పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని 'భర్త గీత' బోధించడం
మొదలెట్టాడు.
'ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో
అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా!
'నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం
అయ్యేటప్పుడు, ఓ కప్పు కాఫీ కలిపి పట్రా అన్నాననుకో. ఎందుకనుకున్నావు. నీకు
ఇబ్బంది అని తెలియక కాదు. ఆఫీసులో అలసిసొలసి ఇంటికొచ్చిన నాకు, నువ్విచ్చిన కాఫీ
తాగగానే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక అప్పుడు ఎంచక్కా నువ్వు ఇరుగింటి, పొరుగింటి
అమ్మలక్కల కబుర్లన్నీ ఏకబిగిన ఏకరువు
పెట్టినా నాకేమీ అనిపించదు కనుక.
'నీతో కలిసి బజార్లో వెడుతున్నప్పుడు పక్కనుంచి ఓ అందమైన అమ్మాయి వెడుతుంటే
నా చూపులు ఆటోమేటిగ్గా అటే తిరిగిపోతాయి.
ఏం చెయ్యను చెప్పు మగాడ్ని కదా! దాన్ని చూసి నువ్వు కంగారు పడిపోతుంటావు. కానీ
అసలు వాస్తవం ఏమిటంటే, అలా బయట ఆడవాళ్ళను కొరుక్కుతినేలా
చూస్తుంటానని నువ్వు నన్ను అస్తమానం కొరుక్కుతింటూ, ఆ నడిబజారులోనే ఉతికి ఆరేయాలని
చూస్తావు. కానీ నీకు తెలియంది ఒకటుంది. నీ
అందం ముందు ఎవ్వరి అందాలయినా దిగదుడుపే. ఆ విషయం ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకునేందుకే ఆడవాళ్లకేసి అలా
చూస్తుంటాను. పిచ్చి మొహానివి. నీకు అర్ధం
అయి చావదు.
'నీ చేతివంట చెత్త అని అప్పుడప్పుడు అంటుంటాను. నిన్ను తప్పు పట్టాలని
కాదు. నా రుచిపచుల్లో ఏవన్నా తేడాపాళాలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని మాత్రమే అలా వంకలు
పెడుతుంటాను.
'నిజమే. రాత్రి పూట నేను పెట్టే గురక కర్ణ కఠోరంగా వుంటుందని నాకూ తెలుసు. నేను
అంత హాయిగా గురకపెట్టి నిద్ర పోతున్నానూ అంటే ఏమిటి అర్ధం. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను యెంత
ప్రశాంతంగా వున్నానో నీకు అర్ధం కావాలనే.
'మొన్న నీ పుట్టిన రోజు మరచిపోయిన మాటా నిజమే. చిన్న కానుక కూడా
కొనుక్కురాని మాటా నిజమే. ఇల్లెగిరిపోయేటట్టు నానా యాగీ చేసావు కానీ నీకు తెలియని
విషయం చెబుతా విను. గిఫ్టుల మీద తగలేసే డబ్బు నేనేమన్నా కట్టుకుపోతానా చెప్పు. ఏది
మిగిలినా అది నేను తాళి కట్టి కట్టుకున్న నీకే కదా!
'నేను చెప్పే ఈ భర్తగీత నీకు
ఏమాత్రం నచ్చలేదన్న సంగతి నీ చేతిలో వున్న అప్పడాల కర్రే చెబుతోంది. ఇక ఆఖరుగా ఒక మాట
చెబుతా. వినేసి, అప్పడాలకర్ర కింద పడేస్తావో, కింద వున్న కత్తిపీట చేతిలోకి తీసుకుంటావో
అది నీ ఇష్టం.
'నన్ను నిలువునా నరికి ఉప్పు పాతర వేయాలని నీకు అనిపిస్తోంది. అయితే,
హత్యానేరానికి, అందులోను మూడుముళ్ళు మెడలో వేసి, ఏడడుగులు కలిసి నీతో నడిచి
నలుగురు ముందు పెళ్ళాడిన భర్తనే చంపడం అంటే అందుకు పడే శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్
పీనల్ కోడ్ ప్రకారం ...........'
(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)
(నెట్లో సంచారం చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)
మాటనేర్చిన భర్తకు మాయజేయటం ఓ లెక్కా! నిజాన్ని భ్రమింపజేసే నిజాలు బాగున్నాయి..
రిప్లయితొలగించండి