8, సెప్టెంబర్ 2015, మంగళవారం

కాళోజీ గర్వభంగం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-09-2015, SUNDAY)

(కాళోజీ గర్వభంగం అనే పదాన్ని కాళోజీనే స్వయంగా తన ఆత్మకధలో వాడారు -సెప్టెంబరు తొమ్మిది ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని)


ఈ ఏడాది  కాళోజీ  నూట ఒకటో జయంతి. ఇకనుంచి ప్రతియేడూ కాళోజీ జయంతిని తెలంగాణా భాషా దినంగా పాటించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. అధికారికంగా నిర్వహించే ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్ధులకు తెలంగాణా భాషపై చర్చా గోష్టులు మొదలయినవి నిర్వహించాలని చైనా పర్యటనకు బయలుదేరి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చివెళ్ళారు.
కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను  ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా ఆయన శైలి లోనే ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పాఠకుల కోసం కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని కాళోజీ మాటల్లోనే  :
“కులాల్లో ఎన్నో తరతమ భేదాలు  పాటిస్తున్నాం. అది గ్రామ్యం,  ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.
“భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,
అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.
“దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత  ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది.  ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది  వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.
“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా  నేర్చుకో. 
“రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మద్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల  కట్టలేం.
“హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది.  ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి  ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.
“ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం” 
పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.
“వరంగల్లు రాజరాజ నరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు.  ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను  చెప్తె వానికేమి తెలస్తది.
“చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.
“చోరీ చేస్తివా ?”
“ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”
“ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”
ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.
“ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు. కాళోజీ గర్వభంగం అని చెప్పే నాలుగైదు సంఘటనల్లో ఇది మొదటిదన్న మాట.
అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’
“దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న. నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.
ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!  (08-09-2015)  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       
          

 NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి