8, జులై 2015, బుధవారం

పవ'నిజం'

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-07-2015, THURSDAY)

దీపావళి రాత్రి కాల్చి పారేసిన టపాసుల్లో కొన్ని మరునాడు కూడా పేలుతుంటాయి. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం కూడా కొనసాగుతోంది.


'ఇంతకీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి' అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అన్వయించుకుని భాష్యాలు చెబుతున్నారు. మాయాబజార్ సినిమాలో 'ప్రియదర్శిని' పేటిక గుర్తుంది  కదా! అది తెరిచి చూసినవారికి, వారికి ఇష్టమైన వ్యక్తులే అందులో కానవస్తారు. పవన్ వ్యాఖ్యలు కూడా అంతే. ఎవరికి నచ్చిన రీతిలో వారికి కనబడుతున్నాయి. వినబడుతున్నాయి.
'మొత్తం మీద పవన్  ఏమన్నారు' అన్న దానికంటే ఆయన అన్నదానిలో ఒక్కో ముక్కను పట్టుకుని విరగ్గొట్టి చేస్తున్న వ్యాఖ్యానాలే బాగా వినబడుతున్నాయి. కొన్ని టీఆర్ఎస్ కు అనుకూలంగా, మరికొన్ని టీడీపీకి అనుకూలంగా వున్నాయి. అంతే అయితే పేచీయే లేదు. కానీ కొన్ని వ్యాఖ్యలు టీడీపీకి గుండెల్లో గుచ్చినట్టుగా వుంటే మరికొన్ని టీ.ఆర్.ఎస్. వర్గాలకు మింగుడు పడని విధంగా వున్నాయి. అంటే, 'అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సినిమా వుండాల'నే సినీ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగానే  పవన్ వ్యాఖ్యల తీరు వుందని  విశ్లేషించిన వారున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే, తాను ఒడ్డున తీరిగ్గా  కూర్చుని, ఇద్దరు తెలుగు ప్రభుత్వాధినేతలకు పెద్దమనిషి తరహాలో  సలహాలు, సూచనలు ఇస్తున్నవిధంగా పవన్ ప్రసంగం సాగింది. ఇతరులు చెప్పే నీతి  పాఠాలు వినే పరిస్తితిలో ఉభయ రాష్ట్రాల అధినేతలు వున్నారనుకునే పరిస్తితి  కూడా లేదు. పవన్ ప్రస్తావించిన అంశాలు తెలియనంత రాజకీయ అజ్ఞానులు కూడా వారు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వారి వారి రాజకీయాలకు అనుగుణంగా వారి ఎత్తుగడలు వుంటున్నాయి. వాటి పరిణామాలు, పర్యవసానాలు యెలా వుంటాయన్నది తెలియని వారు కూడా కాదు. ఒక సినీ నటుడుగా  పవన్ కళ్యాణ్ కు వున్న  బలం ఏమిటో కూడా ఆ ఇద్దరు అధినేతలకు తెలుసు. అందుకే పవన్ వ్యాఖ్యలపై ఆయా పార్టీల ప్రతినిధులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యానాలు తప్పిస్తే నేరుగా వారిద్దరూ నోరు తెరిచి మాట్లాడింది లేదు.
'పవన్ వ్యాఖ్యలు ఏ ముక్కకు ఆ ముక్క వింటే ఒక అర్ధం ధ్వనిస్తోంది. మొత్తంగా వింటే మొత్తం అర్ధమే మారిపోతోంద'ని పవన్ ప్రసంగం టీవీల్లో చూసిన కొందరు వ్యాఖ్యానించారు. పరస్పర విరుద్ధమైన విషయాలను ఒకేతడవ పేర్కొనడం వల్ల ఆయన అభిప్రాయాల్లో  కొంత స్పష్టత లోపించిందని కూడా మరికొందరు భావించారు.
హైదరాబాదులో సెక్షన్ ఎనిమిది అమలు చేయడం మంచిది కాదనీ, అందుకు తాను వ్యతిరేకమని అన్నారు. ఆ సెక్షన్  అమలుచేస్తే తెలంగాణా ఇచ్చిన ఆనందం తెలంగాణా వారిలో ఆవిరి అయిపోతుందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. హైదరాబాదులో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడే ఈ సెక్షన్ అమలుచేయాలన్నారు. ఏపీ సీఎం మీద కేసు పెట్టినప్పుడో మరొకప్పుడో కాదని ముక్తాయింపు కూడా  ఇచ్చారు.  ఈ అంశం మీద కంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరింత ప్రయోజనకారి అయిన 'ప్రత్యేక హోదా' సాధనపై దృష్టి సారించడం మంచిదన్నారు.     
పనిలో పనిగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ కితాబు ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా ఆయన చేపట్టిన 'యాదాద్రి' (యాదగిరిగుట్ట) సుందరీకరణ, అభివృద్ధి పధకం ప్రధాన రూపశిల్పిగా విజయనగరానికి చెందిన ఆంధ్ర ప్రాంతపు నిపుణుడిని నియమించడం ముదావహమన్నారు. 'మహబాగా చెప్పాడు' అని టీ.ఆర్.ఎస్. శ్రేణులు ముచ్చట పడేలోగా ఆ పార్టీకి ఓ చురక అంటించారు. 'టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తమ పార్టీలోకి తీసుకుపోగలరే కాని, ఆయన్ని గెలిపించిన సనత్ నగర్ నియోజక వర్గం ప్రజల ఆలోచనలు, మనసుల్ని మార్చగలరా?' అని సూటిగా ప్రశ్న సంధించారు.
ఆంధ్ర ప్రాంతపు తెలుగు దేశం ఎంపీలు కొందరిపై ఘాటయిన వ్యాఖ్యలు చేశారు. 'పోరాడి సీటు సంపాదించుకుని గెలిచిన వాళ్లు ఇప్పుడు  ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడడంలో ఎంపీలు చేసింది ఏమీ లేదని అన్నారు. టీడీపీ ఎంపీల పేర్లతో పాటు, బీజేపీ కి చెందిన ఆంధ్ర పార్లమెంటు సభ్యుల పేర్లను కూడా అయన బాహాటంగా ప్రస్తావించడం, వారిలో కొందరు కేంద్ర మంత్రులు వుండడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, 'తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే పౌరుషం లేని ఆంధ్ర ఎంపీల్లా పడాలి' అనే పవన్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అలజడి సృష్టించాయి.              
కాకపొతే ఈసారి పవన్ ఎక్కుపెట్టిన బాణాలు  రెండు పార్టీమీద అయినప్పటికీ, వాటిల్లో చురుక్కుమనేవి, చివుక్కుమనిపించేవి తగిలింది మాత్రం టీడీపీకే  అన్నది సుష్పష్టం. ఓటుకు నోటు కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రావారి గురించి ప్రస్తావించేటప్పుడు 'ఆంధ్రోళ్లు' అంటూ కొందరు  టీ.ఆర్.ఎస్. అగ్ర నాయకులు  హీనంగా మాట్లాడుతున్నారని చెప్పిన  విషయాన్ని  మినహాయిస్తే,  పవన్ ఎక్కువగా తన మాటల తూటాలు టీడీపీ మీదనే ఎక్కువగా గురిపెట్టి పేల్చినట్టు కానవస్తోంది. ఒక కేంద్ర మంత్రితో సహా టీడీపీ కి చెందిన పార్లమెంటు సభ్యులు అనేకమంది పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ స్పందించిన తీరు, వివరణ ఇచ్చిన విధానం  ఇందుకు తార్కాణం.       
సెక్షన్ ఎనిమిది విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యల కన్నా వారి వ్యాపారాల ప్రసక్తి తీసుకువస్తూ ఆయన చేసిన ప్రస్తావనలు వారిని బాగా కదిలించినట్టు కానవస్తోంది.
రెండు తెలుగు రాష్టాల నడుమ తలెత్తే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలతో కమిటీ వేయాలని సలహా ఇచ్చారు. ప్రధాన మంత్రి మోడీ కల్పించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని పవన్ కోరారు.
ఒక రకంగా పవన్ వున్న మాటే చెప్పారని సోషల్ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు  చీటికీ మాటికీ కలహించుకోవడం తగదనీ, చిన్న చిన్న తగాదాలను తెగే దాకా లాగి పెద్దవి చేసుకునే దానికన్నా కాస్త సంయమనంతో సహకరించుకుంటూ పోతే ఉభయ రాష్ట్రాలకు  మంచిది' అని చాలామంది మనస్సులో వున్న మాటే ఆయనా చెప్పారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సయితం ఇంత విస్పష్టంగా కాకపోయినా ఆయన సహజసిద్ధమైన రీతిలో, ఆ పదవికి వున్న పరిమితుల్లో ఇదే రకమైన సలహా, కాకపొతే, కాస్త క్లుప్తంగా చెప్పారు. దాన్నే పవన్ మరింత పెద్దది చేసి,  పెద్ద తెరపై సినిమా చూపినట్టు విస్తృతంగా, విపులంగా చెప్పారని పవన్ అభిమానులు అంటున్నారు.
ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పౌరుడిగా కూడా తన మనస్సులోని మాటను బయటకు చెప్పే హక్కు, స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ కు వున్న మాట నిజమే. అయితే, రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిలబడకుండా, నిలబడ్డవారిలో కొందరి విజయానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అయి, ఆ మాట వారిచేత కూడా చెప్పించుకుని రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సయితం ఒక స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నుంచి, ఆయన అభిమానులు, లేదా రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నవారు కోరుకునేది, కోరుకుంటున్నది  వేరే వుందని పవన్ కళ్యాణ్ కానీ, ఆయనకు  అన్నుదన్నుగా వున్నవారు కాని గ్రహిస్తే మంచిది. ఇలా అప్పుడప్పుడూ రాజకీయాకాశంలో తళుక్కుమని మెరుస్తూ, చురుక్కుమనే వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ 'పార్ట్ టైం పొలిటీషియన్' అనే ట్యాగ్ లైన్ తో సరిపుచ్చు కోకుండా, తనదైన తరహాలో పూర్తి స్థాయి రాజకీయాలు నడపడం వల్ల కొంత ప్రయోజనం వుండే అవకాశం వుంది. లేకపోతే, 'లాభనష్టాలను ఎప్పటికప్పుడు  బేరీజు వేసుకుంటూ, రెండు పడవలపై జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు' అనే అపప్రధ మోయాల్సి వుంటుంది.   
వరసగా రెండేళ్లు సినిమాలు లేకపోతే నటీనటులను ప్రేక్షకులు మరచిపోతారు. రాజకీయ కార్యకర్తలు ఇందుకు భిన్నం కాదు. తమ నాయకుడు ఎప్పుడూ తమకు అందుబాటులో వుండాలని, తమ నడుమే వుండాలని కోరుకుంటూ వుంటారు. రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్లు ఈ విషయం గమనంలో వుంచుకోవాలి. (08-07-2015)
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి