17, నవంబర్ 2014, సోమవారం

పత్రికాస్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు

  

అవి ఎమర్జెన్సీ రోజులు.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.



 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజాన్ని  వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేస్తున్న  నాకు, తన మాదిరిగా  వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్ఛవుందని ఒప్పుకుంటాను.

పత్రికా స్వేచ్ఛ పట్ల  అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు, నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్ఛ  గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.

ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికాస్వేచ్ఛ భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్ఛ  అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.

నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ఎడిట్చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో పత్రికా స్వేచ్చకుపెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల వెంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగా వున్నప్పుడు వారి పత్రికలలో వారి మార్గదర్సకత్వంలో   ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ఎడిటోరియల్ పాలసీఅంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికాస్వేచ్చకు  అర్ధమేముంటుంది?

నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.

అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవస్తున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.

అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు దగ్గరలో  ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి







7 కామెంట్‌లు:

  1. ఇది పునర్ముద్రితమైన టపా అనుకుంటాను. బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. @ శ్యామలీయం - మీ ధారణశక్తికి అభినందనలు. ప్రెస్ డే సందర్భంగా పునర్ ముద్రితం.

    రిప్లయితొలగించండి

  3. >>> ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు.


    భండారు వారు,

    ఆ వ్యాసాన్ని ఈ టపా లో ప్రచురిస్తే చదవ డానికి వీలు !

    Some times the policies are so hand twisting that the makers themselves get caught in that knot wondering what to do!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. @జిలేబి - పత్రికల తలరాతలు - భండారు శ్రీనివాసరావు


    పూర్వం సోవియట్ యూనియన్ కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న కాలంలో – ఇజ్వెస్తియా, ప్రావ్దా అనే రెండు రష్యన్ పత్రికలు రాజ్యం చేస్తూ వుండేవి. ఇజ్వెస్తియా ఆనాటి సోవియట్ ప్రభుత్వ అధికార పత్రిక. (ఇజ్వెస్తి అంటే ‘వార్త ’ అని అర్ధం). పొతే, ప్రావ్దా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. (ప్రావ్దా అంటే ‘నిజం’) వీటి సర్క్యులేషన్ కోట్లలో వుండేదంటే నమ్మడం కష్టం. కానీ నిజం. ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో నేను ‘రేడియో మాస్కో’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు – మాస్కోలో ప్రతి రష్యన్ పౌరుడి చేతిలో ఈ రెండింటిలో ఏదో ఒక పత్రిక విధిగా దర్శనమిచ్చేది. గోర్భచెవ్ - ‘గ్లాస్నోస్త్’ పుణ్యమా అని భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించిన రష్యన్లు – ‘ఇజ్వెస్తియా లో ప్రావ్దా లేదు – ప్రావ్దా లో ఇజ్వెస్తియా లేదు’ అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ‘వార్తలో నిజం లేదు- నిజంలో వార్త లేదు’ అన్నమాట.

    ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ నడిపే పత్రికల్లో విశ్వసనీయత మాట అటుంచి – ఆ పత్రికలు వాటి కరపత్రాలుగానో, ప్రచార పత్రాలుగానో మిగిలిపోతాయి తప్ప – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల పటిష్ట పునాదులుగా పనికిరావన్న థియరీ ఒకటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండడం వల్లనే ఆకాశవాణి, దూరదర్శన్ వార్తలకు విశ్వసనీయత ప్రశ్నార్థకమయిందని చెప్పేవారు కూడా లేకపోలేదు.

    ఇప్పుడు జరుగుతున్న చరిత్ర గమనిస్తుంటే – ఈ సిద్ధాంతానికి కూడా కాలం చెల్లిపోతున్నదన్న సూచనలు కానవస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలే కాదు – ప్రైవేటు రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల పరిస్తితి సయితం ఇందుకు భిన్నంగా లేదన్న భావన ఊపిరి పోసుకుంటోంది. పార్టీలనూ, ప్రభుత్వాలనూ తామే శాసించగలమన్న ధీమా ప్రబలడమే దీనికి కారణం. పైపెచ్చు, ఏదయినా విషయం ప్రజలకు చేరాలంటే ఈనాడు మీడియాను మించిన మార్గం లేకపోవడం కూడా ఈ ధీమాకు దన్ను ఇచ్చింది. అందుకే సమాజంలో మీడియా వారంటే అన్ని వర్గాల్లో అంత మన్ననా మర్యాదా. అలాగే అంత భయం బెరుకు కూడా.

    గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

    ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

    వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

    ‘కలం కూలీ’గా తనను తాను సగర్వంగా చెప్పుకున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు జి. కృష్ణ గారన్నట్టు – ‘పత్రికల రాతలే వాటి ‘తలరాతలను’ మారుస్తాయి.

    రిప్లయితొలగించండి
  5. మన దేశంలో పత్రికా స్వేచ్చ వాటి అధిపతులకు మాత్రమే ఉన్నది. నేను పాత ఆంధ్రజ్యోతిలో పని చేసేటప్పుడు ఖమ్మం స్టాఫర్ ఓ సూచన చేశాడు. మీరు జలగం ప్రసాదరావుకు వ్యతిరేకంగా వార్తలు వ్రాయవద్దని. అలా నాకు నచ్చదని చెపితే మీరు జాబ్ మానేయాల్సి వస్తుందని చెప్పాడు. ఆ తరువాత అలాగే మానేయవలసి వచ్చింది. అయితే జలగం ప్రసాద్ కు వ్యతిరేకంగా వ్రాసి కాదు స్థానికి కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాననుకుని తీసేశారు. మళ్లీ వారే పిలిచి పని చేయమన్నారు. ఎడిటొరియల్ పాలసీ అనేది ఈరోజులలో హాస్యాస్పదమైన అంశమే. చిన్న పిల్లాడినడిగినా ఏ పత్రిక ఏ పార్టీ వార్తలు వ్రాస్తుందో చెప్పేసే రోజులివి. మొత్తం సమాజమే వ్యక్తిగత ఆస్తి పెంపకం ప్రాకులాటలో ఉన్నప్పుడు చాలీ చాలని జీతాల విలేఖరులు (?) తో పాటు జీతం ఎంత ఎక్కువగా నున్న విలేఖరులు కూడా టీ కోసమే కాదు చాలావాటికోసం వార్తల కాలంస్ నింపుతారు. అయితే ఇంకా ఈ వృత్తిలో విలువలు మిగిలే ఉన్నాయి లెండి.

    ఆకాశవాణి - దూరదర్శన్ లు కొంతకాలం కాంగ్రెస్ కు బాకాలుగా పని చేశాయనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రైవేట్ చానళ్ల కంటే దూరదర్శన్లోని కొన్ని ప్రోగ్రాములు బాగుంటున్నాయి. సోవియట్ పత్రికలగురించి మీరు చెప్పిన అంశాలతో పాటు మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది. కమ్యూనిస్టు దేశాలలోని పత్రీకల వార్తలు వాటి నిర్వహణపై మీకు వీలుంటే ఓ ఆర్టికల్ వ్రాయగలరు.

    మీకు అభ్యంతరం లేకుంటే మీ అముద్రిత వ్యాసాన్ని నాకు పంపించగలరు.

    రిప్లయితొలగించండి
  6. ఎమర్జెన్సీ సెన్సారింగ్ & దానికి అనుగుణంగా పత్రికల ప్రవర్తన గురించి ఎవరో (అద్వానీ అనుకుంటా) ఇలా అన్నారు:

    She (Indira) asked them to bend. They chose to crawl.

    రిప్లయితొలగించండి