9, జనవరి 2015, శుక్రవారం

బుడగలు పగిలిపోతాయి జాగ్రత్త!

(Published by 'SURYA' telugu daily on 11-01-2015, SUNDAY)
అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక అర్ధ శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, బోలెడు బోలెడు  లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా వోడ మునిగిపోయి సర్వస్వం కోల్పోవడం,  అతగాడు మాత్రం పట్టు వదలని  విక్రమార్కుడి మాదిరిగా  మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలనన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి వోడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదననంతా పోగొట్టుకుంటూ,  తిరిగి కూడగట్టుకుంటూ -    ఇలా వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు సాగిపోయేవి. చదవడానికి ఎంతో  బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు అనే పెద్ద వ్యాపారి వున్నట్టుండి బికారి కావడం ఎందుకో ఏమిటో  చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
గత  మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం.  సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల  సొమ్ము  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకే ఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజులా పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాల జోలికి పోలేదు.  మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం విన్నప్పుడు  సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో బావురుమన్నారు.
మన దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యేంత వరకు జనంలో షేర్లు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. పత్రికల్లో కూడా వాటికి ప్రాధాన్యం అంతగా వుండేది కాదు. తెలుగు పత్రికలయితే కేవలం మొక్కుబడిగా తప్పదు అన్నట్టు షేర్ల హెచ్చుతగ్గులకు సంబంధించిన సమాచారం అరకొరగా ఇచ్చేవి. ప్రజలు కూడా అవి తమకు సంబంధించినవి కావు, ఎవరో కలిగినవాళ్ళ వ్యవహారమని అసలు పట్టించుకునే వారు కాదు. కానీ క్రమంగా జనంలో అవగాహన పెరిగింది. పల్లెటూళ్ళలో సయితం 'షేర్ బ్రోకర్లు' పుట్టుకొచ్చారు. తక్కువ మదుపు సమయంలో ఎక్కువ  ఆదాయం ఇచ్చే కల్పవృక్షంగా షేర్ మార్కెట్ జనం దృష్టిలో కనబడసాగింది. ఈ క్రమంలో కొందరేమో  కోట్లకు పడగలెత్తారు. చాలామంది వున్నది పోగొట్టుకుని బజారున పడ్డారు.  

షేర్ మార్కెట్లు కుప్పకూలడం ఇది మొదటి సారీ కాదు. అల్లా అని ఆఖరుసారి కాదు. బాగా అభివృద్ధిచెందిన దేశాల్లో కూడా షేర్ మార్కెట్లు ఢమాల్ అన్న సందర్భాలు చాలా చాలా వున్నాయి.
షేర్ మార్కెట్ అంటేనే ఒక రకంగా పెట్టుబళ్ళ మార్కెట్. పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టక్కరలేదు. మన దగ్గర డబ్బుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు కొని పెట్టుబళ్ళు పెట్టొచ్చు. ధర పెరిగినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. ఇలా కొంటూ, అమ్ముతూ లాభాలు కళ్ళ చూడవచ్చు. ఈ ఆశే జనాలను షేర్ మార్కెట్ వైపు పరుగులు తీయిస్తుంటుంది. ఒక్క షేర్లే కాదు రియల్ ఎస్టేట్ కూడా పెట్టుబళ్ళకు పెద్ద  కార్య క్షేత్రంగా  మారింది.
గత రెండు దశాబ్దాలుగా  జనాలను ఇంతగా వెర్రెత్తె౦చిన రంగం మరోటిలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముందు హైదరాబాదు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరించింది. వేలల్లో వున్న భూముల ధరలు లక్షల్లోకి, ఆ తరువాత కోట్లల్లోకి ఎగబాకి 'మట్టే బంగారం' అనే మాట  నిజమై కూర్చుంది. ఆర్ధిక సంస్కరణల ప్రభావం, ఐ.టీ. రంగం విస్తరణ ఇందుకు దోహదం చేసాయి. చిన్న చిన్నగా  ఈ రంగంలోకి దిగినవాళ్ళలో అనేకులు చూస్తుండగానే కోటీశ్వరులు కావడంతో అందరి కళ్ళు రియల్ ఎస్టేట్ పై పడ్డాయి. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వస్తుండడంతో వాటితో పాటే సకల అవలక్షణాలు సమాజంలోకి వచ్చిపడ్డాయి. రియల్ ఎస్టేట్ దందాలు పెరిగాయి. నేర ప్రవృత్తి కొత్త మొగ్గలు వేసింది. యెంత సంపాదించారు అన్న దానికే కాని ఎలా సంపాదించారు అన్నదానికి విలువ లేకుండా పోయింది.  వ్యాపారం పెరిగిన స్థాయిలోనే, అంతే  వేగంగా నైతిక విలువల పతనం కూడా అదే జోరులో సాగింది.
రాష్ట్ర విభజన అనంతరం  రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త కళ్ళెం పడుతుందని ఆశించారు కాని, మనిషి నెత్తురు మరిగిన పులి మల్లే వ్యాపారులు ఒక ముఠా మాదిరిగా మారి చిన్నదో పెద్దదో ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనే సామాన్యుల ఆశలపై నీళ్ళు చల్లారు. ఇప్పుడీ వ్యాపారం ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తుళ్ళూరు ప్రాంతం  వైపు మళ్ళింది. పలానా చోట అని స్థల నిర్ధారణ  ఇంకా జరగలేదు కాని ఆ ప్రాంతంలో  భూముల వ్యాపారం మాత్రం తారాస్థాయికి చేరింది. భూయజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నడుమ లావాదేవీలు జరిపే దళారులు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చారు. మొన్నమొన్నటివరకు బయట వ్యక్తులు ఎవరూ తొంగి చూడని ఆ ప్రాంతంలో ఇప్పుడు ఖరీదయిన కార్లు  సంచారం చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలలోని హోటళ్ళు ఈ బేహారులతో నిండిపోతున్నాయి. ఎక్కడ నలుగురు  కలిసినా, ఎక్కడ విన్నా భూముల ధరవరలు గురించిన ముచ్చట్లే. కోట్లకు పెరిగిన భూముల ధరలు గురించిన కబుర్లే.
'పచ్చని పొలాలను అమ్ముకుని నెలవారీ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతినెలా పదివేలనుంచి పది లక్షల రూపాయల అద్దె వచ్చే బిల్డింగులు అమ్మకానికి వున్నా'యంటూ  ఊరించే ప్రకటనలు ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, ఈ వార్తా కధనాలు చదువుతుంటే ఎప్పుడో తాతలనాడు  అమెరికాలో సంభవించిన 'పేలిన బుడగ' వృత్తాంతం స్పురణకు వస్తోంది.
దాదాపు వందేళ్ళ నాటి  చరిత్ర. అమెరికా అప్పటికే సంపన్న దేశం. తూర్పున వున్న న్యూ యార్క్ వంటి ప్రాంతాలు అభివృద్ధిపధంలో  తులతూగుతున్న రోజులు.. పౌరుల ఆదాయం బాగా పెరగడంతో వారికి ఉల్లాస జీవితం మీద మక్కువ పెరిగింది. మిగులు డబ్బులతో విహార యాత్రలు మొదలు పెట్టారు. అలాటివారికి  వాతావరణ రీత్యా ఫ్లారిడా ప్రాంతం చాలా అనువయినదిగా కనబడింది. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఒకప్పుడు నిద్రాణంగా వున్న ప్రాంతం కళకళలాడసాగింది. పర్యాటకులకు కావాల్సిన హోటళ్ళు, ఇతర సదుపాయాలు కల్పించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి ఎగబడ్డారు. చౌకగా భూములు దొరకడం వారికి మొదట్లో కలిసివచ్చింది. క్రమంగా డిమాండు పెరగడం, డానికి తగ్గట్టుగా వ్యాపారుల్లో పోటీ పెరగడం, దానాదీనా భూముల రేట్లకు రెక్కలు రావడం స్వాభావికంగా జరిగిపోయింది.


ఆ ప్రాంతంలో వున్న మియామీ బీచ్ పర్యాటకులకు స్వర్గధామం అనే పేరు తెచ్చుకుంది. దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఆ ప్రాంతంపై  పడింది. న్యూ యార్క్ లోని టైం స్క్వేర్ లో కళ్ళు మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులతో ఒక పెద్ద ప్రకటన  బోర్డు వెలిసింది. 'జూన్ నెలలో మియామీ చూడనివాళ్ళ  జీవితం వ్యర్ధం' అని అర్ధం వచ్చే భారీ  ప్రకటనలతో ఆకర్షితులయిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళడం మొదలయింది. కేవలం ఊహాగానాల ప్రాతిపదికగా అక్కడ  భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పర్యాటకులకు అవసరమయ్యే సకల  సంబారాలు సరఫరా  చేయడానికి దేశం నలుమూలలనుంచి రైలు రోడ్డు మార్గాల ద్వారా  సరుకులను అక్కడికి తరలించేవారు. ఒకానొక సమయంలో ఈ రద్దీ  ఎంతగా పెరిగిపోయిందంటే,  రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయే పరిస్తితి ఏర్పడింది. అయిదేళ్ళలో మొత్తం  పూర్తిగా తిరగబడింది. ఊహాగానాలు గాలికి ఎగిరిపోయాయి, అంచనాలు  తప్పిపోయాయి. ఫోర్బెస్ మ్యాగజిన్  ముందుగానే హెచ్చరించింది కానీ,  అప్పటికే  పరిస్తితులు చేయి దాటిపోయాయి. భూముల వాస్తవ ధరలు గురించి ఆలోచించకుండా కేవలం వ్యాపారుల అంచనాలను బట్టి ధరలను పెంచుకుంటూ పోవడం వల్ల మార్కెట్ తలకిందయిపోయింది. మియామీలో భూముల్ని కొని ఒక్క రోజులోనే  పదిరెట్ల లాభానికి అమ్ముకోవచ్చనే ఆశలు అడుగంటాయి. వీటికి తోడు,  ఆ ప్రాంతంలో వచ్చిన హరికేన్ తో పరిస్తితులు పెనం  మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయాయి. పులిమీద పుట్ర మాదిరిగా  వాల్ స్ట్రీట్ షేర్ మార్కెట్  కుప్పకూలడంతో ఫ్లారిడా ఆర్ధిక పతనం సంపూర్ణమయింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఫ్లారిడాకు కొన్ని దశాబ్దాలు పట్టింది.
ఇది చరిత్ర.  పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అంతే చెప్పేది.

(09-01-2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి