28, నవంబర్ 2014, శుక్రవారం

రాతి యుగం ఆలోచనలు ఇక మారవా?


(Published by 'SURYA' telugu daily in its Edit Page on 30-11-2014, SUNDAY)

నవంబర్ మాసంలో నాలుగో గురువారం అమెరికాలో చాలా ప్రాముఖ్యత కలిగిన దినం. ఆ రోజును అమెరికాలో 'థాంక్స్ గివింగ్ డే' గా పాటించి ఘనంగా జరుపుకుంటారు. కనిపెంచిన  తలితండ్రులకు  ఆదేశపు పౌరులు కృతజ్ఞతలు తెలుపుతూ తమ స్తోమత కొద్దీ కానుకలు ఇచ్చే రోజు. ఆ పండుగ తరువాతి రోజున వచ్చే   శుక్రవారం అమెరికన్లకు 'బ్లాక్ ఫ్రైడే'.  వారి  జీవితంలో ఈ బ్లాక్ ఫ్రైడే కి చాలా ప్రాముఖ్యత వుంది. బ్లాక్ డే అనగానే అదేదో సంతాప దినం అని అనుకోరాదు. ఆ రోజున అమెరికాలో క్రయ విక్రయాలు  భారీగా జరుగుతాయి.  కొనుగోలుదారులతో  వీధులు చాలా రద్దీగా వుంటాయి. యెంత రద్దీ అంటే ఆరోజున కారు  టైర్ల గుర్తులతో రహదారులు నల్లగా తయారవుతాయిట. అందుకే ఆ దినాన్ని అమెరికన్లు బ్లాక్ ఫ్రైడే అని పిలుచుకుంటారని  ఒక కధ ప్రచారంలో వుంది.
జన జీవితంలో విశేష ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ రెండు ప్రత్యేక దినాలను ఈ ఏడాది జరుపుకోరాదని అనేక ప్రజా సంఘాలు పిలుపు ఇచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే-  అమెరికా దేశంలోని సెంట్ లూయీస్ పొలిమేరల్లోని ఫెర్గ్యూసన్ పట్టణంలో జరిగిన ఓ సంఘటన.  
శరీర వర్ణాన్ని బట్టి రక్తం రంగు మారదు. మనిషి స్తితిగతులనుబట్టి ప్రాణం విలువ పెరగదు, తరగదు.
అయినా ఈ పాడు  ప్రపంచంలో విలువల కొలమానాలు తారుమారవుతూనే వున్నాయి. ఇటీవల అమెరికాలో ఒక న్యాయ స్థానం గ్రాండ్ జ్యూరీ  ఇచ్చిన తీర్పే దీనికి నిలువెత్తు ఉదాహరణ.
ఒక నల్ల జాతి యువకుడ్ని కాల్చి చంపిన  ఘటనలో, అందుకు కారకుడయిన  శ్వేతజాతి  పోలీసు అధికారిపై   నేరారోపణ చేసే అవసరం లేదని మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ కోర్టు గ్రాండ్ జ్యూరీ చేసిన  నిర్ణయం దేశవ్యాప్తంగా వివాదాలకు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు కారణమయింది.



నిరసనలు కొన్ని చోట్ల హింసారూపం దాల్చాయి. అనేక ఇండ్లు తగులబెట్టారు. వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయు తూటాలు పేల్చారు.   ఫెర్గ్యూసన్ గవర్నర్ జే నిక్సన్ తన రాష్ట్రంలో అత్యవసర పరిస్తితి ప్రకటించి శాంతి భద్రతలను అదుపుచేయడం కోసం రెండు వేలమందికి పైగా నేషనల్ గార్డులను రంగంలోకి దించారు.  ప్రెసిడెంట్ ఒబామా సైతం శాంతిని కాపాడడంలో సహకరించాలని  అన్ని వర్గాల ప్రజలకు  విజ్ఞప్తి చేయాల్సివచ్చింది. ప్రెసిడెంట్ తన నివాసం అయిన వైట్ హౌస్ లో కూర్చుని టీవీ, రేడియో ద్వారా ఈ విజ్ఞప్తి చేసారు. ప్రధాన టీవీ ఛానళ్ళు ప్రెసిడెంట్ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే, టీవీ తెరలపై సగం వైపు  ఒబామాను, మరో సగంలో ఫెర్గ్యూసన్ నగరంలో జరుగుతున్న హింసాత్మక  దృశ్యాలను ఏకకాలంలో చూపించడం విశేషం.  ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్టపడలేదు.  అమెరికాలో  జాత్యహంకార మూలాలు ఇంకా మిగిలే వున్నాయని మీడియా గగ్గోలు మొదలయింది. ఒక ఆఫ్రికా అమెరికన్ దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు జరిగే  ఇటువంటి సంఘటనలకు సహజంగానే ప్రాచుర్యం లభిస్తుంది.      
ఈ పరిణామాలకు దారితీసిన కాల్పుల సంఘటన  గత ఆగస్టు తొమ్మిదో తేదీన ఫెర్గ్యూసన్ నగర నడివీధిలో అరిగింది. పద్దెనిమిదేళ్ళ  నల్లజాతి యువకుడు మైఖేల్ బ్రౌన్ ని పోలీసు అధికారి డారెన్ విల్సన్ తన రివాల్వర్ తో ఆరు సార్లు కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు తన మీద దాడి  చేసాడనీ, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపాల్సివచ్చిందనీ అధికారి వివరణ ఇచ్చుకున్నాడు. బ్రౌన్  తనను కారులోకి నెట్టి, తన ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఆ అధికారి పేర్కొన్నట్టు సెంట్ లూయీస్ పోలీసులు చెబుతున్నారు.    అయితే ఆ సంఘటన జరిగినప్పుడు బ్రౌన్ వెంట వున్న అతడి స్నేహితుడు డోరియన్ జాన్సన్ కధనం వేరేగా వుంది. 'ఇద్దరూ కలిసి  జాన్సన్ ఇంటికి నడిచి వెడుతుండగా పోలీసు వాహనం అటుగా వచ్చింది. పోలీసు అధికారి వారిని పక్కకు తొలగి నిలబడమని ఆదేశించాడు. అధికారి కారు నుంచి దిగుతూనే కారు డోరుతో బ్రౌన్ ని బలంగా నెట్టాడు. బ్రౌన్ ని చేతులతో వొడిసి పట్టుకుని రివాల్వర్ తో కాల్చాడు.'  మామూలుగా అయితే ఇది సర్వ సాధారణ సంఘటనే. కాల్చిన పోలీసు అధికారి శ్వేత జాతీయుడు కావడం, విచారణ జరిపిన గ్రాండ్ జ్యూరీ, ఆ అధికారి తప్పేమీ లేదని  తీర్పు చెప్పడం యావత్ వివాదానికి తెర తీసింది.
గతంలో ఇటువంటి సంఘటనలు జరక్కపోలేదు. శ్వేత జాతి పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు కూడా వున్నాయి. అమెరికాలో వర్ణ వివక్షను అరికట్టడానికి అబ్రహాం లింకన్ కాలంలో మొదలయిన సంస్కరణలు, చేసిన చట్టాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా తక్కువేమీ కావు. ఆదేశంలో నల్లజాతివాడని, నీగ్రో అనీ పిలవడం నిషిద్ధం. అయినా వారిలో ఇంకా అభద్రతాభావం గూడుకట్టుకునే  వుంది. ఫెర్గ్యూసన్ సంఘటన  దరిమిలా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలలా వినవస్తున్న నిరసన స్వరాలు అమెరికన్ పాలకుల మనస్తత్వంలో మార్పు తీసుకు రాగలవని విశ్వసించడం మినహా చేయగలిగింది లేదు.
సమస్త సృష్టిలో ఎక్కడా లేని ఈ వర్ణ వివక్ష కేవలం మానవులకే పరిమితం కావడం మరో విషాదం. 

NOTE : Courtesy Image Owner   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి