తప్పనిసరయి ఇక
తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని
అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా
మానేసి 'టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప' – అన్నాడో టీవీ విప్లవకవి.
వెనుకటి రోజుల్లో,
'ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది' అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ
ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేసిన తరువాత మొదలయిన ఊకదంపుడు చర్చలు
చూస్తునప్పుడు – 'ఆ పేడా పిడకలే నయమ'నే వారు
ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్
లు’, మధ్యమధ్యలో
విలేకరుల విరుపులు, యాంకర్ ల
విన్యాసాలు, ‘లక్ష
వొత్తుల నోములు’ లక్ష
సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రెజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో
వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే
స్క్రోలింగులు, పంటికింది
రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు
ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికటకవి.
టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ, ఆ చర్చలపై మళ్ళీ చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి
తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన
బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల
వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి, ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా
మించిపోయి శృతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు
గమనించేవారికి ‘బ్రోచే
వారెవరురా ‘ అన్న
కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో ‘కరెంటు కోత’ ఒక్కటే తమను
ఈ సజీవ హింస నుంచి కాపాడగలగలదని ‘గజేంద్ర
మోక్షం’ పద్యాలను
తిరగేసి అరగదీస్తుంటారంటూ - ’ఇవా
ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ
రోజు జనం కోరుకుంటున్నది?’అని
బోలెడు బోలెడు ఆవేశపడిపోయాడో వికటాట్ట
కవి.
కానీ, ఇక్కడే
కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి
హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు
కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను
రోట్లోనే వుంచేసి ‘రోకటి
పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించడం
ఒక్కటే శరణ్యం – అంటూ సెలవిస్తున్నాడో ఉచిత
సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘ముఖ్యమంత్రి
గారు ఢిల్లీ బయలు దేరారు'
ముఖ్యమంత్రిగారు శంషాబాదు
విమానాశ్రయం చేరుకున్నారు'
'ముఖ్యమంత్రిగారు ఢిల్లీ
విమానం ఎక్కారు'
'ముఖ్యమంత్రిగారు
కొద్దిగంటల్లో ఢిల్లీ చేరుకుంటారు'
'ముఖ్యమంత్రిగారు మరి
కాసేపటిలో ఢిల్లీ చేరుకుంటారు' (ఢిల్లీ విమానం ఎక్కిన వాళ్లు వెళ్ళేది ఢిల్లీయేకదా,
డెహ్రాడూన్ వెళ్ళరు కదా అనే పిచ్చి అనుమానాలు పెట్టుకోకండి.
నిజంగా పిచ్చెక్కవచ్చు)
‘ఎంతో
ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న
చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే,
ఇప్పుడే చూడండి.’
వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’
తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు
ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ ఛానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన
మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. శేష జీవితానందాన్ని ఆ
రోట్లోనే వెతుక్కోండి. శుభం భూయాత్! (Still,
I am proud to be called a media man)
NOTE:
Courtesy Image Owner
అరుదుగా, అదీ మా ఇంటికి అతిధులు వచ్చి పెట్టమన్నప్పుడో లేదా ఎవరింటికి అయినా వెళ్ళినప్పుడు వాళ్ళు పెడితేనో తప్ప నేను తెలుగు వార్తా ఛానళ్ళు చూడనండీ. అంత మనో నిగ్రహం నాకు వుండటం నా అదృష్టం. కాదంటారా?
రిప్లయితొలగించండి@శరత్ కాలమ్ - గతంలో మాజీ ప్రధాని చరణ్ సింగ్ తరచుగా చెప్పేవారు, పేపర్లు చదవను, రేడియో వినను, అదే నా ఆరోగ్యం రహస్యం' అని.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచ చ ! ఈ పదవీ విరమణ చేసిన వాళ్లకి ఉద్యోగం చేసే వాళ్ళంటే మరీ చెడామడాయింపు :)
ఎంత మంది జనతా కి టీ వీ వాళ్ళు ఉద్యోగం సద్యోగమో కాక పోయినా తిండి కి ఉద్యోగం పెడతా ఉంటె మీరేమో ఇట్లా అంటారు :)
ఎంతైనా మీడియా వాళ్ళం అని చివరాఖరు కి కలి 'పీసు' కున్నారు చూసేరు అదీ మెచ్చుకో దగ్గ మాట
మన మీడియా వాళ్ళని మనం షుడ్ నాట్ పుల్ లెగ్ !:)
ఆ ప్రకటనల వల్ల (నెస్లే వాళ్ళ ప్రకటన ల బడ్జెట్ ఎంతో ఈ మద్య పేపర్లో వచ్చింది ఉదాహరణ కి ) ఎంత మంది కి సైడు ఉద్యోగాలు
వాళ్ళంతా మీడియా దేవి కి రోజూ దండం బెట్టి జిలేబమ్మ తల్లీ ! నీ దయతో మాకు మంచి రోజులు ఇంకా ఇంకా కలిగేటట్టు చేయవూ అని వేడుకోవటం లేదూ :)
చీర్స్
జిలేబి