(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 05-02-2015, THURSDAY)
'గెలిపిస్తే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తా' అన్నారు ఆ రోజుల్లో వై.యస్.ఆర్.
'అది అసాధ్యం' అన్నారు అప్పుడు
ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు.
తరవాత జరిగిన ఎన్నికల్లో కరెంటు ఉచితంగా ఇస్తానన్న వై.యస్.రాజశేఖర రెడ్డిని
ప్రజలు గెలిపించారు. ఆ హామీ అసాధ్యం అన్న చంద్రబాబును ఓడించారు.
'మనమూ ఉచితం అంటే పోయేదేమో' అన్నారు చంద్రబాబు పార్టీవాళ్లు.
'అలా యెలా అంటాం . అది సాధ్యం కాని పని' అన్నారు అప్పట్లో చంద్రబాబు.
పదేళ్ళు గడిచాయి. మరోసారి ఎన్నికలు వచ్చాయి.
రెండు తడవలుగా అధికారానికి దూరంగా వున్న చంద్రబాబు, 'నన్ను గెలిపిస్తే
రైతుల రుణాలు మాఫీ చేస్తా' అన్నారు.
'అది అసాధ్యం' అన్నారు వై.యస్. జగన్ మోహన రెడ్డి.
ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఓడిపోయి జగన్
ప్రతిపక్షనేత స్థానానికి పరిమితమయ్యారు.
'మేమూ రుణ మాఫీ అని వుంటే మేమే గెలిచేవాళ్ళం. అలా అబద్దం చెప్పలేకపోయాం'
అని చింతించడం వై.యస్.ఆర్. పార్టీ వంతయింది.
హామీలు ఎన్నికల వైతరిణిని దాటిస్తాయా అంటే ఖచ్చితంగా అవునని
చెప్పలేకపోవచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసిన తరువాత కాదని కూడా
చెప్పలేని పరిస్తితి.
సర్వేల్లో గెలిచి అసలు ఎన్నికల్లో చతికిలపడిన వై.యస్.ఆర్.పార్టీకి ఓటమి
అనేది జీర్ణించుకోలేని వ్యవహారమే.
సాధించిన ఓట్లశాతం బాగానే వున్నా, సీట్ల శాతం తగ్గిపోయి, కనుచూపు దూరంలో అందివచ్చినట్టు కానవచ్చిన అధికార
అందలం ఆఖరు నిమిషంలో చేజారిపోవడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కడుపు రగిలించే
విషయమే.
అందుకే, టీడీపీ అధికారంలోకి వచ్చిన
కొత్తల్లో రుణ మాఫీ అమలు విషయంలో ఆ పార్టీ కిందమీదవుతూ కుదేలవుతున్న తీరు
చూసి ఆదిలోనే ప్రతిపక్ష వై.యస్.ఆర్.సీ.పీ. ఆందోళనకు దిగింది. 'నరకాసుర వధ 'పేరుతొ ఆందోళన చేపట్టింది. టీడీపీ
అధికార పీఠం ఎక్కి ఎక్కువ రోజులు గడవకముందే ఆందోళనకు దిగడం వల్లనో, ఆరునూరయినా రుణ మాఫీ హామీని నూటికి నూరు శాతం
అమలుచేసి తీరుతామని తెలుగుదేశం నాయకులు పదేపదే చేస్తూవస్తున్న ప్రకటనల కారణమో
తెలియదు కానీ జగన్ ఆందోళన పట్ల జనం స్పందన అంతంత మాత్రమే కావడం తెలుగుదేశం నేతలకు కాసింత వూరట కలిగించింది. ఆ తరువాత కూడా ఏదో ఒక పేరుతొ
వై.యస్.ఆర్.పార్టీ అనేక సమస్యలను ఎత్తి
చూపుతూ ఆందోళనలు, దీక్షాశిబిరాలు నిర్వహించింది. ప్రతిపక్షంలో వున్న ఏ పార్టీ అయినా ఇలాగె
చేస్తుంది. అది వాటి రాజకీయ ధర్మం.
మరోపక్క హామీ అమలును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు మొదలు పెట్టింది.
కానీ ఎటు చూసినా అవరోధాలే. కేంద్రం నుంచి వస్తుందనుకున్న సాయం మాటలకే
మిగిలిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ససేమిరా అంది. ఇక రాష్ట్రంలోని బ్యాంకులతో ఎన్ని
పర్యాయాలు చర్చలు జరిపినా వారు కొండెక్కి కూర్చున్నారు. కేంద్రంలో అధికారంలో
వున్నది మిత్ర పక్షమే అయినా రుణ మాఫీ విషయంలో ప్రధాని మోడీ ఆలోచనలు వేరుగా వున్నట్టు
వున్నాయి. ఇక దానితో తెలుగు దేశమే స్వయంగా రంగంలోకి దిగింది. కోటయ్య కమిటీ
వేసింది. వాళ్లు సూచించిన దానికంటే ఎక్కువగానే ప్యాకేజీలు తయారు చేసింది. ఏమయితే
మాత్రమేం అన్నీ అసలు హామీకి సరితూగనివే. అరకొర అనిపించే విధంగానే వున్నాయి. కొత్త
రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందులు వివరించి రుణ విమోచనకు కొన్ని షరతులు పెట్టారు. అయినా సరే, రైతుల నుంచి నిరసన వ్యక్తం
కావడంలేదన్న ఒకే కారణం చూపి ప్రభుత్వం రోజులు దొర్లించింది.
మళ్ళీ ఇప్పుడు వై.యస్.ఆర్. పార్టీ అదే రుణ మాఫీ అంశంపై తణుకులో గత వారం రెండు రోజుల దీక్ష నిర్వహించింది.
ఈ దీక్షపట్ల ప్రజల స్పందన అమోఘం అని వై.యస్.ఆర్. పార్టీ సంబరపడుతుంటే అంత
సీనేమీ లేదని అధికారపక్షం ఎద్దేవా
చేస్తోంది. రాజకీయాల్లో ఇదీ సహజమే.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎన్నికల వాగ్దానం
ఏదన్నా వున్నదంటే అది రైతుల రుణ మాఫీ హామీ ఒక్కటే. ఎన్నికల్లో ఎన్నెన్నో వాగ్దానాలు
చేయడం అన్ని రాజకీయ పార్టీలకి పరిపాటే.
కాకపొతే, ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హామీల అమలు ఉత్తర్వులపై 'మొదటి
సంతకం చేస్తాం, రెండో సంతకం చేస్తాం' అంటూ చేసే ప్రకటనలే ఒక్కోసారి వాటి మెడకు చుట్టుకుంటాయి.
తెలుగుదేశం విషయంలో జరిగింది ఇదే. 'అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ
చేస్తాము, త్వరలోనే అధికారంలోకి రాబోతున్నాము. త్వరపడి ఎవరూ రుణ బకాయిలు చెల్లించకండి'
అని పిలుపు ఇచ్చింది కూడా ఆ పార్టీ అధినాయకులే.
నిజానికి తెలుగు దేశం పార్టీ ఇచ్చిన ఈ ఎన్నికల వాగ్దానం తప్పుపట్టాల్సిందేమీ
కాదు. ఈ దేశంలో ఇటువంటి సాయానికి అర్హులైన వాళ్లు ఎవరయినా వున్నారంటే, వారిలో మొట్టమొదటి
వాళ్లు మాత్రం తిండి గింజలు పండించి జనాలకు
ఇంత అన్నం పెడుతున్న వ్యవసాయదారులే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. పంట పంటకీ అప్పులు చేస్తూ, పంట రాగానే వాటిని
తీరుస్తూ, ప్రకృతి ప్రకోపించి వానలు, వరదలు, కరువులు కాటకాలతో పంటల్ని దెబ్బతీసినప్పుడు,
పెరిగిన వడ్డీలతో అప్పులు తీర్చలేక, వూరివారిలో
తలఎత్తుకుని తిరగలేక వుసురు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యే రైతుల రుణాలు రద్దు
చేస్తామని ఎవరయినా అంటే అది తప్పని అనేవారు వుండరు. అంటే మాత్రం వారిది
పెద్దతప్పే.
అయితే, అలాటి హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవాలంటే అది రాష్ట్ర స్థాయి
రాజకీయ పార్టీలకి అలవిమాలిన పని. రైతుల రుణాలు రద్దుచేయడం అనేది ఒక ఫైలుమీద సంతకం
చేయగానే జరిగిపోయే వ్యవహారం కాదు. అది అప్పులిచ్చిన బ్యాంకులతో ముడిపడిన విషయం. బ్యాంకుల
మీద ఆజమాయిషీ చేయగలిగిన కేంద్ర ప్రభుత్వం కలగచేసుకోవాల్సిన అంశం. గతంలో రైతుల
రుణాలు మాఫీ చేసిన దాఖలాలు లేకపోలేదు కానీ, నూతన ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో ఇప్పుడా వెసులుబాటు
కూడా కానరావడం లేదు. రిజర్వ్ బ్యాంక్ నియమనిబంధల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్తితి. ఎన్నికలకు
ముందు ప్రతిపక్ష వై.యస్.ఆర్. పార్టీ అసాధ్యం అని కొట్టివేసినా, 'మనసుంటే మార్గం
వుంటుందని, ఆరునూరయినా అమలుచేసి చూపుతాం' అంటూ టీడీపీ నాయకులు బీరాలు పలికారు. ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం
ఎక్కిన తరువాత కానీ తత్వం బోధపడలేదు. అందులో ముడిపడివున్న చిక్కుముడులన్నీ అవగతం
కాలేదు.
తరువాత రకరకాల ఆలోచనలు చేశారు. నిజానికి ఈ విషయంలో చంద్రబాబు ఎన్ని పాట్లు
పడాలో అన్నీ పడ్డారు. బ్యాంకులను వొప్పించడం
కోసం, కేంద్రాన్ని అర్ధించడం కోసం ఎక్కిన గడప ఎక్కకుండా కాలుకు బలపం కట్టుకుని
తిరిగారు. సమావేశాలు పెట్టారు. సమీక్షలు జరిపారు. కానీ ఫలితం పూజ్యం. మరోపక్క
కొత్త రాష్ట్రం ఆర్ధిక పరిస్తితి చూస్తే మరింత
అధ్వాన్నం. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు, పోను పోను ఉద్యోగుల నెల జీతాలు చెల్లించడం కూడా గగనంగా మారే ప్రమాదం పొంచి వుందని. ఈ స్తితిలో
వేల కోట్లు అవసరం అయ్యే రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవడం అంటే మాటలు కాదు. అందుకే
కాస్త మాట తప్పినట్టు అనిపించినా సరే, ఇచ్చిన మాటను ఎంతో కొంతయినా నిలబెట్టుకోవాలని
చంద్రబాబు తాపత్రయపడ్డారు. ఈ క్రమంలో రుణమాఫీ పధకానికి ఎన్నో మార్పులు చేర్పులు
చేశారు. రైతుల రుణాలకు కొత్త భాష్యాలు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి అర్ధం
కాని మాటలు చెప్పారు. కుటుంబానికి ఒక రుణం అన్నారు. బంగారం తాకట్టు రుణాల మాట పక్కన
బెట్టారు. డ్వాక్రా రుణాలు తరువాత చూస్తాం అన్నారు. దొంగ ఖాతాలు అన్నారు. ఆధార్ కార్డుల మెలిక పెట్టారు. బ్యాంకు ఖాతాలకే నేరుగా
జమ చేశాం చూసుకొండన్నారు. ఇంత చేసినా, చివరికి వ్రతం చెడ్డా ఫలం దక్కని చందం అయింది. నానా
ఇబ్బందులు పడి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాం అని తృప్తి పడడమే మాత్రమే మిగిలింది.
ముఖ్యమంత్రిగా విశేష అనుభవం, పరిపాలనాదక్షుడిగా ఎంతో పేరూ వున్న చంద్రబాబు,
ఒక్క హామీ కోసం ఇంతగా లాయలాస పడాలా అని అనుకున్నవాళ్ళు వున్నారు. 'ఆరునూరయినా సరే,
రైతుల రుణ మాఫీ హామీని నూటికి నూరుపాళ్ళు అమలుచేసి
తీరుతాం' అని తెలుగుదేశం నాయకులు పదేపదే
ప్రకటనలు చేస్తూ పోవడంతో, ఈ విషయంలో సన్నగిల్లిన
రైతుల ఆశలు మళ్ళీ చిగుళ్ళు వేస్తూ వచ్చాయి. వున్న వాస్తవాన్ని ప్రజలకు వివరించి,
హామీ అమల్లో వున్న ఇబ్బందులను విడమర్చి చెప్పి వుంటే రైతులు సకాలంలో తమ బకాయిలు
ఏదోవిధంగా సర్దుబాటు చేసుకుని వుండేవారు. నిజానికి రుణమాఫీ చేయాల్సిందని రైతులు
ఎప్పుడూ అడగలేదు. తన పాద యాత్ర సమయంలో
రైతుల కడగండ్లు గమనించి టీడీపీ అధినేత అడక్కుండా ఇచ్చిన వరం అది. బహుశా అందుకే కాబోలు ఆయన ఈ హామీ అమలుపట్ల అంతగా
ప్రయాస పడివుంటారని అనుకోవాలి.
ప్రతి కధకూ ఒక నీతి వుంటుంది.
హామీల విషయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా నేర్చుకోవాల్సిన నీతి పాఠం వుందని
ఈ రుణ విమోచన హామీ ఉదంతం తెలియచేస్తోంది.
అమలు చేయగలిగిన హామీ మాత్రమే ఇవ్వాలన్నది ఆ నీతి.
తమ పరిధిలో లేని, తమ చేతిలో లేని హామీలు గుప్పిస్తూ పోతే, ఇదిగో ఇలాటి అనుభవాలే మిగులుతాయి.
NOTE: COURTESY CARTOONIST
(04-02-2015)
టీడీపీ 2009 మానిఫెస్టోలో తెలంగాణా తెస్తామనే వాగ్దానం చేసి పార్టీ పూర్తిగా కనుమరుగు కాకుండా కాపాడుకోగలిగింది. హామీలు నెరవేర్చే గుణం ఆ పార్టీకి లేదని దీనితోనే తెలిసిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ, ప్రత్యెక ప్రతిపత్తి, సింగపూర్ తరహా రాజధాని లాంటి కొత్త వాగ్దానాలను వారు తీరుస్తారా అని అడగడం శుద్ధ దండగ.
రిప్లయితొలగించండిజైగారూ, వ్యాఖ్యలు తెలుగులో వ్రాస్తున్నారు. సంతోషంగా ఉంది.
రిప్లయితొలగించండిరాజకీయపార్టీలకు ఉనికి గురించీ అధికారం గురించీ నిత్యస్పృహ ఉంటుంది కాబట్టి అవి సమయానికి తగుమాటలతో తంటాలు పడుతూ ఉంటాయి. అది సహజమే. ఫలాని పార్టీ మాటనిలబెట్టుకోలేదూ, ఫలాని పార్టీకి మాట నిలబెట్టుకోవటం చేతకాదూ అనటం మనకు మామూలే కాని సాధ్యాసాధ్యాల ప్రసక్తి కారణంగానూ రాజకీయవాతావరణం కారణంగానూ ఆ పార్టీలతంటాలు వాటివి.
ప్రజల విషయానికి వస్తే ఆశలూ ఆశాభంగాలూ తప్ప మరేమీ ఉండవు. పేరునకు మాత్రమే అధికారం ప్రజలది కాని వారిది నిత్యజీవనపోరాటం. వారికి వినాదైన్యేనజీవనం మించి పెద్దగా ఆశలేమీ ఉండవు. కాని రాజకీయపార్టీలు మాత్రం వారికి ఎండమావుల్ని చూపి మోసగిస్తూ ఉంటాయి. ఆ విషయంలో ప్రత్యేకించి ఏ పార్టీని కాని పేరుపెట్టి విమర్శించ వలసిన పని ఉందని అనుకోను. దేశమంతటా పరిస్థితి ఇలాగే ఉంటున్నది దశాబ్దాలుగా.
శ్యామలీయం మాస్టారూ, హామీల వెనుక చిత్తశుద్ధి ఎంత అనేది మనం బేరీజు వేసుకోవాలి.
రిప్లయితొలగించండిఇటీవల కేజ్రీవాల్ విద్యుత్ ఖర్చుల తగ్గింపు గురించి ఒక మాట అన్నారు: "మేము చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఎందుకు చేయలేదు? వాళ్ళూ చేయగలరు కానీ వారికి చేయాలని లేదు".
జైగారూ.
రిప్లయితొలగించండిరాజకీయపార్టీల చిత్తశుధ్ధినీ రాజకీయనాయకుల చిత్తశుధ్ధినీ నమ్మగలరోజులుగా అనిపించటం లేదు. నూటికో కోటికో చిత్తశుధ్ధిగల నాయకుడు ఉండవచ్చును. అధికారలాలస తప్ప సేవాదృక్పథంతో వర్తించే రాజకీయ పార్టీ కేవలం నాకు తెలిసి ఊహాజనితవస్తువే ఈ రోజుల్లో. ప్రయోజనదృష్టితో ఇచ్చే హామీలే కాని ప్రజాశ్రేయస్సుకోరి ఇచ్చే హామీలు స్వల్పాతిస్వల్పం నేటి రాజకీయవాతావరణంలో.
ఇది నా అభిప్రాయం మాత్రమే. తప్పైతే మంచిదే.
@శ్యామలీయం:
రిప్లయితొలగించండిమాస్టారూ, చిత్తశుద్ధి అన్నది వ్యక్తిగత అంశం (personal characteristic) కానక్కరలేదు. హామీను అమలు చేయకపోతే ఉత్పన్నం అయ్యే పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని వాగ్దానంపై నిలకడగా ఉంటారన్న గట్టి నమ్మకం కుదిరినా చాలు. ఇంకోరకంగా చూస్తె మనం (ప్రజలు) మనకు అత్యంత ముఖ్యమయిన విషయాలను అమలు చేయించుకోగాలగాలి (లేదా చేయించుకునే స్థాయికి ఎదగాలి).
రాజకీయనాయకులంటే చాలా మందికి (ముఖ్యంగా పట్టణ ప్రాంత మగ అగ్రవర్ణ విధ్యాదికులకు) చులకన. వారిని మాత్రమె తప్పు పట్టడం కొంతవరకు పలాయనవాదం. ఎలైటిస్ట్ వర్గాల మద్దతు/మౌనం వ్యవస్తలో లోపాలకు పునాది అని గుర్తిస్తే కొంత accountability వస్తుంది.
ఇటీవలి కాలంలో కొందరు "న్యూ వేవ్" రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. వారికి "సంప్రదాయ పార్టీలు" ఎందుకు పనికి రావో చెప్పడం తప్ప తాము ఏమి (& ఎలా) చేస్తామో చెప్పడం చేతకాదు. IMHO these folks deserve nothing but our contempt.