4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

షరా మామూలు అసెంబ్లీ సమావేశాలు


‘నేడే విడుదల, రేపే ఆఖరు రోజు, ఈ రోజే చూడండి!’ అనే తరహాలో నవజాత  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ  సమావేశాలు హైదరాబాదులో  అయిదు రోజులపాటు జరిగి ముగిసాయి. ఈ సమావేశాలు సజావుగా సాగాయా అంటే జరగాల్సినట్టు జరగలేదని చెప్పొచ్చు. జరగలేదా అంటే జరగకూడని విధంగా జరిగాయని కూడా చెప్పవచ్చు. వర్షాలు లేని ఈ వర్షాకాల సమావేశాల్లో ఉరుములు, మెరుపులకు మాత్రం కొదవ లేదు.


షరా మామూలుగానే అయిదు రోజులూ ఒక్క రోజుకూడా మినహాయింపు లేకుండా అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ ఏదో ఒక అంశంపై వాదాలు, ప్రతివాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇలాగే నడిచిపోయింది. ఇక ఆఖరి రోజు ప్రత్యేకత వాయిదాల పర్వం. సభ నిరవధికంగా వాయిదా పడడానికి పూర్వం అనేకమార్లు వాయిదాలు పడ్డం,  తిరిగి సమావేశం కావడం, మళ్ళీ వాయిదా పడ్డం ఇలా గడిచి పోయింది.    
అలా అని సభలో ఏ కార్యక్రమాలు ఎజెండా ప్రకారం జరగలేదని కాదు. ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. పట్టిసీమ, కరవు ఇతర అంశాలపై చర్చ జరిపింది. అక్రమ ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకునే ఆస్తులు  రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడేలా వీలు కల్పించే బిల్లుతో సహా తొమ్మిది బిల్లుల్ని ఆమోదించింది. అయితే కొన్నింటిపై చర్చ అరకొరగా జరిగిందనీ, మరికొన్నింటిపై  చర్చకు ఆస్కారమే లేకుండా చేసిందనీ ప్రభుత్వంపై  ప్రతిపక్షం ఆరోపిస్తే, ప్రతిపక్షం అనవసర అంశాలు లేవనెత్తి సభాసమయాన్ని వృధా చేయడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం సమర్ధించుకుంది.      
2014 లో జరిగిన ఎన్నికల తరువాత, కొత్తగా ఏర్పడ్డ ఈ తెలుగు రాష్ట్రంలో ఒక కొత్త  రాజకీయ చిత్రం ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారిగా రెండు పార్టీల వ్యవస్థ ఊపిరి పోసుకుంది. ఇంతవరకు శాసనసభల్లో అనేక రకాల పార్టీలకు కొద్దో గొప్పో,  ఎంతో కొంత ప్రాతినిధ్యం వుండేది. కానీ ఈ సారి సభలో రెండే రెండు పక్షాలు. ఒకటి పాలక పక్షం టీడీపీ. రెండోది ప్రతిపక్షం  వై.ఎస్.ఆర్.సీ.పీ.  బీజేపీకి  కొన్ని స్థానాలు లేకపోలేదు కానీ ఆ పార్టీ  పాలకపక్షానికి మిత్ర పక్షం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా. పొతే వున్న ఒకేఒక్క ఇండిపెండెంటు సభ్యుడు కూడా పాలకపక్షంలో చేరిపోయారు. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సహకరించుకున్నా, సంఘర్షించుకున్నా మిగిలిన పార్టీలు రెండే రెండు. ఆ  రెండూ ప్రాంతీయ పార్టీలు కావడంతో ఇక వాటి మధ్య సయోధ్య, సహకారం ఆశించడం వృధా.  కనీసం  రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సయితం  ఈ రెండు పార్టీలు ఉత్తర దక్షిణ ధృవాలుగా వ్యవహరిస్తూ రావడం గత చాలా కాలంగా చూస్తూ వస్తున్నదే. ఈ అయిదు రోజులూ శాసనసభలో అవే దృశ్యాలు మళ్ళీ మళ్ళీ కనబడ్డాయి.
సాధారణంగా గతంలో ఇటువంటి పరిస్తితులు తలెత్తినప్పుడు, సంఖ్యాబలం లేకపోయినా మిగిలిన రాజకీయ పార్టీలు కల్పించుకుని ఉభయులకు సర్ది చెప్పి పరిస్తితిని తాత్కాలికంగా అయినా సర్దుబాటు చేసేవి. దురదృష్టం ఏమిటంటే ఇప్పటి సభలో అటువంటి అవకాశం కూడా లేదు.   
ఈసారి మాటల తూటాలు పెరిగాయి. వాటిల్లో ఘాటు పెరిగింది. రికార్డుల నుంచి తొలగించకపోయినా కొందరు వాడిన పద ప్రయోగాలు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వారిని కలత పెట్టాయి. మూర్ఖుడు, రౌడీ, సైకో  వంటి పదాలు వింటున్నప్పుడు మనసు చివుక్కుమనిపించింది. పైగా నోరుజారి పొరబాటున  ఆ పదాలు వాడారేమో అనే సందేహానికి ఆస్కారం ఇవ్వకుండా వాటినే ఒకటికి రెండు సార్లు రెట్టించి మరీ ప్రయోగించారు.  అలా మాట్లాడిన వారందరూ గౌరవనీయ శాసన  సభ్యులు. వారి పేరుకు ముందు ‘గౌరవనీయ’ అనే పదం విధిగా జోడించి వాడుతుంటారు. మరి ఇలా నోర్లు పారేసుకోవడం వల్ల ఆ గౌరవం భంగపడే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని వారు గమనిస్తున్నట్టులేదు. ‘ప్రజలు గమనిస్తున్నారు’ అని వారు పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు కానీ,  వాళ్ళే ఆ విషయం  పట్టించుకుంటున్న దాఖలా కానరావడం లేదు.
పాలక, ప్రతిపక్ష సభ్యులు సభలో అడుగు పెట్టడానికి ముందే అవతల పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఏం మాటలు వాడాలో అన్న విషయంలో ముందే ఒక  వ్యూహం సిద్ధం చేసుకుని వస్తున్నట్టు కనబడుతోంది. ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టడం ద్వారా తమది పైచేయి అనిపించుకోవాలనే ధోరణి ప్రస్పుటంగా కనబడుతోంది. దీనివల్ల మాటకు మాట అనడంలో ఔచిత్యం లోపించి, కేవలం అసంబద్ధత మాత్రమే  కొట్టవచ్చినట్టు వ్యక్తం అవుతోంది. తమలపాకుతో తానిట్లంటే తలుపు చెక్కతో తానొకటి తగిలించానన్న చందంగా ఒకరికొకరు తీసిపోకుండా పోటాపోటీగా వ్యవహరించారు.   
గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు సభ సాఫీగా నడిస్తే అది ప్రతిపక్షానికే ప్రయోజనం. నడవక వాయిదాలు పడుతూ ముగిసిపోతే అది  పాలక పక్షానికి లాభం. సమయం లేదన్న సాకు చూపించి ఆమోదింప చేసుకోవాల్సిన బిల్లులనన్నిటినీ, ఒక్క దెబ్బతో  ఎలాటి చర్చా లేకుండా ‘గిలెటిన్’  ఆయుధం ప్రయోగించి ఒడ్డున పడవచ్చు. అయితే సభ సజావుగా నడిపించాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం పాలక పక్షానిదే. ‘నడక’ గురించీ, ‘నడత’ గురించీ ఆట్టే పట్టింపులు లేకపోవడం వల్లనో  ఏమో, ఉభయులూ  ఈ విషయంలో తమ పాత్రలకు సరయిన న్యాయం చేయలేకపోతున్నారన్నది మాత్రం సుష్పష్టం. విలువైన సభాసమయాన్ని వృధా చేస్తున్నారని పాలకపక్షం సభ్యులు, ప్రజా సమస్యలపై సవివరంగా మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని, తమ గొంతు నొక్కుతున్నారనీ ప్రతిపక్షం – సభ లోపలా వెలుపలా ఇలా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం ఈ అయిదు రోజులూ నిత్య కృత్యమైపోయింది. ప్రతి విషయానికీ పోడియంలోకి దూసుకుపోవడం ప్రతిపక్షానికి అలవాటుగా మారితే, ప్రతిపక్ష నేత ఏం మాట్లాడబోయినా దానికి స్వయంగా మంత్రులే అడ్డం పడడం ఓ కొత్త సాంప్రదాయం అయింది. ఇది చాలదన్నట్టు సభలో మాట్లాడింది మరోసారి వినిపించడానికీ, సభలో మాట్లాడలేనిది జనాలకు తెలియచెప్పడానికీ పాలక ప్రతిపక్షాలకు రెండింటికీ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింటే ఉమ్మడి వేదికగా తయారయింది. ఈ మాత్రం దానికి అంతంత ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీ నడపడం ఎందుకు, మీడియా పాయింటు చాలదా  అనే ప్రశ్న సామాన్యుల నుంచి ఉత్పన్నం అయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.         
గతంలో కూడా ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేసేవి. వాటిని తిప్పికొట్టే పద ప్రయోగాలు పాలకపక్షం వాళ్ళు చేసేవాళ్ళు. సభాకార్యక్రమాలు గమనించేవారికి ఆ వాదసంవాదాలు చాలా రసవత్తరంగా అనిపించేవి. మరునాడు దినపత్రికల్లో ఆ వార్తలు  శాసన సభలో ఛలోక్తుల పేరిట ‘బాక్స్ ఐటం’ అర్హతకు  నోచుకునేవి. ఈ రోజుల్లో ఒక్కటంటే ఒక్క వార్త అటువంటిది ఆహ్లాదంగా చదువుకుని ఆనందించగలిగే అవకాశం ఉందా! లేదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు.
పూర్వం  ఇటు శాసన సభలలోను, అటు పార్ల మెంటులోను హేమాహేమీల నడుమ చాలా ఆసక్తికరమైన,  అదే సమయంలో సిద్ధాంతబద్ధమైన చర్చలు సాగుతూ ఉండేవి. అయితే, ఇవేవీ  అసలు విషయానికి అడ్డం పడకుండా, ప్రధాన చర్చనీయాంశం తప్పుదోవ పట్టకుండా ఎదుటి మనిషి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ వారిని  కిక్కురుమనకుండా చేయగలిగే విధంగా సూటిగా హాయిగా జరిగిపోయేవి.               
దశాబ్దాలక్రితం బ్రిటిష్ పార్లమెంటులో ఒక మహిళా సభ్యురాలు లేచి నాటి ప్రధాన మంత్రి చర్చిల్ ని పట్టుకుని ‘నువ్వొక తాగుబోతువి’ అని దులిపేసింది. దానికాయన నొచ్చుకోకుండా ఇలా జవాబిచ్చాడుట.  ‘నిజమే! నేను తాగుబోతునే. కాకపొతే రాత్రి యెంత తాగినా తెల్లారేసరికల్లా మళ్ళీ మామూలు మనిషిని  అవుతాను. కానీ, నీ విషయం అట్లా కాదే, నువ్వొక అనాకారివయ్యే!’.  పొద్దున్న కల్లా నా మైకం తగ్గిపోవచ్చు కానీ ఎన్నాళ్ళు గడిచినా నీ అనాకారితనం అలాగే ఉంటుందన్నది చర్చిల్ మహాశయులు సుతిమెత్తగా అంటించిన వ్యాఖ్యలో దాగున్న శ్లేష. 
తోక టపా: చాలా ఏళ్ళక్రితం  ఏదో పత్రికలో ఓ జోక్ వచ్చింది. ఒక నిర్మాత తాను   తీయబోయే సినిమా కోసం ఘాటుగా రెండర్ధాలు వచ్చే సంభాషణలు రాయమని ఓ రచయితను కోరాడట.  దానికారచయిత – ‘ఇప్పుడు సినిమా రంగంలో అలాంటి  వాళ్ళెవ్వరూ లేరు, అంతా  రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు’ అంటాడు.
అయితే,  ప్రస్తుతం ఆ పరిస్తితి వున్నట్టు లేదు. రెండర్ధాలు వచ్చే పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. నేరుగా అర్ధం ధ్వనించే వాటినే వాడేసినా  అభ్యంతర పెట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడందరూ  అలాటి మాటలకే అలవాటు పడిపోయారు కాబట్టి.  (05-09-2015)   
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి