6, డిసెంబర్ 2014, శనివారం

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతారాగాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 07-12-2014, SUNDAY)

"మోడీ ప్రాభవం తగ్గుతోందా? ఆయన నేతృత్వంలోని ఎండీయే కూటమికి, 'కాని కాలం' దాపురించిందా? జాతి హఠాత్తుగా ఏదైనా విపత్తును ఎదుర్కోబోతోందా ? దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందా? త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా?"
ఈ ప్రశ్నలకు వేటికీ 'అవును' అనే సమాధానం లేదు. అయినప్పుడు కొత్తగా వినబడుతున్న ప్రతిపక్షాల ఐక్యతారాగాలకు అర్ధం ఏమిటి?    
రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. అది లేనప్పుడు , ఒకప్పటి జనతా పార్టీ కొమ్మలయిన  ఆరు పార్టీలు కలిసి ఏకమై ఒకే పార్టీగా ఏర్పడి సాధించేది ఏమిటి? ఈ కొత్త రాజకీయ కూటమి లేదా కొత్త పేరుతొ ఆవిర్భవించబోయే సరి కొత్త పార్టీ - పాలకపక్షం అయిన బీజేపీకి విసరబోయే సరికొత్త సవాలు ఏమిటి? ప్రస్తుత లోకసభలో ఈ ఆరుపార్టీలకీ వున్న మొత్తం పదిహేనుమంది సభ్యులు ఒక పార్టీగా ఏకమైనా దానివల్ల పాలక పక్షానికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ లేనప్పుడు ఈ కొత్త పార్టీ వల్ల   పాలక పక్షం బీజేపీకి  ఎదురయ్యే ముప్పు ఏముంటుంది?   
ఇప్పుడు జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్న అంశాలు ఇవే. 

  
దేశ రాజకీయాలను శాసించగల అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్ లో పాలకపక్షం సమాజ్ వాదీ పార్టీ, జనత దళ్ (యు), రాష్ట్రీయ జనతా దళ్, జనతా దళ్ (యస్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, సమాజ్ వాదీ జనతా పార్టీ - ఈ ఆరూ  పైకి చిన్నా చితకగా కనిపించినా ఒకరకంగా ఇవన్నీ  ఓ మోస్తరు పెద్ద పార్టీలే. కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపగల సామర్ధ్యం వున్న పార్టీలే. ఈ పార్టీల అగ్ర నాయకులు మూలాయం సింగ్ యాదవ్,  శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, దుష్యంత్  చౌతాలా  ఇటీవల ఢిల్లీలో సమావేశమై తమ పార్టీలనన్నింటినీ ఏకం చేసి ఒకే పార్టీగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న మోడీ ప్రాభవానికి అడ్డుకట్ట వేయడం  ఈ కొత్త పార్టీ  ప్రధాన ధ్యేయంగా కనబడుతోంది.  మరో జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్తితి అంత ఆశాజనకంగా లేని ప్రస్తుత పరిస్తితుల్లో కొత్త పార్టీ ఆవశ్యకత ఆ కొరతను తీర్చగలుగుతుందని ఆశించడం ఈ పార్టీ ఆలోచన పురుడు పోసుకోవడానికి దోహదపడివుండవచ్చు.  విచిత్రం ఏమిటంటే అలనాడు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి అన్ని పార్టీలు కలిసి  జనతా పార్టీగా ఏకం కావడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ (అప్పుడు జనసంఘం) ప్రభుత్వాన్నే  ఇరకాటాన పెట్టడానికి  ఇప్పుడీ పార్టీలన్నీ ఏకం కావడం.  ప్రస్తుతం ఈ ఆరు పార్టీల  విలీనం ద్వారా ఏర్పడబోతున్న కొత్త రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కాగలుగుతుందా అనే ప్రశ్నకు 'రాజకీయ శూన్యత' అనే అంశం ఒక్కటే సానుకూల సమాధానం చెప్పడానికి ప్రతికూలంగా ఉంటోంది.
గతంలో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి గట్టి అనుభవమే మనకుంది.
స్వాతంత్ర్యానంతర రాజకీయాలో చీకటి అధ్యాయంగా  పేర్కొనే ఎమర్జెన్సీ పరిణామాల అనంతరం ప్రతిపక్షాల నడుమ సయోధ్యకు దండలో దారం మాదిరిగా నాటి నేత లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన సారధ్యంలో జనతా ప్రయోగం కొంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం వరకు విజయవంతం అయింది. శ్రీమతి ఇందిరాగాంధీని దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యం నెరవేరిన తరువాత జనతా పార్టీలో ఆంతరంగిక   విభేదాలు పెచ్చరిల్లాయి. కేవలం కక్ష సాధింపు, అధికార వ్యామోహం తప్ప కలగూరగంప వంటి  జనతా ప్రభుత్వానికి వేరే ధ్యాస, లక్ష్యం లేవన్న  అపనింద మోస్తూ  జనతా ప్రయోగం నీళ్ళు కారిపోవడానికి అందులో చేరిన ఆయా  పార్టీల నేతలే కారణం అయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో ఓ రకమైన ఉదాసీన భావం ప్రబలడానికి కూడా జనతా ప్రయోగ వైఫల్యం దోహదం చేసింది. తరువాతి కాలంలో ప్రతిపక్షాల ఐక్యతారాగం కొత్త పల్లవి అందుకుంది. ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకుంటూనే, భావసారూప్యత ప్రాతిపదికగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయింది. ఇందువల్ల ప్రభుత్వాల మనుగడకు  కొంతవరకు వెసులుబాటు లభించింది  కానీ ప్రజలపట్ల బాధ్యతలను నెరవేర్చడంలో వాటికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.     
అందుకే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆరు పార్టీలు కలవబోతున్నాయి అనే వార్త ఉత్తర భారతంలోని మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది కాని ప్రజల్లో దానిపట్ల అంత ఆసక్తి కానరావడం లేదు.
కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం అన్న ఒక్క కారణంతో,  అందువల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో ఈ కొత్త పార్టీ ఆలోచన రూపుదిద్దుకున్నదంటే నమ్మడం కష్టం. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ఈ పార్టీలు నమ్ముతుండవచ్చునేమో కాని  దేశ రాజకీయాల తీరుతెన్నులు గమనించేవారు విశ్వసించడం కష్టం. లోక్ సభలో రెండు స్థానాలు కలిగిన బీజేపీ తదనంతర కాలంలో పుంజుకుని కేంద్రంలో అధికారం దక్కించుకున్న విషయాన్ని  మరువకూడదు.    
కొత్త పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఈనాడు సాగుతున్న చర్చ. భవిష్యత్తులో సంభవించగల రాజకీయ పరిణామాలకు దీన్ని ఒక సంకేతంగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీల ప్రభావం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితం. అక్కడకూడా వీటి మధ్య ఆధిపత్య పోరు జనాలకు సుపరిచితం. ఈ పార్టీలకు ప్రస్తుత పార్లమెంటులో వున్న బలం కాంగ్రెస్ తో పోలిస్తే తక్కువే. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల తోడ్పాటు లేకుండా జాతీయ స్థాయిలో ఈ కొత్త పార్టీ సాధించేది పూజ్యం. కాంగ్రెస్ ను కలుపుకుని పోవడం ద్వారా ఓ మేరకు ఫలితం ఉండవచ్చు.
మరో ఊహాగానం కూడా షికారు చేస్తోంది. అసలు ఈ కొత్త పార్టీ ఆలోచన కాంగ్రెస్ పుణ్యమే అని ఓ వాదన వినబడుతోంది. అయితే దాన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి.
రాజకీయ పార్టీల కలయిక పవిత్రంగా వుండి, పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. అతుకులు పెట్టి అతికినప్పుడు  అంత త్వరగానే అతుకు ఊడిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. వీటికి అవకాశంవాదం తోడయితే ఇక చెప్పేపనేలేదు. (06-12-2014)

NOTE: Photo Courtesy Image Owner

1 కామెంట్‌: