24, జనవరి 2015, శనివారం

అభివృద్ధిపధంలో - 'భారత రిపబ్లిక్'

Published by 'SURYA', Telugu Daily in its Edit Page on 25-01-2015, SUNDAY)

( జనవరి ఇరవై ఆరు, భారత గణతంత్ర దినోత్సవం)



దసరాదీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేనుజనవరి యిరవై ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే - గణతంత్ర దినోత్సవాన్ని  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
భారత రిపబ్లిక్ కు - దానితోపాటే జాతీయ గీతం 'జనగణమనకు షష్టిపూర్తి కూడా పూర్తయి ఆరో ఏడు నడుస్తోంది. నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై సంవత్సరాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఒక లెక్కలోది  కాదు. అయితే, ఏ  ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు  'నడిచి వచ్చిన దారిని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.

ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమనగీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందోఏ ఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - 'ను 'లాగా- 'ను 'లాగాతప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదుఎర్రకోట అంటే తెలియదుకానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలిఅంటే- కాసేపు పడుకోనీ మమ్మీఈ రోజు సెలవే కదా!అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా జనగణమనపాడడం పోయి –   గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్యనిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.

సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు,  ఈనాటి పరిస్తితులను చూసి – 'మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా నిలబడి జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం,యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినా ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా  పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి.
గిద్దెలుసోలలుశేర్లుసవాశేర్లుమానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.
అలాగేవీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు. 

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి  ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే , 'అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా  ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న  అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం కళ్ళ ముందే ఆవిష్కృత మవుతోంది.

అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. కానీ  అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.

భారత రిపబ్లిక్ వార్షికోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి