29, సెప్టెంబర్ 2015, మంగళవారం

నోటికి తాళం


పెదవి దాటిన  మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఇంగ్లీష్ లో ఓ  కధ నెట్  సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషి. వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఆయనకో అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయనకో  హాబీ. అందులో భాగంగా, ‘పక్కింటి కుర్రాడు దొంగ’ అంటూ తేలిగ్గా అతడిపై  ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ‘ఆ కుర్రవాడు నిజంగానే నిజం దొంగ’ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే  ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతా విని, అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు,  విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు.  ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి  కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే.  గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని  కూడా. అవి అవతలి వ్యక్తికి  చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే   ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం  అసలేమీ చెప్పకపోవడం మంచిది.
మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.

నీతి: నోటికి ఇలా  తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.
NOTE: Courtesy Image Owner 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి