3, మార్చి 2015, మంగళవారం

కేంద్ర బడ్జెట్ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 05-03-2015, THURSDAY)

శారీరక అస్వస్తత నుంచి కోలుకుంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, నానారకాల రుగ్మతలతో కునారిల్లుతున్న 
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకోసం బడ్జెట్ రూపకల్పనలో చాలా శ్రమ తీసుకున్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో వుంచుకుని కేటాయింపులు చేయడం  నిజానికి ఆహ్వానించాల్సిన అంశమే.   అన్ని రకాల  వర్గాలను మెప్పించేందుకోసం కాకుండా  దేశ హితాన్ని దృష్టిలో వుంచుకుని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తయారు చేసింది కావడం వల్ల ఫలితాలు అందుబాటులో రావడానికి కొంతకాలం వేచి వుండాలని బడ్జెట్ ను సమర్ధించే బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ వాదనను ప్రతిపక్షాలు అంగీకరించే పరిస్తితి ఎలాగూ వుండదు. అందువల్ల షరా మామూలుగానే కేంద్ర బడ్జెట్ పై ఖండన ముండన పర్వాన్ని అధికార ప్రతిపక్షాలు  యధాప్రకారం యధావిధిగా కొనసాగిస్తున్నాయి.
ఆ విషయం పక్కనబెడితే, ఈసారి కేంద్ర బడ్జెట్,   కొత్తగా ఏర్పడ్డ ఓ  తెలుగు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. మీడియా చర్చల్లో అదే ఒక  ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే ఈసారి కేంద్ర బడ్జెట్ లో కానవస్తున్న నవ్యత్వం. గతంలో ఇలా జరిగిన దాఖలాలు లేవు. కేంద్రంలోను, ఆంధ్ర ప్రదేశ్  లోనూ  మిత్రపక్షాలుగానే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా  వున్న రెండు రాజకీయ పక్షాల్లో రాజుకుంటున్న విభేదాలకు ఈ బడ్జెట్ మరింత  ఆజ్యం పోసింది. గత రెండు మూడు రోజులుగా స్థానిక టీవీ ఛానళ్లలో ఈ అంశంపై జరుగుతున్న చర్చల్లో మిత్రపక్షాలయిన బీజేపీ, టీడీపీ ప్రతినిధుల నడుమ వాదోపవాదాలు  కొంచెం శ్రుతి మించుతున్నట్టే అనిపిస్తోంది. వీటి తీరుతెన్నులు నిశితంగా గమనిస్తే, రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ప్రస్తుతం వున్నరీతిలో కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు కూడా  అనిపిస్తోంది. పై స్థాయి నాయకుల మద్దతు, ప్రోత్సహం లేకుండా మీడియాలో మాట్లాడే ఆ  పార్టీల  ప్రతినిధులు ఈ పద్దతిలో మాట్లాడడం సాధ్యపడడం కుదరదు. ఈ సంవాదాలు ముదిరి పాకాన పడతాయా, లేదా ఒక స్థాయికి చేరి ఆగిపోతాయా అనే విషయంలో ఇప్పటికిప్పుడే అంచనాలకు రావడం తొందరపడడమే అవుతుంది. ఎందుకంటే, 'కొట్టినట్టు కొడతాను, ఏడ్చినట్టు ఏడువు' అనే నాటకీయ సంవాద ధోరణులు  కూడా ఇటీవలి కాలంలో రాజకీయాల్లో పెచ్చరిల్లుతున్నాయి. ఏది నిజమో, ఏది నాటకమో తెలియనంత స్వాభావికంగా నటించడంలో రాజకీయ నాయకులు రాటు తేలిపోయారు.  అయితే, టీడీపీ, బీజేపీ లలోని ఒక స్థాయి నాయకులు మాత్రం 'ఇక వెనక్కి తగ్గేది లేద'న్నంత తీవ్రంగా మాటలు విసురుకుంటూ  సవాళ్లు ప్రతిసవాళ్లు  విసురుతూ , ముందుకు దూసుకుపోతున్నారు. ఈ దృశ్యాలు  చూసినప్పుడు   రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో  బీజేపీ, టీడీపీ మైత్రి ముందు మాదిరిగానే కొనసాగుతుందా అంటే 'అవున'ని చెప్పడం కష్టంగా మారుతోంది. 

                  
గత ఎన్నికలకు ముందు ఏర్పడ్డ బీజేపీ, తెలుగుదేశం మైత్రీబంధం ఒకరకంగా ఉభయుల అవసరార్ధం కుదురుకున్నదే కాని, సిద్దాంత ప్రాతిపదికమీద ముడిపడింది కాదు. ఎన్నికల అనంతరం ఒకరి మీద మరొకరు ఆధారపడే అవసరం లేని సంఖ్యాబలం ఇరువురికీ లభ్యం కావడంతో ఈ పార్టీల పొత్తు కేవలం నామమాత్రంగానే తయారయింది. కాకపోతే, కొన్ని విషయాల్లో బీజేపీది పైచేయి అనే ఒప్పుకోవాలి. రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అనే మాటలు పైకి ఎన్ని చెప్పినా చివరికి ఏ రాష్ట్రం  అయినా కేంద్రం మీద ఆధారపడే పరిస్తితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది నిర్వివాదాంశం. అందులోనూ కొత్తగా పురుడుపోసుకుని, బాలారిష్టాలతో కునారిల్లుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి,  ప్రతిదానికీ కేంద్రం మీద ఆధారపడడం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలోనూ, ఆ తరువాత ఎన్నికల  తరుణంలోనూ బీజేపీ అగ్రనాయకులు చెప్పిన ఉపశమన వాక్యాలతో కడుపు నిండిన ఆంధ్ర ప్రాంతం ఓటర్లు, చేయీ చేయీ కలిపిన బీజేపీ, టీడీపీ నాయకులని నమ్మి, 'చెయ్యి గుర్తు' పార్టీని మట్టి కరిపించి, అంతవరకూ అన్ని ఉపఎన్నికల్లో తాము బ్రహ్మరధం పట్టిన వై.యస్.ఆర్.సీ. పార్టీని పక్కన బెట్టి, ఈ రెండు పార్టీలనే అక్కున చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోవడం చూస్తూ  సీమాంధ్ర ప్రజానీకం లోలోపలే కుతకుతలాడి పోతున్న విషయం రహస్యమేమీ కాదు. హామీలను నూటికి నూరు  శాతం నిలబెట్టుకుని తీరతామని రెండు పార్టీల నాయకులు మరో కొత్త హామీ పదేపదే ఇవ్వడం తప్ప, ఇన్ని నెలలుగా కార్యాచరణ దిక్కుగా అడుగు పడింది లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు తగ్గింపుకు చేతనయిన సాయం,  నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రనిధులు,  పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాకు తగ్గ కేటాయింపులు, ప్రత్యేక రైల్వే మండలం అన్నీ మాటల్లోనే మిగిలిపోయాయి. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రాకు మొండి చేయి చూపిస్తే,  కేంద్ర బడ్జెట్లో ఏకంగా తొండి చేయి మిగిల్చారు. వీటిని సమర్ధించుకోవడానికి రాష్ట్రానికి చెందిన బీజేపే నాయకులు నానా అవస్థ పడాల్సి వస్తోంది. 'దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అందరితో  పాటే వడ్డన' అనే మోడీ మార్గం వారికి ఓ పట్టాన కొరుకున పడడం లేదు. ముందే చెప్పినట్టు 'అత్యల్ప రాజకీయ ప్రయోజనాలకంటే అనల్ప జాతీయ లక్ష్యాలు ప్రధానం. ఇది మా విధానం' అని మోడీ గద్దె ఎక్కిన మొదటి రోజునుంచీ చెబుతూనే వస్తున్నారు. ఇక ఆయన్ని తప్పుపట్టడం యెట్లా అనేది రాష్ట్ర బీజేపీ నాయకుల మనోగతం. కానీ పైకి చెప్పుకోలేరు. సాక్షాత్తూ  వెంకయ్య నాయుడు వంటి కాకలు తీరిన సీనియర్ నాయకుడే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడిన స్తితి. 'అవును, నేను అసమర్దుడినే, మీకు జవాబులు చెప్పలేకపోతున్నా' అని అయన విలేకరులతో అన్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. వెంకయ్యనాయుడు బీజేపీలో ఆషామాషీ మనిషి కాదు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లోనే   ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది. కాకపొతే, ఆ పార్టీ నాయకులకు వున్న ఒక వూరట ఏమిటంటే,  బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో తెలుగు రాష్ట్రానికి చెందిన హామీలను పొందుపరచలేదు. ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే వాటిని పరిమితం చేశారు. 'ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం' అని మోడీ అలనాడు తిరుపతి సభలో అన్నా, 'కాంగ్రెస్ మిమ్మల్ని అనాధలుగా మార్చింది, అధికారంలోకి రాగానే మీకు అండగా వుంటా' అని ఎన్నికల వేళ  గుంటూరులో సీమాంధ్ర ప్రజలకు  మాటిచ్చినా అవన్నీ మానిఫెస్టోలో లేవని తప్పుకునే వెసులుబాటు బీజేపీ నాయకులకి వుంది. 'ఎన్నికల ప్రణాళికలో పొందుపరచిన అంశాలు మీరెంతవరకు అమలు చేసార'ని ఆ పార్టీ నేతలు టీడీపి పై ఎదురు  ప్రశ్నలు సంధించడం టీవీల్లో చూస్తున్నాం. రామాంజనేయ యుద్ధం అనే పౌరాణిక నాటకంలో యుద్ధరంగంలో తటస్థ పడిన శ్రీరాముడు, ఆంజనేయుడు ఒకరికొకరు తగిన మర్యాదలు ఇచ్చుకుంటూనే 'ఎత్తి పొడుపు' పద్యాలు ఎత్తుకున్న సందర్భం గుర్తుకు వస్తోంది.
ఇక తెలుగు దేశం పరిస్తితి చెప్పనక్కరలేదు. మిత్రపక్షాన్ని నిలదీయలేరు, అలా అని  సమాధాన పడలేరు. అయితే. రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ల తరువాత వారి స్వరాల్లో కొంత మార్పు కనబడుతోంది. చంద్రబాబు బావమరది, హిందూపూర్  ఎం.ఎల్.ఏ.,  బడ్జెట్ పై వెలిబుచ్చిన స్పందనలో ఈ మార్పు కొట్టవచ్చినట్టు కనబడింది. ఇక తిరుపతి టీడీపీ ఎంపీ ఒక అడుగు ముందుకు వేసి, జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను దించాల్సినసమయం ఆసన్నమైనదన్నట్టు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల తన అసహనాన్ని దాచుకోలేదు.  'ఎంతో నమ్మకంతో బీజేపీ, టీడీపీలను గెలిపించిన 'ఏపీ' ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసింది' అని చంద్రబాబు  విలేకరుల సమావేశంలోనే చెప్పారు. ఇక సహచరులతో జరిపిన అంతరంగిక సంభాషణల్లో  'కొంతకాలం వేచి చూద్దాం, మార్పు లేకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుందాం' అన్నట్టుగా పత్రికల్లో  వచ్చింది. అదే వైఖరి టీవీ చర్చల్లో పాల్గొంటున్న టీడీపీ నాయకుల వాదనల్లో ప్రతిధ్వనిస్తోంది.
వీటన్నిటికీ 'కొసమెరుపు' అన్నట్టు 'ప్రశ్నించే హక్కు ప్రజలది' అనే నినాదంతో పుట్టిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వీటన్నిటినీ మించిన దుమారం రేపింది.  రాజధాని భూముల సేకరణ  విషయంలో ఇటు టీడీపీని, ప్రత్యేక హోదా విషయంలో అటు  మోడీ ప్రభుత్వాన్ని ఒకే త్వీట్ లో ఇరుకున బెట్టారు.  మోడీ అభిమానం చూరగొన్న ప్రాంతీయ నాయకుడిగా ముద్రపడ్డ  పవన్ కళ్యాణ్ చంద్రబాబును అయన నివాసంలో కలుసుకుని, చర్చలు జరిపి 'రాజధాని' ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. అనువైన తరుణానికి బాగా ముందుగానో, లేదా చాలా ఆలస్యంగానో  స్పందిస్తారని ఆయనకు ఇప్పటికే పేరుంది. రాజధాని భూముల  సమీకరణ గడువు 'ముగిసిన' తరువాత జరిపే ఈ పర్యటన వల్ల సాధించేది ఏముంటుంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి కూడా. కాకపొతే, ఢిల్లీ వెళ్ళి మోడీని కూడా కలుసుకుంటానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చేసేది ఏమీ లేదంటున్నారు కనుక, కనీసం 'తగినన్ని' నిధులు కేంద్రం నుంచి రాబట్టడంలో సఫలం అయితే కొంత మేలు జరిగినట్టు అనుకోవచ్చు. చంద్రబాబు అయన పరివారం విఫలం అయిన చోట పవన్ 'విజయం' సాధిస్తే ఆ పరిణామం మరికొన్ని రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం  లేకపోనూ లేదు.                 
ఇదే వాతావరణం కొనసాగితే రాష్ట్రంలో 'రాజకీయ సమీకరణాలు' మారిపోయే ప్రమాదం వుంటుంది. ఆగ్రహించిన ప్రజానీకం యెలా స్పందిస్తారన్నది  సీమంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అవగతమైంది. వారి అనుభవంతో తెలుగుదేశం నాయకులకు కూడా  పరిస్తితి క్రమక్రమంగా అర్ధం అవుతున్నట్టుంది. అందుకే ఆ పార్టీలో నిరసనలు   'గుసగుసలు'గా  మొదలయి 'రుసరుసల' రూపం సంతరించుకుని క్రమేపీ  రణగొణ ధ్వనులుగా మారుతున్నాయి. 'ఇల్లా అయితే ఎల్లా' అనే ప్రశ్న, 'అవసరం అయితే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకుందాం' అనే వరకు రూపాంతరం చెందుతోంది. బడ్జెట్ సృష్టించిన, సృష్టిస్తున్న  రాజకీయ ప్రకంపనలు రానున్న కాలంలో వూహాతీత పరిణామాలకు దారితీస్తాయా, లేదా బలహీనపడ్డ అల్పపీడనం మాదిరిగా సద్దుమణుగుతాయా అన్నది రానున్న రోజుల్లో 'కాలమే' నిర్ణయిస్తుంది. (bhandarusr@gmail.com)

(04-03-2015)

NOTE:Courtesy Image Owner 

2 కామెంట్‌లు:

  1. 'ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అందరితో పాటే వడ్డన' అన్న మాటలో ఏ తప్పూ లేదు. ఐతే, ఎన్నికలకు ముందు మీకేదో తవ్వి తలకెత్తుతామనీ మీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతామనీ ఇచ్చకాలాడి, తీరా గెలిచాక మాత్రమే మీరంటే శతకోటిలింగాల్లో ఒక బోడిలింగం అన్నట్లు మాట్లాడ్డం అక్షరాలా ద్రోహం - నేరం.

    ఇకపోతే మీ ముక్తాయింపు "రానున్న రోజుల్లో 'కాలమే' నిర్ణయిస్తుంది." అన్నది నిజం. ఈ‌ మాట నేను మొదటినుండీ చెబుతూనే వస్తున్నాను.

    One shouldn't forget that nothing recedes like success.

    రిప్లయితొలగించండి
  2. మొదట కాంగ్రెస్ మీద ఉన్న కోపం ఇప్పుడు బి.జె.పి.,టి.డి.పి.ల మీదికి మళ్లుతోంది.వీళ్ళు కుమ్మక్కై చేసిన ద్రోహం వల్ల.పోలవరం,వెనుకబడ్డ జిల్లాలు,రాజధానికి కొన్నినిధులు 5,6,వేల కోట్ల రూపాయలు కనీసం తీసుకు రావాలి.కాని,వీళ్ళచేతనౌతుందా?గుజరాతీ వాళ్ళు,ఢిల్లీవాళ్ళు అంధ్రుల్ని పట్టించుకుంటారని నమ్మకంలేదు.ఇక మీదట T.D.P.కేంద్రప్రభుత్వం నుంచి విడిపోయి ప్రతిపక్షం గా మారితే మంచిది.

    రిప్లయితొలగించండి