16, మే 2015, శనివారం

ఐ నో పీఎం ఐ నో సీఎం

'హలో నమస్కారం'
'నమస్కారం. చెప్పండి '
'మనం కలవక చాలా రోజులయింది'
'అవునండీ'
'ఈ సాయంత్రం ఎలా వున్నారు? వీలుంటే  బంజారా హోటల్లో  కలుద్దామా!'
'ఎందుకండీ అంత ఖర్చు.  హాయిగా మంకు ప్రెస్ క్లబ్ వుంది కదా'
'ప్రైవసీ వుండదేమో'
'హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ప్రైవసీ ఎందుకండీ?'
'అదీ నిజమే  అనుకోండి'
క్లబ్బులో రెండు మూడు గంటలు గడిపిన  తరువాత.....
'నేను వస్తానండీ'
'అప్పుడేనా?'
చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడయితే ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆలస్యం అయిన కొద్దీ  వాళ్ళతో తంటా. రోజూ వుండే తద్దినమే అయినా  పైగా పొద్దున్నే వార్తల టయిముకి ఆఫీసుకి చేరాలి'
'వుండండి నా కారులో దింపేసి వెడతాను'
'భలే వాళ్ళే!  మీరు వుండేది ఉత్తరం,  నేను ఉండేది దక్షిణం. బోలెడు దూరం తిరిగెలి వద్దు లెండి'  
'నేనేమన్నా మిమ్మల్ని మోసుకుంటూడతానా? కారే కదా. పైగా డ్రైవర్ కూడా వున్నాడు, పదండి'
'సరే పదండి'
ఇంటి దగ్గర దిగే ముందు -
'నేను చెప్పింది కాస్త గుర్తు పెట్టుకోండి. నాకు ఇది ప్రిస్టేజ్ ఇష్యూ'
ఏళ్ళు గడిచిపోయాయి.
అప్పటి జర్నలిష్టు  ఇప్పుడు మాజీ జర్నలిష్టు.
ప్రెస్ క్లబ్  లో మళ్ళీ కలిశారు అదే ఇద్దరు.
'ఏమండీ బాగున్నారా?'
'మీరెలా వున్నారు?'
బాగానే వున్నాను. కంపెనీ టర్నోవర్ అయిదు కోట్లయింది. పని బాగా పెరిగిపోయింది. మునపటిలా ఎవర్నీ తీరిగ్గా కలవలేకపోతున్నాను. కాసేపు మాట్లాడుకుందాం రండి'
'కాదండీ. ఇప్పటికే చాలా సేపు అయింది. మీకు తెలుసు కదా కాదు చాలా దూరం వెళ్ళాలి. పైగా ఆటో సమస్య'
'మరే. నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు వేరే ఫ్రెండ్స్ వస్తామన్నారు. మరో రోజు తీరిగ్గా కులుద్దాం లెండి. గుడ్ నైట్ అండీ'
'గుడ్ నైట్'


(NOTE : COURTESY IMAGE OWNER)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి