15, నవంబర్ 2014, శనివారం

చరిత్రలో నెహ్రూ స్థానం

(Published by 'SURYA' telugu daily in its Edit page on 16-11-2014, SUNDAY)
నూటపాతికేళ్ళ క్రితం జన్మించి యాభయ్ ఏళ్ళ కిందట మరణించిన జవహర్ లాల్ నెహ్రూ గురించి  ఈనాడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు వుండి తీరాలి. గొప్ప చరిత్రకారుడు అయినప్పుడే ఇది సాధ్యం. అయితే ఇందులో విడ్డూరంగా కానవచ్చే ఒక విషయం ఏమిటంటే, నెహ్రూను ప్రత్యర్ధి కాంగ్రెస్ ఆస్తిగా పరిగణించి ఆయన్ని చరిత్రపుటల్లో నుంచి సమూలంగా తొలగించాలని పావులు కదుపుతున్న మోడీ సర్కారు కూడా ఇన్నేళ్ళ తరువాత జనం నెహ్రూను సంస్మరించుకోవడంలో పరోక్షంగా సహకరించడం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏళ్ళతరబడి ప్రధానమంత్రిగా పనిచేసి తన అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఒక సముచిత స్థానం కల్పించడంలో నెహ్రూ చేసిన కృషి జాతి స్మృతి పేటికలో ఈనాటికీ పదిలంగా వుంది. నెహ్రూ పొరబాట్లు చేసివుండవచ్చు కానీ తప్పులు చేయలేదు అని విశ్వసించే జనానికి ఈనాటికీ  కొదవలేదు.  ఆయన నూటపాతిక జయంతిని ప్రభుత్వమే స్వయంగా పూనుకుని నిర్వహించి వుంటే మోడీ సర్కారుకు మరింత వన్నె వచ్చి వుండేది అని వారు నమ్ముతున్నారు. నెహ్రూ మా పార్టీ ఆస్తి అని కాంగ్రెస్ నమ్ముతున్నట్టే మోడీ ప్రభుత్వం కూడా ఆయన్ని కాంగ్రెస్ మూల పురుషుడిగానే భావిస్తూ ఆయన స్మృతిని పరిహరించడం ద్వారా కాంగ్రెస్ మూలాలను పెళ్లగించవచ్చుననే ఉద్దేశ్యంతోనే, ఏటా నవంబర్ పదునాలుగో తేదీన సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్న చాచా నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా అధికారికంగా జరిపే పద్దతికి స్వస్తిచెప్పినట్టు భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే  మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. గతంలో వాజ్ పాయ్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన రోజుల్లో కూడా పండిత నెహ్రూ జయంతిని  యధారీతిగా సర్కారే నిర్వహించిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. అలాగే,  కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో మహా నాయకుడు, నెహ్రూ సమకాలికుడు, అన్నింటికీ మించి మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ కు చెందిన ఉక్కుమనిషి -  సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తిరిగి  తెర మీదకు తీసుకువస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. నెహ్రూను తమ సొంత ఆస్తిగా పరిగణించే విధానం ఇంకా ఆ పార్టీలో కొనసాగుతోంది. నెహ్రూ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని  ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సుకు దేశదేశాల వారిని ఆహ్వానించిన ఆ పార్టీ,  సొంత దేశపు ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీని పిలవకపోవడం దీనికి దృష్టాంతం. ఏతావాతా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల నడుమ ఇప్పటికే వున్న అనేక విభేదాంశాల జాబితాలోకి నెహ్రూ పేరు కూడా చేరింది.
నెహ్రూ ప్రధానిగా పాలించిన తొలి ఏళ్ళలో, కాంగ్రెస్ పార్టీకే చెందిన అనేకమంది నాయకుల ప్రాధాన్యతను ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఒక పధకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారనీ, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే క్రమంలో ఇది జరుగుతూ వచ్చిందనీ నమ్మేవారు ఆ పార్టీలోనే అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు.  స్వతంత్ర భారతావనికి ప్రధమ ప్రధానమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు నెహ్రూను మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉన్నప్పటికీ జవహర్ మీద గాంధీ పెంచుకున్న అవ్యాజానురాగం, పటేల్ అవకాశాలకు గండి కొట్టిందని వారి నమ్మకం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, నెహ్రూ నేతృత్వంలో పనిచేయడానికి సర్దార్ పటేల్ ఎన్నడూ విముఖత చూపలేదు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసువాది అయిన సర్దార్  పటేల్, ఉప ప్రధానిగా, హోమ్  మంత్రిగా తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. ఆనాటికి  ఇంకా సజీవంగా వున్న ప్రజాస్వామిక లక్షణాల దృష్ట్యా కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో లేదా ఇతర సందర్భాల్లో నెహ్రూ, పటేల్ ల నడుమ సాగిన వాదోపవాదాలు ఇరువురి మధ్యా సఖ్యత తక్కువ అనే సంకేతాలను ఇచ్చివుండవచ్చు. కానీ, ప్రజాస్వామిక  విధానాల్లో నెహ్రూకు వున్న విశ్వాసం యెంత బలవత్తరమైనదో తెలియచెప్పే సంఘటనలు కూడా అనేకం వున్నాయి. పటేల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన అభీస్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వాటిని నెహ్రూ ఆమోదించిన తీరే ఇందుకు ఉదాహరణ.
జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో సందర్భంలో చెప్పిన ఒక ఉదంతం ఇది.


భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.  ప్రధాని నెహ్రూ పరిస్తితి కూడా అదే. అలా ఉండేదిట సర్దార్ పటేల్ వ్యవహార శైలి.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి.  స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు  రాస్తున్నారని అనుకునేవారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత ప్రపంచవ్యాప్తంగా  నూతన ఆర్దిక విధానాలు అమలుకావడం మొదలైన దరిమిలా, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం చూసాం. ధరల పెరుగుదల వంటి  రుగ్మతలు మినహా ఆర్ధిక సంస్కరణలవల్ల ఆదిలో తలెత్తిన అనేక ఆటుపోట్లను మన దేశ ఆర్ధిక వ్యవస్థ తట్టుకోగలగడానికి ప్రధాన కారణం - ప్రభుత్వ రంగ వ్యవస్థలకు శ్రీకారం చుడుతూ, మరో పక్క ప్రైవేటు రంగానికి పరిమిత ఊతం ఇస్తూ నెహ్రూ అలనాడు అనుసరించిన మిశ్రమ ఆర్ధిక విధానం. ఈ వాస్తవాన్ని ఈనాటి ఆర్ధిక నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు.
కాశ్మీర్ సమస్య, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలలో నెహ్రూ తనకుతానుగా తీసుకున్న నిర్ణయాలు దేశ శ్రేయస్సుకు విఘాతంగా పరిణమిస్తాయని నెహ్రూ రోజుల్లో కూడా బహిరంగ విమర్శలు చెలరేగాయి. అయితే జాతి జనులలో నెహ్రూకు వున్న అపార ఆకర్షణ ముందు ఈ విమర్శలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నెహ్రూ మరణించిన వెంటనే ఆసేతుహిమాచలం స్పందించిన తీరు నెహ్రూకు ప్రజల్లో వున్న ఆదరణకు అద్దం పడుతుంది.
నెహ్రూ  అనంతరం ఆయన వారసురాలయిన శ్రీమతి ఇందిర అనుసరించిన కొన్ని విధానాలు కాంగ్రెస్ పార్టీ పట్ల  ప్రజల్లో విరక్తిని  కలిగించిన మాట కూడా నిజం. అయితే అదేసమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన యుద్ధంలో  పాకిస్తాన్ పై,  పై చేయి సాధించిన నాయకురాలిగా శ్రీమతి ఇందిరా గాంధి,  చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న విషయం కూడా వాస్తవం. రాజకీయ ప్రత్యర్దులనే కాకుండా సొంత పార్టీలో ప్రత్యర్దులను సయితం ఆవిడ విడిచిపెట్టలేదు. సర్వం సహా నాయకురాలిగా రూపొందాలనే కాంక్ష చివరికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవితాన్నే బలితీసుకుంది. విచిత్రం ఏమిటంటే శ్రీమతి ఇందిరను, ఆమె విధానాలను తూర్పారబట్టిన వారు కూడా అధికార అందలం ఎక్కిన తరువాత దాన్ని నిలుపుకునే క్రమంలో వాటినే అనుసరించడం.
ప్రత్యర్ధి పార్టీలను సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనలు ఇప్పుడు మరింత వూపందుకున్నట్టుగా కానవస్తోంది. నిజంగా ఇది విచారకరం. ప్రజాస్వామ్య ప్రియులను ప్రధానంగా కలవరపరుస్తున్న  అంశం ఇదే.
రాజకీయ నేతలు రాజకీయులుగా మిగిలిపోకూడదు. రాజనీతిజ్ఞులుగా పరిణతి చెందే ప్రయత్నం చేయాలి. చరిత్ర సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ, ఎవరినో చరిత్ర గర్భంలో కలిపే యోచనలు మంచి చేయవు. చరిత్రను  తిరగరాయాలని గతంలో ఎందరో పూనుకున్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలో తలపెట్టిన  'టైం కాప్స్యూల్' వ్యవహారం ఇంకా కొందరికి గుర్తుండేవుంటుంది. కాబట్టి గమనంలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రకారులను ఎవ్వరూ తయారు చేయలేరు. చారిత్రిక పురుషులకు  చరిత్ర తనకుతానుగా తనలో స్థానం కల్పిస్తుంది. అలాగే, చరిత్ర హీనులను పనికట్టుకుని చరిత్ర నుంచి తొలగించాల్సిన అక్కర కూడా లేదు. అలాటివారు ఎవరికివారే చరిత్ర పేజీలనుంచి కనుమరుగయి పోతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. (15 - 11 - 2014)

NOTE: Courtesy Image Owner 

4 కామెంట్‌లు:

  1. టైం కాప్స్యూల్ వ్యవహరం ఏమిటో కాస్త వివరించండి

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.
    ???
    నిజంగా ఇది మెచ్చుకోదగ్గ విషయం కాదనుకుంటాను!తింగరి తనం కాకపోతే నాకు బజన చెయ్య్యొద్దని డవిరెక్తుగా చెప్పకుండా యెందుకీ తిక్కపని?లేదంటే "ఆహా!నెహ్రూ తనని తనే విమర్శించుకున్నాడు చూశారా?!" - అని జనం మూర్చ్చ పోవాలనా?

    రిప్లయితొలగించండి