ఇప్పటి సంగతి కాదు. ఆరోజుల్లో రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్
టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్
చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో
మాకు వస్తుండేవి.
ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్. చైర్మన్ లైన్లోకి వచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో – ‘ఇంకా
ఎవరెవరు వస్తున్నార’ని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ, మీతో పాటు మీ దగ్గర
రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో
ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన.
అప్పుడు లైటు వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని
అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని
కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.
ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.
(ఎం. సత్యనారాయణ రావు గారు)
ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు
తెలియకపోయినా , వారి
స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో
సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ
మాట్లాడేవారు. ఒకసారి ఢిల్లీలో సత్యనారాయణ రావు గారిని వారి ఇంట్లోనే కలిసాను. ఆయన పక్కనే చిన్న ట్రాన్సిస్టర్ రేడియో తన దారిన తాను ప్రోగ్రాములు వినిపిస్తోంది. అది చూసి ఒక రేడియో మనిషిగా ఎంతో సంతోషం అనిపించింది. ‘రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి’ అని హేళనగా
మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే ఆ కళాకారులకు నూతన జవసత్వాలను
ఇచ్చేవని అనుకుంటాను.
ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే
ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు
సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు
జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి
అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే
కాదు, వారి
కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి