7, జనవరి 2015, బుధవారం

అర్ధం కానిది అర్ధశాస్త్రం


అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక 'అర్ధ' శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, వాటిని  అమ్మి బోలెడు లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా ఓడ మునిగిపోయి  సర్వస్వం కోల్పోవడం, అతగాడు మాత్రం మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి ఓడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదనంతా పోగొట్టుకుంటూ, తిరిగి కూడగట్టుకుంటూ  ఇలా ఇలా  వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు అలా అలా  సాగిపోయేవి. చదవడానికి బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు బికారి కావడం ఎందుకో చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
నిన్న మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం. సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల డబ్బు  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకేఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజు మాదిరిగా  పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాలు ఆడలేదు. మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం వింటే సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో అతలాకుతలం అయిపోయారు.


ఈ షేర్లేమిటో, బేర్లేమిటో తెలియని మాబోంట్లు ఆ వార్తలు చదువుతూ పాత చందమామ కధలు జ్ఞాపకం చేసుకున్నారు.
నీతి: డబ్బుతో ఆటలు ఆడరాదు

కార్టూన్ 'ఈనాడు' సౌజన్యంతో 

1 కామెంట్‌:

  1. షేర్ మార్కెట్ తీరు తెన్నులు ఎవ్వరూ చెప్పలేనివి. చెప్పగలిగిన అతి కొద్దిమంది కోటీశ్వరులు అవుతారు. 1979 లో పాకిస్తాన్లో భుట్టోను ఉరితీస్తే మన దేశంలో స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపింది. ఏమన్నా సంబంధం ఉన్నదా! లేదు. కానీ అది స్టాక్ మార్కెట్ అదంతే

    రిప్లయితొలగించండి