(Published by 'SURYA' Telugu Daily in it's Edit Page on 12-03-2015,THURSDAY)
పైకి విభిన్నంగా కనిపిస్తూ, సారూప్యం కలిగిన కొన్ని వార్తలు గత కొద్ది రోజులుగా వెలుగు
చూస్తున్నాయి. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ
శక్తి, మహిళా సాధికారత, వారి భద్రత గురించి రాజకీయ నాయకులు చేసిన ప్రసంగాలు, అంతకు కొద్ది రోజులముందు బీబీసీ డాక్యుమెంటరీ
'ఇండియాస్ డాటర్' సృష్టించిన అలజడి, అత్యాచార నిందితులను మీడియా ముందు
ప్రవేశపెట్టడం పట్ల హైకోర్టు ఆగ్రహం, నాగాలాండ్ లో ఒక బాలికను లైంగికంగా
వేధించాడన్న ఆరోపణతో జైల్లో వున్న నిందితుడిపై ఆగ్రహోదగ్రులైన దిమాపూర్ ప్రజలు తీసుకున్న
పాశవిక ప్రతీకార చర్య, ఇవన్నీ పెను సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి.
మహిళా దినోత్సవం యధావిధిగా ఒక తంతులా ముగిసింది.
పత్రికల్లో ప్రత్యెక వ్యాసాలు, మీడియాలో ప్రత్యెక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో
వినుతికెక్కిన వనితా మణులకు సర్కారు సత్కారాలు, మహిళల గొప్పతనాన్ని శ్లాఘిస్తూ
ప్రసంగాలు, స్త్రీలకు చేయబోయే సేవలను వివరిస్తూ వాగ్దానాలు ఇవన్నీ, బుల్లి తెరలపై చూసీ, వినీ ఆడంగులందరూ తిరిగి తమ పనిపాటల్లో పడిపోయివుంటారు.
బహుశా ఈ జన్మకు ఇంతే అని కూడా మనస్సులో అనుకునివుంటారు.
నిజమే కావచ్చు. ఒకప్పటి కంటే ఈనాటి మహిళలు కొంత మెరుగయిన స్వేచ్చను అనుభవిస్తూ ఉండవచ్చు.
మగవారికి దీటుగా ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ
ఉండవచ్చు. కానీ, అతివల అభ్యున్నతికి చదువొక్కటే కొలమానం అయితే, ఆర్ధిక
స్వావలంబన ఒక్కటే గీటురాయి అయితే, చదువుకున్న మహిళలు, సంపాదిస్తున్న ఆడవారు
ఈనాటికీ పైకి చెప్పుకోలేని అభద్రతాభావంలోనే వుండిపోవడానికి కారణం ఏమిటి? రోజురోజుకూ వారిపై పెరిగిపోతున్న అత్యాచారాలకు హేతువు ఏమిటి?
స్త్రీలు సంచరించే చోట దేవతలు నర్తిస్తారు అనే పుణ్యభూమిలో నరరూప రాక్షసుల వికృత
పోకడలకు అర్ధం ఏమిటి?
మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి
స్పూర్తిదాయకమైన లఘు చిత్రం రూపొందించాలని బీబీసీ వంటి ప్రసిద్ధ ప్రసార మాధ్యమం
తలపెడితే అందులో తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలే ప్రధానాంశంగా
తీసుకుని డాక్యుమెంటరీ తీసినా ప్రశ్నించాల్సిన అగత్యం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ'
అత్యాచారం కేసులో శిక్షపడి జైల్లో వున్న ఖైదీని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసినా
ఎందుకని అడగాల్సిన అవసరం లేదు. కానీ, మహిళా దినోత్సవం నాటికి కొద్ది ముందుగా యూ
ట్యూబ్ లో ఆ పేరుతొ ప్రత్యక్షమైన అంశాలే ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయాలుగా
పరిణమించడం ఇందులోని విషాదం.
నాగరిక సమాజం నివ్వెరపడే విధంగా, సిగ్గుతో తలదించుకునే
విధంగా అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి
నేరస్తుడిగా జైల్లో వున్న వ్యక్తి - 'ఆ
అమ్మాయి సహకరించి వుంటే ఇంతటి దుస్తితి ఆమెకు పట్టేది కాదు' అనే రీతిలో వ్యాఖ్యానించాడు
అంటే దాన్ని మరో పెద్ద నేరంగా పరిగణించి శిక్ష విధించాల్సిన చట్టాలు మన దేశంలో లేకుండా
పోయినందుకు దేశ ప్రజలు సిగ్గుపడాలి. తమ ముష్కర చర్యలద్వారా, అన్నెం పున్నెం ఎరుగని
ప్రజల ప్రాణాలు నిలువునా తీసే ఉగ్రవాదుల దుశ్చర్యలు ఎంతటి ఘాతుకమైనవో, ముక్కూ మొహం
తెలియని ఒక అమాయకపు ఆడపిల్ల మానాన్ని దోచుకునే ఇటువంటి నేరస్తుల నీతిమాలిన చర్యలు
కూడా అంతే హేయమైనవి. నిజానికి అటువంటి వ్యాఖ్యలు చేసిన నిందితుడికి యావజ్జీవ శిక్షకంటే
పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం వుంది. కానీ జరిగింది ఏమిటి? దేశ వ్యాప్తంగా చర్చ
జరిగింది. మహిళా సంఘాలు ఖండించాయి. ప్రజాసంఘాలు నిరసించాయి. ప్రభుత్వం కదిలింది.
తక్షణం యూ ట్యూబ్ నుంచి ఆ డాక్యుమెంటరీ కి సంబంధించిన ప్రచార భాగాన్ని తొలగించారు.
అయితే అప్పటికే దానికి లభించాల్సిన ప్రాచుర్యం ఇబ్బడి ముబ్బడిగా లభించింది.
మన దేశంలో నిషేధానికి గురయిన ఈ లఘు చిత్రానికి
అమెరికాలో లభించిన గౌరవాదరాలు అన్నీ ఇన్నీ కావు. మూడు పర్యాయాలు అకాడమీ అవార్డు
గెలుచుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఈ చిత్రం ప్రీమియర్ షోకు ముఖ్య
అతిధిగా హాజరయ్యారు. 2012 లో ఢిల్లీ లో నడుస్తున్న బస్సులో దారుణంగా అత్యాచారానికి గురయిన ఢిల్లీ
యువతి పట్ల గౌరవంతో అసలు పేరు బయట పెట్టకుండా మన మీడియా కొంత మర్యాద పాటిస్తే,
అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఆమె అసలు పేరుతోనే నివాళులు అర్పించారు. 'ఆమె
భారతీయ తనయ (ఇండియాస్ డాటర్). కానీ ఈరోజు నుంచి ఆమె మన కుమార్తె కూడా' అంటూ వక్తలు
మాట్లాడారు. భారతీయ తనయ అయినా అమెరికా అమ్మాయి అయినా ఆ నిర్భాగ్యురాలు వీటన్నిటికీ
అతీతంగా మరో లోకానికి తరలి వెళ్ళింది. బహుశా అక్కడివాళ్ళయినా ఆ అభాగ్యురాలిని
అక్కున చేర్చుకున్నారేమో తెలియదు.
ఈ డాక్యుమెంటరీ తీసిన
బ్రిటిష్ మహిళ లెస్లీ ఉడ్విన్ కూడా ఒకప్పుడు అత్యాచార బాధితురాలే కావడం యాదృచ్చికం
కావచ్చు. మహిళలపై పెచ్చు పెరుగుతున్న అత్యాచారాలను ఖండించే లక్ష్యంతో తీసిన లఘు చిత్రం కావచ్చు. కానీ అసలు
విషయం కంటే కూడా నిందితుడు చేసిన అసందర్భ, అవాంఛిత వ్యాఖ్యలకు ఎక్కువ ప్రచారం లభించినట్టయింది.
'గౌరవ మర్యాదలు
కలిగిన కుటుంబం నుంచి వచ్చిన యువతులు ఇలా అర్ధరాత్రి, అపరాత్రి బజార్న పడి తిరగరు. మగవారిని తేలిగ్గా ఆకర్షించే
వస్త్ర ధారణ ఆడవారికి అసలు పనికి రాదు.'
చేసిన నిర్వాకానికి
జైల్లో శిక్ష అనుభవిస్తూ, చేసిన పనిని సమర్ధించుకుంటూ ఆ ఖైదీ పలికిన మాటలు ఇవి.
'అర్ధరాత్రి ఆడపిల్ల
ధైర్యంగా ఇంటికి రాగలిగిన నాడే మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు లెక్క'
అన్న మహాత్మా గాంధీ బోధనలకు, చేసిన పనికి ఇసుమంతయినా పశ్చాత్తాపం లేకుండా ఆడపిల్లల ప్రవర్తన గురించి ఆ నేరస్తుడు నోటికి
వచ్చినట్టు చెప్పిన మాటలకు ఏమైనా పొంతనవుందా!'
'స్త్రీలపై లైంగిక
దాడులు' అనేవి ఒక్క భారత దేశానికి మాత్రమే పరిమితం
కావు. అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఇది' అని అమెరికాలో ఈ డాక్యుమెంటరీ
ప్రీమియర్ సందర్భంగా నిర్వాహకులు చెప్పారు. నిజమే కావచ్చు. అలాంటప్పుడు, ఇలాటి
అత్యాచారాలు జరుగుతున్న మరో దేశం ఏదీ, ఈ చిత్ర నిర్మాణానికి ముందు వారికి కనబడలేదా
అన్నది జవాబు రాని, జవాబు లేని ప్రశ్న. (10-03-2015)
the defense lawyers are worse than the criminal
రిప్లయితొలగించండిYou have to change the system not the lawyer
రిప్లయితొలగించండి