11, జులై 2015, శనివారం

ఫస్ట్ డే ఫస్ట్ షో - బాహుబలి


(TO BE PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 12-07-2015, SUNDAY)

  

"ఇస్రో భారీ వాణిజ్య ప్రయోగం - అయిదు  విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి చేర్చే ప్రయత్నం"
"బాహుబలి వాణిజ్య ప్రయోగం - భారత చలనచిత్ర చరిత్రలో సరికొత్త యత్నం"
నిన్న మొన్నటి వరకు ఈమాదిరి ప్రచారాలు సాంఘిక మాధ్యమాలను ముంచెత్తివేశాయి.
ఇస్రో ప్రయోగం విజయవంతం అయింది. అయిదు విదేశీ ఉపగ్రహాలను జయప్రదంగా నిర్దేశిత సమయానికి వాటి వాటి కక్ష్యల్లో  ప్రవేశపెట్టింది. ఏతావాతా వాణిజ్యపరంగా కూడా దేశానికి కోట్లాది రూపాయలు ఖజానాలో పడ్డాయి.
అదే సమయంలో 'బాహుబలి' అనే పేరుతొ ఒక తెలుగు సినిమా కూడా ఓ కొత్త ప్రయోగం చేసింది. ఇస్రో ప్రయోగం మాదిరిగా దీని ఫలితాలు  నిమిషాల్లో తేలిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా  తేలడానికి కొంత వ్యవధానం అవసరం. ఒక సినిమా జయాపజయాలను ముందుగానే పసికట్టి చెప్పగల శాస్త్రీయ విధానాలు లేకపోయినప్పటికీ, సాంఘిక మాధ్యమాల్లో వెలువడుతున్న అభిప్రాయాలను బట్టి ఫలితం నిరాశ కలిగించేదిగా లేదని మాత్రం అర్ధం అవుతోంది. ఈ సినిమా జయప్రదం అయితే ప్రపంచంలో తెలుగు సినిమాకు యెనలేని గౌరవం దక్కే వీలుందని నమ్మే వాళ్ల  సంఖ్య  కూడా తక్కువేమీ కాదు.
ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనేది సాధారణ జనాలకి  అవసరం లేని సంగతే. అది ఫక్తు వాణిజ్య వ్యవహారమే. నిర్మాతలకు, ఆ సినిమా నిర్మాణంతో ఎంతో కొంత సంబంధం వున్న వాళ్లకు మాత్రమే పరిమితమైన విషయమే. అయితే, ఈ సినిమా గురించి కొంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్తితి అయితే వుంది.
ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా మిగిలిపోగలదని సినిమా నిర్మాణం మొదలయిన నాటి నుంచీ చర్చలు మొదలయ్యాయి. 'ఒక సినిమా నిర్మించడానికి ఇన్నిన్ని కోట్లు ధారపోయాల్సిన అవసరం ఏముంద'ని కొందరు అంటే, 'అంతంత  భారీ వ్యయంతో సినిమాలు నిర్మించే స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ లేద'ని మరికొందరు అన్నారు. 'సినిమా అంటేనే దృశ్య కావ్యం. కన్నుల పండువగా రూపొందించాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు' అనేవాళ్ళూ వున్నారు. 'ఈ సినిమాలో ఏముంది? యెలా తీసారు? యెలా ఆడుతుంది?' అనే ప్రశ్నలు జనాలకు అప్రస్తుతం. సినిమా బాగుందా  లేదా అనేదే వారికి ముఖ్యం. బాగా ఆడుతుందా లేదా అనేది వారికి పట్టదు. కానీ 'బాహుబలి'  సినిమా విడుదలకు ముందూ, సినిమా నిర్మాణ సమయంలోనూ  ఉవ్వెత్తున లేచి పడ్డ వూహాగానాలు, వాటి పూర్వాపరాలు చర్చించుకోవాల్సిన అగత్యం అయితే వుంది.
సినిమా అంటేనే వినోద ప్రధానం. సినీ పరిశ్రమ అంటేనే వినోద పరిశ్రమ. అయితే ఈ రంగంలో పరిస్థితులు మునుపటి మాదిరిగా లేవు.  సినిమా సినిమాకు నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. మార్కెట్ కు మించి ఖర్చు చేసే నిర్మాతలు ఎక్కువయ్యారు. పూర్వం 'పిండి కొద్దీ రొట్టె' అనే సిద్ధాంతాన్ని నిర్మాతలు నమ్ముకుంటే, ఈనాడు 'రొట్టెల సంఖ్య బట్టి పిండి సమకూర్చుకోవాల'నే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ సినిమాతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీ దారులు, థియేటర్ల వాళ్లు అందరూ పదికాలాల పాటు పచ్చగా వుండే పరిస్తితి నేడుంది. అదే సినిమా ఫట్టు మంటే, ఇక అందరి పని గోవిందే. అందుకే సినిమా విడుదలకు ముందు వారందరిలో ఏమవుతుందో అనే  బెంగ ప్రస్పుటంగా కానవస్తుంది.
పూర్వం కూడా అన్ని సినిమాలు బాగా ఆడేవి కావు. కొన్నిటికే ఆ అదృష్టం పట్టేది. కాకపొతే పెట్టుబళ్ళు పెట్టినంత తిరిగి రాకపోయినా మరో సినిమా తీసి అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఎంతో కొంత వుండేది. ఇప్పుడలా కాదు. సినిమా జయాపజయాలు కొందరి జీవితాలను ఆటో ఇటో తెల్చివేసే  విధంగా పరిస్థితులు మారిపోయాయి. కాబట్టే వినోద ప్రధానపైన ఈ రంగంలో అవాంఛనీయమైన వాణిజ్య ధోరణులు ప్రబలి పోతున్నాయి. 'ఎవరు ఏమైపోయినా పరవాలేదు తాము బాగుపడితే చాలు' అనే తరహాలో వ్యక్తుల నడుమ సంబంధాలు వుంటున్నాయి. ఒక సినిమా హిట్టు అనే మాట బయటకు  వస్తే పరవాలేదు.  'ఫట్టు' మంటే మాత్రం   కొందరు మట్టికొట్టుకు పోతారు. అయినా కొందరు  'సేఫ్ జోన్' లోనే వుండిపోతారు. అనారోగ్య ధోరణులకు ఇదే పరాకాష్ట.     
సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం అనేది ఒక్క తెలుగు చలన చిత్ర రంగానికి మాత్రమే పరిమితం కాదు. కన్నడ, మళయాళ రంగాలను మినహాయిస్తే  అనేక భాషల చిత్రాల విషయంలో ఇది వర్తిస్తుంది. కాకపోతే తెలుగు చిత్ర సీమలో ఈ మార్పు ఎక్కువగా కానవస్తోంది. హాలీవుడ్ లో కూడా ఈ ధోరణి వుంది. అనేక చారిత్రిక నేపధ్యం కలిగిన సినిమాలు ఎంతో ఖర్చుపెట్టి తీసారు. వసూళ్లు కూడా అదే రీతిలో వచ్చాయి.
సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడానికి కారణం ఎవరయినా కావచ్చు కాని  ప్రేక్షకులు మాత్రం కాదు. పెద్ద పెద్ద సెట్ట్టింగులు, విదేశీ లోకేషన్లు, భారీ తారాగణం లేని చిత్రాలను కూడా ఆదరించి కాసులు కుమ్మరించిన చరిత్ర తెలుగు ప్రేక్షకులది. కాని అపప్రద మాత్రం వారే మోస్తున్నారు. 'వారు అలానే చూస్తున్నారు కాబట్టే మేము ఇలానే తీస్తున్నాం' అనే నిర్మాతలకు కొదవలేదు.                   
"జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?" అని పాతాళభైరవి సినిమాలో మాయల పకీరు చేత ఆనాడే చెప్పించారు, 'సినిమా యెలా తీయాలి, సినిమా యెలా వుండాలి'  అనే విషయంలో అలనాడే ప్రేక్షకుల నాడి పట్టుకున్న నాగిరెడ్డి, చక్రపాణి ద్వయం.
ఒక సినిమాకు డబ్బు పెట్టడం, తిరిగి రాబట్టుకోవడం ఆ నిర్మాతల సమస్య. ముందే చెప్పినట్టు దానికీ,  జనాలకు సంబంధం లేని విషయం.
అయితే ప్రజలకు సంబంధం వున్న కొన్ని అంశాలు బాహుబలి సినిమా విడుదల సందర్భంగా చర్చకు వచ్చాయి.
ఒక సినిమా టిక్కెట్టు ధర ఎవరు నిర్ణయించాలి? ఆ సినిమా తీసిన వాళ్ళా? దాన్ని చూసేవాళ్ళా? ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వాళ్ళా? లేదా ఒకవైపు  వినోదపు పన్ను అప్పనంగా  వసూలు చేస్తూ, మరోవైపు సినిమా టిక్కెట్ల ధరవరల విషయంలో  'పేను పెత్తనం' చేసే ప్రభుత్వాలా?     
కారు తయారు చేసేవాడు దాని ధర  మార్కెట్ పరిస్తితులను బట్టి నిర్ణయించుకోగలుగుతున్నాడు. పచ్చి మిరప కాయ బజ్జీలు అమ్మేవాడు గిరాకీని  బట్టి ధర నిర్ణయించుకోగలుగుతున్నాడు. మరి కోట్లు ఖర్చుబెట్టి సినిమాలు తీసేవాళ్లకు  కూడా ఆ వెసులుబాటు యెందుకు వుండకూడదు? బాహుబలి సినిమా విడుదల సమయంలో మరోసారి చర్చకు వచ్చిన ప్రశ్నఇది. మరి ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతుకు కూడా తన పంటకు తాను ధర నిర్ణయించుకునే హక్కు వుండాలి కదా! కానీ, సినీ వాణిజ్య వర్గాల మాదిరి తమ గోడు చెప్పుకునే వెసులుబాటు వారికి లేదు. చెప్పినా వినిపించుకునే నాధుడు లేడు. ఆ విషయం పక్కన పెడదాం.  
గతంలో అద్భుతమైన సాంకేతిక ప్రతిభ కనబరచిన మాయాబజార్, పాతాళభైరవి వంటి సినిమాలను హై క్లాసులో కూర్చుని చూసిన వాళ్లు ఎక్కువ రుసుము చెల్లించిన దాఖలాలు లేవు. కానీ అవి విజయవంతం అవడమే కాకుండా నిర్మాతలపై కాసుల వర్షం కురిపించాయి. అప్పుడు ఒక పట్టణంలో రెండు థియేటర్లలో ఒక సినిమా ఒకేసారి విడుదల అయితే గొప్పగా చెప్పుకునే వారు. 'విజయవంతమయిన సంయుక్త రెండో వారం' అంటూ పోస్టర్లు వేసుకునేవారు. ఇప్పుడో. ఒక పెద్ద చిత్రం విడుదల అయ్యిందంటే మొత్తం వూళ్ళో వున్న అన్ని థియేటర్లలో అదే చిత్రం. అంటే  ఆ చిత్రం తప్ప వేరే యే చిత్రం చూసే అవకాశం ప్రేక్షకులకు లేకుండా చేయడమన్న మాట. అంటే అన్ని చిత్రాల వసూళ్ళను ఒక్క చిత్రం తాలూకు నిర్మాతలే కొన్ని రోజులపాటు  కొల్లగొట్టడం అన్నమాట. మొనోపలీ నియంత్రణ చట్టం ఇలాటి వాటికి వర్తిస్తుందో లేదో న్యాయకోవిదులే చెప్పాలి. ఒక చిత్రం పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తిని ప్రేరేపించి హెచ్చు రేట్లకు టిక్కెట్లను  ఎగబడికొనేలా చేయడం వాణిజ్య సూత్రాలకు అనుగుణ్యంగా వుండవచ్చునేమో కానీ, నైతికంగా సమర్ధనీయం అనిపించుకోదు. కాకపొతే ఈ విషయంలో ఒక్క సినిమా వారినే నిందించే పనిలేదు. డిమాండును బట్టి చార్జీలు పెంచే పని ఇప్పుడు అందరూ చేస్తున్నారు. విమానాల టిక్కెట్లు, రైలు, బస్సు టిక్కెట్లు ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ సంస్థలే ప్రయాణీకుల అవసరాలను బట్టి అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు ప్రైవేటు వారిని ఏమంటాం? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేయదు కదా!          
ఒక సినిమా జయప్రదం అయితే సినీ రంగాన్ని నమ్ముకున్న వేలాదిమందికి ఉపాధి గ్యారంటీ వుంటుందని, అంచేత స్వపర భేదం లేకుండా అన్ని సినిమాలు బాగా ఆడాలని మనసారా కోరుకోవాలని  సినిమా రంగానికి చెందిన ఒక పెద్దమనిషి పెద్దమనసుతో చెప్పారు. ఆయన చెప్పింది సబబే. సినిమాలు విజయవంతం కావాలి. విజయవంతమైన సినిమాలే రావాలి. విజయంతో పాటు ప్రేక్షకుణ్ణి రంజింప చేయడం కూడా ముఖ్యం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా సినీ రంగం పంచగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎందుకంటే ప్రజలని అత్యంత ప్రభావితం చేసే శక్తి వున్న మాధ్యమాల్లో సినిమా కూడా ఒకటి కాబట్టి. (11-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్ : 98491 30595
NOTE: Image Courtesy : Kouturi Anurag (USA) 

2 కామెంట్‌లు:

  1. కధ చూస్తే ఓ మోస్తరుగానే ఉంది?ఐ కూడా ఇంత హైప్ వల్లనే చతిలబడిందని చూసినవాళ్ళు అన్నాతు.బాహూబలికి ఆ పరిస్థితి తప్పీతే మంచిదే!!

    రిప్లయితొలగించండి
  2. " "సినిమాను తక్కువగా అంచనా వేయకండి. సినిమావాళ్ళు ఏదో ఒకనాడు మానవాళికి శాసనకర్తలవుతారు" అని జార్జ్ బెర్నార్డ్ షా ఏనాడో భవిష్యద్దర్శనం చేసారు. " "
    ---------------------
    పైవాక్యం ఈ నెల 9వ తేదీ (Thursday July 09, 2015) " ఈనాడు " దినపత్రికలో సంపాదకీయంలో భాగంగా వ్రాసారు (సెన్సార్ బోర్డ్ లో అవినీతి గురించి వ్రాస్తూ).

    ఈనాడు సమాజంలో అధిక సంఖ్యాకుల జీవనసరళిని, ఆలోచనల్ని సినిమా ఎంతగా కమ్మేసిందో చూస్తుంటే షా మహానుభావుడు ఎంత దూరదృష్టితో చెప్పాడా అని ఆశ్చర్యం వేస్తుంది. "............ ప్రజలని అత్యంత ప్రభావితం చేసే శక్తి వున్న మాధ్యమాల్లో సినిమా కూడా ఒకటి కాబట్టి " అని మీరన్నది షా చెప్పిందానికి సరిపోతుంది.

    రిప్లయితొలగించండి