22, మే 2015, శుక్రవారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో .....


'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే పరిస్తితి కూడా  లేదు'
అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ (మా కజిన్) ఫోను. మధ్యాహ్నం నేను వెళ్ళేసరికే అంతా అయిపొయింది.
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు.  కొన్నేళ్ళ క్రితం  శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో  కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి కాబోలు వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణా రావు గారు వారింటికి వెళ్లి కులాసాగా గడిపివచ్చి  కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు. 


(సరయూ నదీ తీరంలో శాస్త్రి గారు, పుణ్యవతి గారు 2012 లో)

శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు.  అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ  'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే  మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో  'కట్టె'. అంతే.
శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో  కనిపించని వేదాంతం వుంది.
"యాభయ్ ఆరేళ్ళు నాతొ కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు  బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా  చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన.  ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి  కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే 'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పొతే భయపడుతుంది' అనేసేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
(22-05-2015)                    


3 కామెంట్‌లు:

  1. రావు గారు, మీ ఆత్మీయులైన వారు గతించినా మా వారు కోల్పోయినంత హృదయవిదారంగా వ్రాసారు. ముఖ్యంగా "అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ 'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు." అనే వాక్యం కదిలించింది. శాస్త్రి గారికి, వారి కుటుంబానికి స్వాంతన కలగాలని దేవదేవున్ని ప్రార్థన చేద్దాము.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ జరిగేదే అయినా, మీ స్పందన బాద్యతగా వ్యక్తపరిచినట్లుంది. జీవం కోల్పోతే పుణ్యవతి గారైనా మరొకరైనా ప్రకృతిలో కలసే కట్టెగానే మిగులుతారు కదండీ. తప్పనిసరిగా అలవాటు చేసుకోవలసిన వేదాంతమేమో ఇది :( శాస్త్రి గారికి స్వాంతన కలగాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వి.వి.శాస్తిగారికీ వారి కుటుంబానికీ నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను.
      శ్రీనివాసరావుగారూ!
      చదివాక నాకూ కంట్లో నీళ్ళు తిరిగాయి.
      నిజంగా ఆయన చాలా సరదా మనిషి. ఎలా తట్టుకుంటారో ఏమిటో!
      ఆయన డైరెక్టరుగా ఉన్నప్పుడు కూడా మా తరం క్యాజువల్ అనౌన్సర్లతో ఓ ప్రెండుగా మెలిగారు. వారు తమ హోదాను ఎప్పుడూ కనబర్చలేదు.
      మా ఇంటి నుంచి బటికొచ్చి ఊరంతా తిరిగి తిరిగి.....మా ఇంటికే వచ్చినంత హాయిగా ఉండేది ఆకాశావాణి వాతావరణం.
      కృష్ణమాచారిగారూ ఆయన జంట కవుల్లా తిరిగేవారు.
      శాస్త్రిగారికి ఎనలేని స్థైర్యాన్నివ్వాలని ఆ దైవం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

      తొలగించండి