(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 15-11-2015, SUNDAY)
సూటిగా ....సుతిమెత్తగా .....
సూటిగా ....సుతిమెత్తగా .....
నిన్న శనివారం, తెల్లవారుతూనే
పారిస్ లో జరిగిన ఘోరకలి గురించిన సమాచారాన్ని మోసుకుంటూ వచ్చింది. ప్రపంచ
ప్రఖ్యాత పర్యాటక నగరం పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో అనేకమంది
అమాయకులు నేలకొరిగారు. ప్రాధమిక సమాచారం ప్రకారం చనిపోయిన వారి సంఖ్య నూటపాతిక
దాకా వుంది. అయితే పూర్తి సమాచారం వెల్లడయ్యే సరికి మృతుల సంఖ్య భారీగా పెరిగే
అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.
పారిస్ అంటేనే అందాల నగరం. ఆ అందాల నగర వాసులకి
శుక్రవారం సాయంత్రం ఓ ఆటవిడుపు. అర్ధరాత్రి బాగా పొద్దుపోయేవరకు సరదాలు
తీర్చుకోవడానికి వారాంతపు సెలవు దినాల తొలిరేయి. అటువంటి రాత్రివేళ తెగబడిన ఉగ్రవాదులు వరుసగా నగరంలోని అనేక
ప్రాంతాలపై విరుచుకుపడి జరిపిన పేలుళ్లు, కాల్పులు- పౌరులకు, పోలీసులకు
ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసాయి.
సంగీత కచ్చేరీలు జరిగే బటాక్లాన్ హాలులో ఉగ్రవాద
దాడికి ఎక్కువమంది చనిపోయారు. కచ్చేరీ వినడానికి వచ్చిన ప్రేక్షకులను ఉగ్రవాదులు
బందీలుగా పట్టుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎనభయ్ మందిని
పొట్టనబెట్టుకున్నారని తొలివార్తలు తెలిపాయి.
పారిస్ నగరంలోని మరో అయిదు ప్రదేశాల్లో కూడా
ఉగ్రవాదులు తమ తుపాకులకు పనిచెప్పారు. బార్లు, రెస్టారెంట్లలో
కాలక్షేపం చేస్తున్న పౌరులు ఈ దాడులలో ప్రాణాలు కోల్పోయారు. మారణహోమానికి కారణ
మయిన ఉగ్రవాదులనందరినీ తాము మట్టుబెట్టామని పోలీసులు నమ్ముతున్నారు. అయితే వారిలో ఇంకా
ఎవరయినా తప్పించుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.
ఉగ్రవాద దాడితో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉలిక్కి
పడింది. ఆంతరంగిక అత్యవసర పరిస్తితి విధించింది. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో
సుశిక్షితులైన సాయుధ భటులను రంగంలోకి దింపింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
ఇళ్ళు ఒదిలి వీధుల్లోకి రావద్దని నగర పౌరులను హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా,
ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్
కీ మూన్, రష్యా
అధ్యక్షుడు పుతిన్ ఇతర అగ్రరాజ్యాల నాయకులు, పారిస్
లో జరిగిన మానవ హననం పట్ల తీవ్ర
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నాగరిక
ప్రపంచం సంఘటిత కృషి జరపాలని
ఉద్బోధించారు.
బ్రిటన్ పర్యటనలో వున్న భారత ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీ, లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన ప్రవాస
భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ‘ఉగ్రవాదానికి సూఫీ సంప్రదాయమే విరుగుడు’ అని
ఉద్బోధ చేసిన రోజునే పారిస్ లో ఈ ఘటన జరగడం
కాకతాళీయం కావచ్చు.
పొతే, పారిస్ పేలుళ్ళపై అనేకమంది
ప్రత్యక్ష సాక్షుల కధనాలతో విదేశీ మీడియా అట్టుడికి పోతోంది.
బెన్
గ్రాంట్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ మద్యశాలలో కూర్చుని వున్నప్పుడు ఉగ్రవాదులు
బయట కార్లనుంచి కాల్పులు జరిపారు.
‘మేము
వెనుక వైపు వుండడం కలిసి వచ్చింది. కాల్పుల శబ్దం వినబడగానే మేము ఓ బల్ల కింద
దాక్కున్నాము. మాకేమీ కనబడలేదు. కాసేపటి తరువాత చూస్తే ఎటు చూసినా శవాలే. అప్పుడు
తెలిసింది జరిగిన ఘోరం ఎంతటిదన్నది.’ బెన్ గ్రాంట్ చెప్పాడు. అతడి గొంతులో భయంతో
కూడిన దైన్యం.
‘మేము
చాలాసేపటి వరకు బయటకు రాలేకపోయాము. ఎందుకంటె మా కళ్ళ ముందు ఎన్నో శరీరాలు అచేతనంగా
గుట్టలుగా పడివున్నాయి’ గ్రాంట్ చెప్పాడు విషాద వదనంతో.
అదే
రోజు పారిస్ లోని నేషనల్ స్టేడియంలో ఫ్రాన్స్, జర్మనీ
జట్ల నడుమ కీలకమైన ఫుట్ బాల్ మ్యాచ్
జరుగుతోంది. ‘ఆట సగంలో ఉండగానే బయట నుంచి రెండు సార్లు పెద్దగా పేలుడు శబ్దాలు
వినవచ్చాయి.’ అని స్థానిక దినపత్రిక విలేకరి చెప్పాడు.
‘ప్రెసిడెంట్ హోలాండ్ కూడా ఆట చూడడానికి వచ్చారు. మ్యాచ్
మామూలుగా సాగిపోతోంది. పైకి చూస్తే ఆకాశంలో ఓ హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. ఆట
జరుగుతుండగానే ఎవరికీ తెలియకుండా భద్రతా దళాలు ప్రెసిడెంటుని అక్కడ నుంచి తప్పించి
తీసుకువెళ్లినట్టు ట్విట్టర్ చూస్తే
తెలిసింద’ని విన్సెంట్ అనే ఆ విలేకరి వెల్లడించాడు.
‘వున్నట్టుండి
ఆటను మధ్యలో నిలిపేశారు. ప్రేక్షకులందరూ
వెంటనే స్టేడియం ఒదిలి వెళ్ళిపోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. జనం కంగారుగా
బయట పడడానికి హడావిడి పడ్డారు.’ అని ఆ విలేకరి తెలిపాడు.
కాల్పులు
జరిగిన అయిదు ప్రదేశాల్లో ఒకటయిన పారిస్ లోని కంబోడియా రెస్టారెంటులో భోజనం
చేస్తున్న పిర్రే ఫార్ట్ కధనం ప్రకారం కాల్పుల శబ్దం అరనిమిషం పాటు వినపడింది.
‘బయట
ఎవరో టపాసులు కాలుస్తున్నారని అనుకున్నా. తీరా చూస్తే అవి ఉగ్రవాద చర్య అని అర్ధం
అయింది. రెస్టారెంటులో తుపాకీ తూటా తగిలి ఒక వ్యక్తి పడి వున్నాడు. అతడి చేతిలో ఓ
మృత శిశువు. ఆ దృశ్యం కనబడగానే కడుపులో దేవినట్టయింది’ అని అతగాడు చెప్పాడు.
కష్టకాలంలో
వున్న ఫ్రాన్స్ దేశానికి అనేక దేశాలు నైతిక మద్దతు ప్రకటించాయి. తోడుగా
నిలుస్తామని హామీ ఇచ్చాయి.
అయితే
ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం
తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ
ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం
కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత
ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేకదేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే
ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ
తలకెక్కదు. నాశనం వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. చంపు,
లేదా చచ్చిపో అనే రెండే రెండు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ
ఉగ్రవాదులు.
ఈ
ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో
బలం.సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన
కారణం, వారిని
ఎదురించాల్సిన శక్తులకు ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో
ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని
ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక
సంఖ్యలో వున్న మంచి వారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా
అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ
కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి
నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు ఇలా తోకలు ఝాడిస్తూనే వుంటారు.
అదే
జరుగుతోంది. అందులో మరో అంకమే పారిస్ ఘటనలు.
(14-11-2015)
NOTE: Courtesy Image Owner
__/\__ "అధిక సంఖ్యలో వున్న మంచి వారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. "
రిప్లయితొలగించండి