18, అక్టోబర్ 2015, ఆదివారం

రావూరి భరద్వాజ అసలు పేరు


(జ్ఞానపీఠ అవార్డు పొందిన  రావూరి భరద్వాజ మరణించి నేటికి రెండేళ్ళు)
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
ఓ చిన్న జ్ఞాపకం: 
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా చెప్పుకోవాలి.


రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల,  కృష్ణా పత్రికలో   సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను.


3 కామెంట్‌లు:

  1. మరో మాట శ్రీరామ్ గారు. భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. నేను రేడియో మనిషిని కనుక మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు భరద్వాజ గారు. అది ఇది"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?

    (ఉద్వేగానికి గురవుతూ…) కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)

    రిప్లయితొలగించండి