30, జూన్ 2015, మంగళవారం

ఒక్కసారి రైలెక్కాలని వుందొదినా!


"ఈ మాట అనకపోయినా బాగుండేదని ఆ సాయంత్రం ఓ లక్ష సార్లయినా అనుకుని వుంటాను. కానీ బంగారు లేడి కోరిక కోరి భర్తకు దూరమయిన సీతాదేవి, ఆ  తరువాత  యెంత పరితపించివుంటే మాత్రం  ఏం లాభం? అయితే  సీతకు దొరకని ఆ బంగారు లేడి, దేశం కాని దేశంలో భాష కాని భాష మాట్లాడే ఓ 'లేడీ' రూపంలో  నాకు దొరికింది" అంది మా మేనకోడలు పలివెల జయ.
జయకు కబుర్ల పోగు అనే పేరుంది. గలగలా మాట్లాడుతుంది. అంతే కాదు విన్నంతసేపు ఇంకాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించేలా వుంటుందా వాక్ప్రవాహం.


(శ్రీమతి జయ పలివెల)



(శ్రీ పలివెల సుబ్బారావు)


పిల్లలు ముగ్గురూ వివిధ దేశాల్లో వుండడం మూలాన అమెరికా, ఆస్త్రేలియాలే కాకుండా పనిలోపనిగా జయ ఆడపడుచు వాళ్ళుండే న్యూజిలాండ్ కూడా చుట్టబెట్టుకొచ్చారు జయ, సుబ్బారావు దంపతులు. ఆ  నానాదేశ సందర్శన సందర్భంలో న్యూజిలాండులోని ఆక్ లాండులో జరిగిందీ సంఘటన.
'ఎప్పుడూ విమానాలు కార్లేనా ఒక్కసారన్నా రైలెక్కకపోతే యెట్లా' అన్నది జయ మనసులోని మాట. మా మేనకోడలు పుట్టిపెరిగిన ఖమ్మం మామిళ్లగూడెంలోని వాళ్ల పుట్టిల్లు రైలుకట్ట పక్కనే వుంది. రైలు చూడకుండా, రైలు కూత వినకుండా వాళ్లకు పూటగడవదు. అందుకే కాబోలు న్యూజిలాండులో రైలెక్కి తిరగాలన్న కోరిక కలిగినట్టుంది.
'రైలేనా! అదెంత భాగ్యం' అన్నది వాళ్ల ఆడపడుచు రూప. అంతే. ఆరోజు కారెక్కించుకుని వూర్లోని  వింతలూ విశేషాలు చూపిస్తున్న రూపకు, జయ కోరిన కోరిక గుర్తొచ్చి కారును రయ్యిమని దగ్గర్లో వున్న రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి ఆపింది. కారును పార్కుచేయడం, దగ్గర్లో వున్న మరో స్టేషనుకు టిక్కెట్లు కొనుక్కోవడం, ప్లాటుఫారం మీద రైలుకోసం ఎదురుచూస్తూ వుండడం క్షణాల్లో జరిగిపోయింది. ఇంటినుంచి తెచ్చుకున్న పులిహార పొట్లం వున్న సంచిని భద్రంగా చేతుల్లో పట్టుకుని,  నగలు నాణ్యాలు (వెయ్యి డాలర్లు) వున్న చేతి సంచిని ప్లాటుఫారం మీదనే వుంచి ఆడపడుచుతో కబుర్లలో పడింది. ఇంతలో రైలు రావడం, ఆగీఆగనట్టుగా ఓ లిప్తపాటు ఆగిన రైల్లోకి గబగబా ఎక్కి సీట్లలో జారగిలబడడం కూడా క్షణాల్లో జరిగిపోయింది.  సీట్లు దొరకడంతో మళ్ళీ మాటలు మొదలయ్యాయి. మాటల మధ్యలో డబ్బూ, బంగారం వున్న తన చేతి సంచీ జ్ఞాపకం వచ్చింది. అది చేతిలో లేకపోవడం చూసి గుండెల్లో గాభరా మొదలయింది. ప్లాటుఫారం మీద మర్చిపోయి రైలెక్కిన సంగతి కూడా నెమ్మదిగా గుర్తుకు వచ్చింది. కానీ ఏం లాభం అప్పటికే రైలు రెండు మూడు స్టేషన్లు దాటివచ్చింది. అందరూ గబగబా పక్క స్టేషన్ లో దిగి, మళ్ళీ తిరుగు  రైలు పట్టుకుని మొదటి స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ స్టేషన్  మాదిరిగానే వుంది, ఒక్క చేతి సంచీ తప్ప. ప్లాటుఫారం మీద హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న వీళ్ళని చూసి ఓ న్యూజిలాండు లేడీ పలకరించింది. 'మీరు మరచిపోయిన చేతి సంచీ మీ పక్కన కూర్చున్న మరో ప్రయాణీకురాలు తీసుకుంది. ఆవిడ అర్జంటు పని మీద వెడుతున్నారల్లే వుంది. సాయంత్రం అయిదు లోపల మళ్ళీ ఇక్కడికి వస్తాను. సంచీ తాలూకు వాళ్లు వస్తే మీలో ఎవరయినా ఈ సంగతి చెప్పండి' అంటూ హడావిడిగా వెళ్ళిపోయిందం'టూ  చల్లటి కబురు వాళ్ల చెవిలో వేసింది.  ఈ కబురు తెలవడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. కాకపొతే మరికొన్ని గంటలు ప్లాటు ఫారం మీదే గడపాలి. జరిగిన దానినే నెమరు వేసుకుంటూ, తెచ్చిన పులిహారను అయిష్టంగానే లాగిస్తూ మొత్తం మీద ఏదోవిధంగా కాలక్షేపం చేస్తూ కాలం దొర్లించారు. చీకటి పడుతోంది కానీ ఆ బంగారు లేడీ జాడ లేదు. ఆ జాడ చెప్పిన మనిషీ లేదు. దాంతో  సద్దుమణిగిన గాభరా మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటున్న సమయంలో దూరంగా రైలు కూత వినబడింది. ఆగిన రైల్లోనుంచి తొందర తొందరగా దిగిన ఓ లేడీ బిగ్గరగా ఏదో మాట్లాడుతూ హాండ్ బ్యాగ్ వూపుతూ కనిపించింది. చేతి సంచీ కనబడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది జయకు. ఒక్క పెట్టున అటుగా పరిగెత్తుకు వెళ్ళింది. జయను చూడగానే, ఎవరూ ఏమిటి అని అడగకుండా చేతి  సంచీ జయ చేతిలో పెట్టి, 'గోల్డ్ గోల్డ్, కేర్ ఫుల్' అంటూ రైలెక్కి వెళ్ళిపోయింది. కలయా వైష్ణవమాయయా అనుకుంటూ గిల్లి చూసుకున్న జయ సంచీ తెరిచి చూసుకుంటే నగలతో సహా డబ్బూ దస్కం (డబ్బంటే పిల్లాడు ఇచ్చింది, దస్కం అంటే ఇల్లాళ్ళ బ్లాక్ మనీ) అన్నీ పదిలంగా వున్నాయి.
ఏదయితేనేం మొత్తం మీద కధ సుఖాంతం అయింది. ముక్కూమొహం తెలియని ఆ బంగారు 'లేడీ' పోగొట్టుకున్నవన్నీ భద్రంగా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది.
ఇంటికి చేరిన తరువాత జయను ఇంకో సందేహం పట్టి పీడించింది.
'ఈ న్యూజిలాండ్ ఆడవాళ్ళకు డబ్బంటే లెక్కలేదు సరే,  కానీ బంగారం లాంటి బంగారు నగలు కూడా వీళ్ళకు  పనికి రాకుండా యెలా పోయాయబ్బా!'      (30-06-2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి