(Published in 'SURYA' telugu daily, on 03-06-2015, Thursday)
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం గత ఏడాదిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి. కాకపొతే, దిక్కూ దివాణం లేకుండా ఏర్పడ్డ లేదా వేరుపడ్డ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనే ఓ కొత్త రికార్డు మాత్రం చంద్రబాబు ఖాతాలో చేరింది. ఇది మినహాయిస్తే ఆయన సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. పూర్వం అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళ పైచిలుకు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో, 'తన హయాములోనే ఇంతగా అభివృద్ధి చేసాను, తీర్చిదిద్దాను' అని అయన పదేపదే చెప్పుకునే 'ఇల్లు' తనది కాకుండా పోయింది. సొంత ఇంట్లోనే కిరాయికి వుంటూ కొత్త యింటిని చక్కదిద్దుకోవాల్సిన దుస్తితి. అధికారంలోకి వచ్చిన కొత్త రోజులన్నీ పాత వాగ్దానాలను నెరవేర్చడం యెట్లా అన్న అంతర్మధనంలోనే గడిచిపోయాయి. ముఖ్యంగా రైతుల రుణ మాఫీ అంశం ఆయన సమర్ధతతకు సవాలుగా మారింది. ఈ మాట నిలబెట్టుకోవడం అంత సులువయిన పనేమీ కాదు. ఎందుకంటే పరిష్కారం ఆయన ఒక్కరి చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, రుణాలు ఇచ్చిన స్థానిక బ్యాంకులు సహకరిస్తేనే కాని కుదరని సమస్య ఇది. నిజానికి రైతులు చంద్రబాబుకు వోటు వేయడానికి ఈ వాగ్దానం ఓ మేరకు దోహదం చేసివుండవచ్చు కానీ టీడీపీ అధికారంలోకి రావడానికి మార్గాన్ని సుగమం చేసింది రాష్ట్ర విభజన అంశం ఒక్కటే. అందుకే నిరుటి ఎన్నికలకు కొన్ని వారల ముందు వరకు దాదాపు అన్ని సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా అసలు ఎన్నికలు వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది. విభజన నిర్ణయం అనంతరం ఎన్నికలు జరిగాయి. జీర్ణించుకోలేని విధంగా ఆ విభజన జరిగిందన్న ఆక్రోశంలో వున్న సీమాంధ్ర ప్రజలు, సంక్షేమ కోణాన్ని పక్కనబెట్టి 'సమర్ధత' అన్న ఒక్క అంశాన్నే పరిగణన లోకి తీసుకుని చంద్రబాబుకు పట్టం కట్టారు. తీడీపీ అధికారంలోకి వచ్చింది.
అసలే తరుగు బడ్జెట్లో పురుడు పోసుకున్న కొత్త
రాష్ట్రానికి రైతుల రుణ మాఫీ వంటి
పెనుభారం మోసే పరిస్తితిలేదు. కానీ చంద్రబాబు దేన్నీ లెక్కచేయకుండా తన యావత్
శక్తియుక్తులను ఈ హామీ అమలుకే ఖర్చుచేశారు. నిజానికి వున్న వాస్తవాల్ని విడమరిచి
చెబుతే ప్రజలు అర్ధం చేసుకునే పరిస్తితి మొదట్లో వుంది కూడా. అయినా ఆయన, ఇచ్చిన
మాట నిలబెట్టుకోవాలన్న రాజకీయ నాయకుడి తరహాలోనే ముందుకు పోయారుకానీ, రాజనీతిజ్ఞుడి
మాదిరిగా వ్యవహరించలేదని అనిపిస్తోంది. అలవికాకపోయినా మొత్తం మీద పని
అయిందనిపించారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కని చందం అయింది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా
ఈ వాగ్దానం అమలు అరకొర చందమే అనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్తితే ఇంకా వుంది.
అధికారంలో వున్నవాళ్ళు హరా యించుకోలేని వాస్తవం ఇది. అసలు వాస్తవాలను ప్రజలకు
సరిగ్గా వివరించి వుంటే విభజన తీరుతో మానసికంగా గాయపడివున్న ప్రజలు ఖచ్చితంగా సహకరించి
వుండేవారు అనే ఒక వాదన కూడా వుంది.
హుద్ హుద్ తుపాను ఉత్తరాంధ్రను ఒణికించి
వెళ్ళింది కానీ, చంద్రబాబు పాలనాసమర్ధతకు కొలమానంగా నిలిచింది. ఆ తుపాను
సృష్టించిన భీభత్సం నుంచి త్వరత్వరగా బాధిత ప్రాంతాలను బయటపడేసిన తీరు, పునరావాస,
పునర్నిర్మాణ విషయాల్లో సత్వరం స్పందించి తీసుకున్న చర్యలు చంద్రబాబుకు ప్రజల్లో మంచి పేరు కట్టబెట్టాయి. వృద్ధ వికలాంగులకు పెన్షన్లు,
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, ప్రభుత్వ
ఉద్యోగుల జీత భత్యాలు ఇటువంటి వాటిని సంత్రుప్త స్థాయిలో పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు టీడీపీ ప్రభుత్వ ప్రతిష్టను కూడా ఇతోధికంగా
పెంచాయి.
రాజధాని అంశం చంద్రబాబుకు కలిసి వచ్చిన మరో
విషయం.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం
చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ
ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు.
కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా
వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు
అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని పాలకులు
గుర్తుపెట్టుకోవాలి. మొత్తం రాష్ట్ర ప్రజలకు అవసరమైన రాజధాని వంటి అతి ముఖ్యమైన
విషయంలో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని వుంటే మరింత హుందాగా వుండేది.
ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం
పార్టీకి తొలిరోజుల్లో అన్నీ మంచి శకునాలే. అన్నీ కలిసివచ్చిన అంశాలే. కేంద్రంలో
అధికారంలో వున్న బీజేపీ, టీడీపీకి మిత్రపక్షం. ఇక్కడా, అక్కడా ప్రభుత్వంలో
భాగస్వామి. ఢిల్లీ లో ఇతర పక్షాల కంటే టీడీపీ మాటే ఎక్కువగా చెల్లుబడి అవుతుంది. అందుకే
ఏ అవకాశాన్ని ఒదులుకోకుండా పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే ప్రతి పనీ
చేయడానికే చంద్రబాబు ఆయన అహరహం కష్టపడుతుంటారు. కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని
చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి
ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని
చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి.రాజ్యం వుంది
రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా
ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. పాలించే ప్రజలు పొరుగు రాష్ట్రంలో. పాలించే
ప్రభుత్వం ఇరుగు పొడగిట్టని పొరుగు రాష్ట్రంలో. ఇదొక విచిత్రమైన పరిస్తితి. గతంలో
ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని దుస్తితి. ప్రభుత్వం మీద, పాలకుల పని తీరు మీద ప్రజల్లో
విరక్తి మొదలు కావడానికి ఇవి చాలు. అయితే, ఎదురయిన ప్రతి సమస్యను తనకు అనుకూలంగా
మార్చుకునే చాణక్యచాకచక్యానికి చంద్రబాబు పెట్టింది పేరు. అదేమిటో ఈ తడవ సమస్యలే ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. నిజానికి,
ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు
ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా కానీ,
'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే
ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?' అనే సానుభూతి మాత్రం ప్రజల నుంచి లభిస్తోంది. ఈ ఒక్క
విషయంలో చంద్రబాబు అదృష్టవంతుడు అని చెప్పాలి.
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు
కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకం లోలోపల ఉడికిపోతోంది.
అన్యాయం జరిగిపోయిందని మధన పడుతోంది.
ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం తెలంగాణా ప్రాంతంలో మెజారిటీ ప్రజలు ఇలాగే
బాధపడుతూ వచ్చారు. అదే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు
వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా
పోయాయి. ప్రస్తుతం సీమాంధ్రలో దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం
అని వారు రగిలిపోతున్నారు. ప్రజల నాడిని ఒడపోసిపట్టుకునే చంద్రబాబుకు ఈ విషయం బాగా
అర్ధం అయింది. అందుకే ఆయన ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా
చూసుకుంటే చాలు. తెలంగాణాలో సరిగ్గా కేసీఆర్ ఇదే చేసి చూపించారు. ఇంకా
చూపిస్తున్నారు కూడా.
అయితే ఒక విషయం పాలకులు గుర్తు పెట్టుకోవాలి.
ప్రాంతీయ వైమనస్యాలు రాజకీయంగా
ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. దీర్ఘ కాలికంగా ఉపయోగపడే రాజకీయ ఎత్తుగడ అనిపించుకోదు. పైగా
రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మరింత అఘాధాన్ని. అనుమానాలను పెంచే ప్రమాదం కూడా వుంటుంది.
ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన అయిదేళ్ళ గడువులో ఏడాది
కాలం చూస్తుండగానే కనుమరుగు అవుతోంది. సర్కారు లెక్కల ప్రకారం చేసినవి చాలా
వుండవచ్చు. కానీ ప్రజల లెక్కలు వేరే వుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు వున్న
పరిస్తితిలో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే అవకాశం
ఇచ్చి చూస్తున్నారు. కొంత కాలం పరవాలేదు. కానీ ఎల్లకాలం వాళ్ల తీరు ఇలాగే వుండక
పోవచ్చు. తీరుతెన్నులు మారిపోవడానికి హఠాత్తుగా
వూడిపడే అనేక అంశాలు దోహదపడతాయి. తాడనుకున్నది పాము కావచ్చు. తాడుని చూసి పామని
భ్రమిస్తే కొంత జాగ్రత్త పడవచ్చు. పాముని తాడనుకుని నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం.
ఉదాహరణకు తెలంగాణాలో శాసనమండలి సభ్యుల ఎన్నిక
వ్యవహారం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేరారంటూ ఇటు టీడీపీ, అటు టీ.ఆర్.యస్.
పరస్పరం నిందారోపణలు చేసుకున్నాయి. 'చాలా దారుణం' అని ఇరుపక్షాలు అంటున్నాయి. సభలో
వున్న సంఖ్యాబలానికి మించి అభ్యర్ధులను పోటీకి దింపడం అనైతికం అని టీడీపీ అంటుంటే,
ఇలా కోట్లు పోసి ఒక్క ఓటు కొనే ప్రయత్నం చేయడం నీతిబాహ్యమని టీ.ఆర్.యస్. అంటోంది. అయితే
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
సాధారణంగా ఎవరయినా గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ సీను రివర్స్
అయింది. టీ.ఆర్.యస్. ఐదో అభ్యర్ధి గెలవకుండా చూడ్డానికి బేరసారాలు జరిగాయి.
టీవీల్లో కానవచ్చిన దృశ్యాల్లో, వినవచ్చిన సంభాషణల్లో ఈ విషయం ధృవపడింది. ఈ కారణం చేతే ఈ సంఘటన జరగడానికి పూర్వం వరకు టీడీపీ
మీద వున్న సానుభూతి ఆ తరువాత గాలికి కొట్టుకు పోయింది. టీడీపీ అంటున్నట్టు
ఇది రాజకీయ కుట్రే. కాదనలేము. కాని ఆ కుట్రలో తనకు తానుగా యెందుకు చిక్కుకు పోయిందని అడిగితె దానికి టీడీపీ వద్ద సరయిన సమాధానం లేకుండా పోతోంది.
అంచేతే అది నలుగురి దృష్టిలో ముద్దాయిగా
నిలబడాల్సివస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినాయకత్వానికి ఇది స్వయంకృతమే.
నవ నిర్మాణ దీక్షకు ముందు చేజేతులా అంటించుకున్న ఈ మురికిని సాధ్యమైనంత త్వరగా ఒదుల్చుకోవాలి, అంతే కాని ప్రతిష్టకు పోయి మరింత
అప్రతిష్ట మూటగట్టుకోకూడదు. (03-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
చాలా బాగా రాశారు.మీ జడ్జిమెంటు అధ్భుతం!
రిప్లయితొలగించండి@Haribabu Suraneni - Thanks - Bhandaru Srinivas Rao
రిప్లయితొలగించండి