8, డిసెంబర్ 2014, సోమవారం

వొరిగిన కర్ణాటక సంగీత శిఖరం నేదునూరి


(PUBLISHED BY 'ANDHRA JYOTHI' DAILY IN ITS EDIT PAGE ON 09-12-2014, TUESDAY)
1968  జనవరి నెల.  నలభై ఆరేళ్ళ నాటి మాట.  హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదికమీద  నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ  ఎం చంద్రశేఖరన్ , మృదంగ విద్వాంసులు శ్రీ దండమూడి రామ్మోహనరావులు సహకరిస్తుండగా,  శ్రీ నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన  తన్మయస్తితిలో  తేలిపోయింది.  త్యాగరాజస్వామి  వారు ఎంతటి  ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి,  కృష్ణమూరిగారి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్  అయిదు నిమిషాలపాటు రవీంద్ర భారతి ఆడిటోరియం,  నేదునూరివారి సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్   తమిళుడు. అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్  తమిళంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా జీవితం ధన్యమయింది. ఇంత  గొప్ప సంగీతాన్ని పక్కనే  కూర్చుని వినే భాగ్యం కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా  మనగలిగిన అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను'
ఆయన నోటి నుంచి సంగీత కళానిధి అనే పదం రావడం యాదృచ్చికమైనా,  తరువాతి రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై  సంగీత అకాడమీ ఏటా ఇచ్చే పురస్కారం సంగీతకళానిధి. ప్రతి సంగీత  విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం కన్నా మిన్నగా  భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది. తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి  ఈ పురస్కారం లభించడంపట్ల హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే 1991 లో సంగీత కళానిధి పురస్కారం ప్రకటన వెలువడినప్పుడు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి. ఆయనకు ఆ రోజుల్లో పీ.ఆర్.ఓ గా   వున్న వనం జ్వాల నరసింహారావు ద్వారా విషయం తెలుసుకుని చెన్నారెడ్డి గారు   చక్కని అభినందన సందేశం పంపారు. ఆ పురస్కారం అందుకున్న తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది. స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.  చెన్నై మ్యూజిక్  అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా డిసెంబరు నెలలో జరిగే  సంగీత ఉత్సవాల్లో  1951  నుంచి క్రమం  తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు  కచ్చేరీ చేస్తూ వస్తున్న  ఘనత నేదునూరి వారిది. మొదటి వరసలో అప్పటి వరకు కళానిధి  పురస్కారం పొందిన వారు ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో,  దేశం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు సంగీతాంబుధిలో వోలలడుతారు. నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.  తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు.    చెన్నైకి మకాం  మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను  సంగీత పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం ఆయనకే చెల్లింది.



(కీర్తిశేషులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి) 

ఇటీవలనే   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమాచార సలహాదారు  శ్రీ పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో తీసుకున్న చర్యలు గురించి  నేదునూరివారు ప్రశంసించినట్టు  వార్తలు వచ్చాయి. నేదునూరి కృష్ణ మూర్తి గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ అశేష యశస్సును తన వెనుకే  వొదిలి అనారోగ్యంతో  తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ  మాండలిన్ శ్రీనివాస్, శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తిని ఒక్క ఏడాదిలోనే  పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే 'పద్మ' అవార్డులు  లభించాయి కానీ వారి గురువుకు  రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి  అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం. అయితే ఇంతలోనే  వారిక లేరన్న వార్త.
కర్ణాటక సంగీతంలో గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన  నేదునూరి బాణీని  అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో  ఈ నెల ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలవుతుంది. చెన్నై మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో,   టీ.టీ.కే. ఆడిటోరియంలో ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ  లేకపోవడం ఒక లోటయితే, వచ్చే నెల జనవరి ఇరవై ఆరు భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించబోయే 'పద్మ' పురస్కార గ్రహీతల జాబితాలో నేదునూరి వారి పేరు ఉండకపోతుందా అన్నది ఆయన అభిమానుల ఆశ.
చూడాలి ఏం జరుగుతుందో!

NOTE : Photo Courtesy Image Owner 


        

8 కామెంట్‌లు:

  1. రాజకీయాల ప్రభావంతో, రాజకీయనాయకమ్మన్యుల సిఫార్సులతో వచ్చే బిరుదులు ఆయన పాదరేణువులపాటి చేయవు కదా, అటువంటి అల్పవిషయాలను గురించి ఆలోచించకండి.

    నిన్నటి వారు వెళ్ళిపోతారు.
    నేటి వారు తలచుకుంటారు.
    రేపటి వారు మరచిపోతారు.
    విజ్ఞులు దానికి విచారించరు.

    రిప్లయితొలగించండి
  2. @syamaleeyam - I have not written any where in the article that I am thinking how to get a padma for sri nedunuri. why you are giving such unsolicited suggestions to me. - bhandaru srinivas rao

    రిప్లయితొలగించండి
  3. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ మాండలిన్ శ్రీనివాస్, శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిని ఒక్క ఏడాదిలోనే పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
    ------------------------
    మొదట రాత్రి "Hindu" లో చూశాను ఈ వార్తని. మనస్సు quiet గ అయిపొయింది. Thanks for writing about the demise of Sangeetha Kala Nidhi.

    రిప్లయితొలగించండి
  4. భండారువారూ,

    మీరు నేదునూరికి పద్మ-అవార్డు ఎలా వసుంది అని ఆలోచించారని అనలేదండీ! మీరు నొచ్చుకోవటానికి కారణం తెలియదు.

    ఇక్కడ నా వ్యాఖ్యలో అయాచితమైన సలహా ఇవ్వటం జరుగలేదు - అసలు నా మాటల్లో సలహా ప్రసక్తి లేదు.

    మీకు నా వ్యాఖ్యలు తీసుకోవటం‌ పట్ల అభ్యంతరం ఉన్నట్లు అనిపిస్తున్నది. దయచేసి వ్యతిరేకార్థాలు చూడకండి నా మాటల్లో.

    సెలవు.

    రిప్లయితొలగించండి
  5. @శ్యామలీయం గారికి -
    నేను రాసింది
    "...చెన్నై సంగీత అకాడమీ ఏటా ఇచ్చే పురస్కారం సంగీత కళా నిధి. ప్రతి సంగీత విద్వాంసుడు దాన్ని పద్మ పురస్కారం కన్నా మిన్నగా భావిస్తారు."
    మీరు రాసింది
    "...... రాజకీయాల ప్రభావంతో, రాజకీయనాయకమ్మన్యుల సిఫార్సులతో వచ్చే బిరుదులు ఆయన పాదరేణువులపాటి చేయవు కదా, అటువంటి అల్ప విషయాలను గురించి ఆలోచించకండి"
    మీరు మళ్ళీ రాసింది
    "భండారువారూ,

    మీరు నేదునూరికి పద్మ-అవార్డు ఎలా వసుంది అని ఆలోచించారని అనలేదండీ! మీరు నొచ్చుకోవటానికి కారణం తెలియదు.

    ఇక్కడ నా వ్యాఖ్యలో అయాచితమైన సలహా ఇవ్వటం జరుగలేదు - అసలు నా మాటల్లో సలహా ప్రసక్తి లేదు.

    మీకు నా వ్యాఖ్యలు తీసుకోవటం‌ పట్ల అభ్యంతరం ఉన్నట్లు అనిపిస్తున్నది. దయచేసి వ్యతిరేకార్థాలు చూడకండి నా మాటల్లో."
    ఇప్పుడు చెప్పండి
    "నేను రాయని విషయాన్ని నాకు ఆపాదించి నేను అడగని సలహా - 'అటువంటి అల్ప విషయాలను గురించి ఆలోచించకండి' అని రాసింది మీరే కదా! పైగా 'నేను నొచ్చుకున్నాను కారణం తెలియదు, వ్యతిరేకార్ధాలు చూడకండి' అని మళ్ళీ సలహా ఇస్తున్నారు. ఇది భావ్యమా చెప్పండి
    నమస్కారాలతో - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  6. మీరు వ్రాయని విషయాన్ని మీకు ఆపాదించలేదండీ. మీరు మీ వ్యాసంలో ఒక చోట, "నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'పద్మ' అవార్డులు లభించాయి కానీ వారి గురువుకు రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం" అని చెప్పి, నేదునూరికి పర్మ పురస్కారం రాలేదన్నవిషయాన్ని మీరు ప్రస్తావించారు. అది నా వ్యాఖ్య నేపధ్యం.

    సరేనండి. నిష్కారణంగా మీకు ఇబ్బంది కలిగినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. @ శ్యామలీయం గారికి - నేను విషయాన్ని మరీ సాగదీస్తున్నానని అనుకోకండి. ఆయన శిష్యులు మనస్తాపం చెందుతున్నారని మాత్రమె రాసాను. విచారాలు వ్యక్తం చేయడం ఇలాటివన్నీ రాజకీయ నాయకులకి వొదిలేసి మనం హాయిగా స్నేహితులుగా ఉందాం.

    రిప్లయితొలగించండి
  8. తప్పకుండా నండీ. అంతకంటే కావలసిందేముందీ!

    రిప్లయితొలగించండి