక్షానికయినా తలనొప్పే. యెంత గొప్ప నాయకుడయినా అంత కొద్ది వ్యవధానంలో ప్రజలను మెప్పించడం కష్టం. అధికార పక్షంపట్ల ఎంతో కొంత అసంతృప్తి సహజం. కొండొకచో అది వ్యతిరేకతగా కానవస్తుంది. అయితే అది అసహనంగా మారి, అసంతృప్తిగా పరిణమించి,  కసిగా మారనంత కాలం పాలక పక్షాలకు  కలిగే ప్రమాదం ఏమీ వుండదు.
సాధారణంగా ఉపఎన్నిక, అందులోను పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నిక అంటే జనంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఒక్క స్థానంలో  గెలుపోటముల వల్ల అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. ఈ కారణాల వల్ల వరంగల్ ఉపఎన్నికను జనం ఆషామాషీగా తీసుకుంటారనే అభిప్రాయం కలిగిన మాట వాస్తవం. అయితే జనంలోని ఈ  నిర్లిప్తత తమ కొంప ముంచుతుందన్న ఎరుక కలిగిన రాజకీయ పార్టీలు తమ ప్రచార సరళిని ఉధృతం చేసే క్రమంలో, ఒకింత చెలియలి కట్ట దాటి వ్యవహరించాయి. మాటలు హద్దులు మించాయి. వ్యక్తిగత ఆరోపణలు మనస్సు చివుక్కుమనే రీతిలో సాగాయి.  రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల సమస్యలు వీటన్నిటినీ ప్రతిపక్ష పార్టీలు ప్రచారాస్త్రాలుగా మార్చుకుని టీఆర్ ఎస్ పై మూకుమ్మడి దాడికి దిగాయి. ప్రజల సమస్యలను ప్రచారంలో ఎత్తి చూపాయే కానీ, అంతకుమందు ప్రజల పక్షాన నిలిచి వారికోసం ఉమ్మడి పోరాటం చేయకపోవడం వల్ల, వారి ఆత్రుత అంతా అధికారంకోసమే అన్న అనుమానం కలగడం సహజం.   
వాస్తవంగా ప్రతిపక్షాలు ప్రచార పర్వంలో లేవనెత్తిన సమస్యలన్నీ పాలక పక్షం టీ.ఆర్.ఎస్. పార్టీకి మింగుడు పడని విషయాలే. ఇలాటి  ఏ అంశం అయినా సమాధానం చెప్పుకోవాల్సిందే. సంజాయిషీ  ఇచ్చుకోవాల్సిందే. అంచేతే  ప్రభుత్వానికి గుణపాఠం చెప్పితీరాలనే కసి కలగకపోయినా,  ఈ మాత్రం వ్యతిరేకత చాలు, నిరుడు టీ.ఆర్.ఎస్. పార్టీకి వచ్చిన భారీ మెజారిటీని గణనీయంగా తగ్గించడానికి అనే నమ్మకం కలిగింది ప్రతిపక్షాలకు. విజయం మీద నమ్మకం లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకత పట్ల నమ్మకం పెంచుకున్న ప్రత్యర్ధులు మెజారిటీ తగ్గించగలిగితే, అదే ఓ మోస్తరు గెలుపు అనే అభిప్రాయానికి వచ్చారు. చివరికి గెలుద్దామని రంగంలో దిగిన పార్టీలు, మెజారిటీ తగ్గించడం, రెండో, మూడో స్థానం దక్కించుకోవడం ఎల్లా అనే మీమాంసలో పడిపోయినట్టయింది.
టీ.ఆర్.ఎస్. కి ఇంతటి అపూర్వ ఘన విజయం లభించడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు కొంతవరకు కారణం అయివుండవచ్చు కానీ, అసలయిన కారణం తెలంగాణా ప్రజల్లో ఇంకా అడుగంటని  భావోద్వేగం. కొడిగట్టని తెలంగాణా వాదం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే, ఒకరకంగా  టీ.ఆర్.ఎస్. పాత్ర రాజకీయంగా పరిమితమయిపోయింది. మిగిలిన రాజకీయ పార్టీల్లో అదీ ఒకటయిపోయినట్టే లెక్క. ఈ లెక్క తెలిసిన మనిషి కాబట్టే, కేసీఆర్ ‘బంగారు తెలంగాణా’ నినాదం ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే టీ.ఆర్.ఎస్. పని ముగిసిపోయినట్టు కాదనీ, కష్టపడి ఎన్నో త్యాగాలతో  సంపాదించుకున్న తెచ్చుకున్న తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మలచుకోవాలంటే టీ.ఆర్.ఎస్. ఆవశ్యకత ఇంకా ఉందన్న అభిప్రాయం జనాల్లోకి చేరేలా ఆయన చేసిన ప్రయత్నం ఈ ఉపఎన్నికలో బాగా పనిచేసింది. అదే జనాలను ఇంత  పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలకు రప్పించి వుంటుందని నమ్మే వాళ్ళు వున్నారు.   
అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్ళు  ఇవన్నీ షరా మామూలు ఆరోపణలుగా భావించే రోజులు వచ్చాయి. అధికారంలో వున్నపార్టీ అధికారాన్ని వాడుకోవడం తనకున్న సహజ హక్కుగా భావించే రోజులివి. అధికారంలో వున్నప్పుడు తాము చేసిన నిర్వాకం అదే కనుక ఏ పార్టీ అయినా  మాటవరసకు మాత్రమే  ఇలాటి ఆరోపణలు చేస్తుందే తప్ప అందులో ఎంతమాత్రం నిజాయితీ లేదని వాటికీ తెలుసు. అధికార వినియోగం తప్ప దుర్వినియోగం అనే మాటే రాజకీయ పార్టీలు ఒప్పుకోని కాలంలో మనం జీవిస్తున్నాం. అధికారంతోటి, డబ్బుతోటి, ప్రలోభాల తోటి గెలుపు సాధ్యం అయ్యేటట్టయితే, వరంగల్ తో పాటే  ఫలితం వెలువడిన  మధ్య ప్రదేశ్ ఉపఎన్నికలో అధికార బీజేపీ  పార్టీ ఎందుకు ఓడిపోతుందన్న  ఎదురు ప్రశ్న సిద్ధంగానే వుంది.
అయితే ఒకటి మాత్రం నిజం.
ప్రజలు కచ్చపట్టి పాలకపక్షాలను ఓడించిన సందర్భాలు ఎరుగుదుం. కానీ కసిబూని ప్రభుత్వాన్ని గెలిపించిన ఏకైక సందర్భం మాత్రం ఒక్క వరంగల్ ఉపఎన్నికేనేమో! 
పాలక పక్షాన్ని ఓడించాలని ప్రతిపక్షాలు అనుకుంటాయి. అలా అని ప్రజలు కూడా అనుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే వుంటుంది.
టీ.ఆర్.ఎస్. పార్టీకి  ప్రజలిచ్చిన వ్యవధానంలో ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం మిగిలే వుంది. నిరుడు ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని పాలించమని ఇచ్చిన తీర్పు కంటే , తెలంగాణా కల సాకారం అయిన తరువాత కట్టబెట్టిన ఈ ఘన  విజయం టీ.ఆర్.ఎస్.కూ, ఆ పార్టీ అధినేతకూ మరింత ప్రియమైనదీ, అత్యంత విలువయినదీ. ప్రజలపట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను మరింత పెంచే విజయం కూడా ఇది.
విజయం వినయం పెంచాలి. అపజయం అనేది విజయం కోసం చేసే మరో ప్రయత్నానికి నాంది కావాలి. రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే.
(25-11-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595

NOTE : Courtesy Image Owner  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి