22, డిసెంబర్ 2014, సోమవారం

ప్రాంతీయ పార్టీలకు అలారం గంటలు


జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికలపై వెలువడిన ఎక్జిట్ పోల్ ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్  అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివని  ఢిల్లీ నుంచి వచ్చిన  ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితాలు ఓ ప్రమాద హెచ్చరిక అనేది ఆయన మనసులోని మాట. బీజేపీ నుంచి ఆ పార్టీలు గట్టి సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది మరో తాత్పర్యం.


ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన  నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా ఆయన ఇంకో  ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేసారు. దక్కిన అధికారం కలకాలం  నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ  తరువాత 2019 లో   జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం  ఎల్లాగా  అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే  దృష్టి పెట్టారన్నది ఆ విశ్లేషకుడి అభిప్రాయం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదని అయన ముక్తాయింపు. కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా  పార్టీలు అనుసరించిన విధానాలే  అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా  మారిపోతాయని ఆ విశ్లేషణ సారాంశం. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన ఢిల్లీ రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన  కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా  చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్  షా  ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019  లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.  ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ  పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ  ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి  వున్న నిబద్దతను  అంగీకరిస్తారు. మరి  అద్యతన భావిలో  విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని  ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా  ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు  రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి  ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
రెండు ప్రాంతీయ  పార్టీలకి ఇవి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(22-12-2014)

NOTE: Courtesy Image Owner 

6 కామెంట్‌లు:

  1. సదరు విశ్లేషకుడు ఎవరో కూడా చెప్పకపోతే ఆ విశ్లేషణకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

    ఇకపోతే భాజపా జమ్మూ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలుచుకుంటే ఆశ్చర్యం ఎందుకు? వారు కాశ్మీర్ లోయలో ఓ మోస్తరు ముద్ర తప్ప పెద్దగా ప్రభావం చూపలేరని ఎక్సిట్ పోల్స్ చెబుతున్నాయి. లోయలో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్సు బలాబలాలు తారుమారు అవ్వొచ్చు కానీ రెండూ కనుమరుగు కావని తెలుస్తుంది. అయితే గియితే ఇది జమ్మూలో కాంగ్రెస్ వారికి వేకప్ కాల్ కావొచ్చు అంతే.

    జార్ఖండ్ రాష్ట్రానికి వస్తే జేఎంఎం చరిత్ర నిండా స్కాములు, కీచులాటలు, గొడవలే. వారు ఎప్పుడూ నిలకడగా ఉన్న దాఖలాలు లేవు. ఎన్నో ఏళ్లుగా గట్టి పట్టు ఉన్న భాజపా ఈ తడవ మోడీ వేవులో గద్దె ఎక్కితే పెద్దగా ఉలక్కి పడాల్సిన అవసరం ఏముంది?

    Sorry but this "analysis" ignores both ground realities & history. The inferences drawn are not supported by any rational basis.

    రిప్లయితొలగించండి
  2. @జై గారికి,
    అయ్యా,తమరు భాజపా అతి నిర్దాక్షిన్యంగా మిత్రుల్ని కూడా కబళిస్తూ అయినా సరే "కమలమే సకలం కావాలి" అనే అధికార అదాహాన్ని గమనిస్తున్నట్టు లేదు!

    రిప్లయితొలగించండి

  3. ఇన్నాళ్ళూ దయ్యాన్ని దశాబ్దాల తరబడి మోశారు తలమీద, ఈ దేశ ప్రజలు. సంవత్సరం కూడా పూర్తికాని దాని మీద ఎందుకండీ అంత భయం.

    రిప్లయితొలగించండి
  4. @Hari Babu Suraneni:

    మహారాష్ట్రలో శివసేన ఇన్నేళ్ళూ పోషించిన పెద్దన్న పాత్రకు కాలం చెల్లిపోయింది కాబట్టి భాజపా వారికి మంచి గుణపాథమె నేర్పింది. ఈ పరిస్తితి ఎవరికీ వచ్చినా అవతలి వారు అడ్వాంటేజ్ తీసుకుంటారు.

    ఇక కాశ్మీర్/జార్ఖండ్ ఫలితాలు/పోకడలు (ఎగ్జిట్ పోల్ కాదు) చూస్తె రెండు రాష్ట్రాలలో వేకుప్ కాల్ కాంగ్రెస్ తప్ప ప్రాంతీయ పార్టీలకు కాదు. Even NC is faring better than in LS elections.

    The unnamed "expert's" opinion is clearly wrong.

    రిప్లయితొలగించండి
  5. ను ప్రస్తుతానికి భాజపా పత్ల పాజిటివ్ గానే వున్నా - కానీ అపరిమితాధికారం యెంతటివాళ్లనయినా చెదగొదుతుంది,అదీ నా భయం!?

    రిప్లయితొలగించండి
  6. అపరిమిత అధికారం మనుషులను చెడగొడుతుంది. నిజమే. కాని అందరినీ ఒక్కలాగే చెడగోట్టదు. చూద్దాం ఈ అపరిమిత అధికారం బి జె పి ని ఎలా చెడగొడుతుందో.కాస్త ఓపిక పట్టి మళ్ళీ ఎలెక్షన్లు వచ్చేదాకా ఆగితే మళ్ళీ మనకే కదా ఆవకాశం, మన ప్రియమైన కాంగ్రెస్ ను గెలిపించి మళ్ళీ నెత్తిన పెట్టుకోవచ్చు. ఐదేళ్ళు ఆగాలి తప్పదు మరి.

    రిప్లయితొలగించండి