21, నవంబర్ 2014, శుక్రవారం

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఎలా జరగాలి?

(Published in 'SURYA' Daily in its Edit Page on 23-11-2014, SUNDAY)


రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదని నానుడి.  అభివృద్ధి అనేది ఒక క్రమపధ్ధతి ప్రకారం దశలవారీగా జరగాలంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి సరికొత్త రాజధాని నిర్మించే పనిలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది.  దార్శనికుడయిన రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. దానికి తోడు   కొత్త రాజధాని నిర్మాణం అనేది  ఆయనకు మాత్రమే లభించిన అపూర్వ సువర్ణావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఎందుకో ఏమిటో కారణాలు ఆయనకే తెలియాలి. రాజధాని  ప్రదేశం ఎంపిక  విషయంలోనిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి  ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతిపక్షాలను సంప్రదించకుండాస్వపక్షంలో కూడా కొందరినే విశ్వాసంలోకి తీసుకుంటూ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం జనబాహుళ్యంలో వుంది. రికార్డు స్థాయిలో అపార పరిపాలనానుభవం  కలిగిన చంద్రబాబుకు ఈ వాస్తవం తెలియదని అనుకోలేము. ప్రతి విషయంలో ఎంతో ఆచి తూచి వ్యవహరిస్తారనే పేరున్న వ్యక్తిభవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణం వంటి ప్రాముఖ్యత కలిగిన అంశం పట్ల అనుసరిస్తున్న వైఖరిఆయన కానీఆయన తరపున మంత్రులు కానీ చేస్తున్న ప్రకటనలు మరింత  గందరగోళానికి తెర తీస్తున్నాయి.
వరుణ దేవుడి కరుణాకటాక్షాలపై ఆధారపడాల్సిన అవసరం, అగత్యం ఏమాత్రం లేకుండా  ఏటా మూడు పంటలు నిక్షేపంగా  పండే ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల భూమి సేకరించడం ఏమేరకు సబబు అనే ప్రశ్నకు సరయినసహేతుకమైన సమాధానం దొరకడం లేదు. హైదరాబాదుకు పోటీగా సైబరాబాదును అత్యంత ఆధునికంగా అనతి కాలంలో అభివృద్ధి చేసిన ఘనత తన ఖాతాలో వుందని ఆయన పదేపదే చెబుతుంటారు. అది వాస్తవం కూడా. కానీ అది ఎలా జరిగింది ? అనే ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం  అంత రుచికరంగా ఉండకపోవచ్చు.
రాళ్ళు రప్పలు, కొండలు గుట్టలతో కూడిన ప్రదేశంలో చంద్రబాబు పూనికతోఅయన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎల్ అండ్ టీ సంస్థ తొంభయ్యవ దశకంలో  హై టెక్ సిటీ భవనాన్ని నిర్మించినప్పుడుదాన్ని చూసి  అందరూ ఔరా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. క్రమంగా అక్కడవున్న ప్రభుత్వ భూముల్ని అంతర్జాతీయ కంప్యూటర్ సంస్థలకు ఇవ్వడంతో ఆ ప్రాంతంలో ఆర్ధిక పరమైన కార్యకలాపాలు శరవేగంతో పుంజుకున్నాయి. దానితో ఆ ప్రాంతంలో అభివృద్ధి మరింత చురుగ్గా చోటు చేసుకుంది. విశాలమైన రహదారులుబహుళ జాతి సంస్థలు నిర్మించిన  బహుళ అంతస్తుల సుందర భవనాలు  ఆ ప్రాంతం శోభను ఇనుమడింపచేసాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకోసం నివాసాలు నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. భూముల రేట్లకు రెక్కలు విచ్చుకున్నాయి. 'మీరూ బాగుండాలిమేమూ బాగుండాలిఅనే తరహాలో అందరూ  ఒకరికొకరు సహకరించుకున్నారు. దేశం యావత్తు ఘనంగా చెప్పుకుంటున్న  సైబరాబాదు ఆవిధంగా  ఆవిష్కృతమైంది. ఇందులో చంద్రబాబు పేరు ప్రతి ఇటుక మీదా వుందని అంటే కాదనే వారు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. ఈ ఆధునిక రాజధాని నిర్మాణం కోసం  ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అయ్యాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో జరగబోతున్నది ఏమిటిఇక్కడ జరిగిన దానికిఅక్కడ జరగబోయేదానికీ ఏమైనా పోలిక ఉందా పాలకులే ఆలోచించుకోవాలి. అక్కడ ప్రైవేటు భూములుఅవీ ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇదీ రెండింటి నడుమ ప్రధానమైన తేడా!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ఉభయ రాష్ట్రాల మీడియాలో ఆంద్ర ప్రదేశ్ రాజధాని గురించీఅందుకోసం సేకరించాలని అనుకుంటున్న భూములు గురించీ విస్తృత చర్చ సాగుతోంది. రాజధాని కోసం  ముప్పయ్ వేల ఎకరాల సారవంతమైన భూములు అవసరమా అని ప్రతిపక్షాలు యాగీ చేస్తుంటేపాలక పక్షం అయిన తెలుగు దేశం మాత్రం తను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికల ప్రకారమే ముందుకు సాగుతోంది. రాజధాని నిర్మాణం కోసం భూమిని సాధ్యమైన మేరకు సమీకరణ ద్వారాతప్పనిసరి పరిస్తితుల్లో సేకరణ ద్వారా సంపాదించాలనే కృత నిశ్చయంతో వున్నట్టు కానవస్తోంది. అధికారంలో వున్న పార్టీ కాబట్టి  వ్యతిరేక ప్రచారానికి కారణం ప్రతిపక్షాలే అని సహజంగానే నెపం వారిమీద మోపే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం కూడా తన సహజరీతిలో స్పందిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని మరింత గట్టిగా అందిపుచ్చుకుని ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇది ఒక రాజకీయ క్రీడ. కానీ,   భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రాజధాని నిర్మాణ అంశాన్ని  కేవలం   రాజకీయాలకు పరిమితం చేసి చూడకూడదు.  ప్రతిపక్షాలు సరేరాజకీయం చేస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో, కనీసం వారిలో కొంతమందిలో అయినా  కానవస్తున్న వ్యతిరేకతను తక్కువగా అంచనా  వేయడం కానీవారి గోడును ఆలకించకపోవడం కానీ ప్రజాహితాన్ని కోరుకునే పాలకులు చేయాల్సిన పనికాదు.
ముందు సైబరాబాదు ఉదాహరణ ఉదహరించింది ఇందుకోసమే. అక్కడ ప్రభుత్వం  చొరవ చూపగానే ఆర్ధిక పరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొత్త నగర నిర్మాణం దానంతట అదే జరిగిపోయింది. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ  భూముల బదలాయింపులో సర్కారు కొంత చెడ్డ పేరు మోయాల్సివచ్చిన సందర్భాలు ఎదురయినా మొత్తం మీద  మంచి పేరు మొత్తం  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కింది. సమర్ధుడని ఆనాడు సముపార్జించుకున్న ఆ 'గుడ్ విల్ ' కారణంగానే  కొత్త రాజధాని నిర్మాణంలో ఆయన తప్పటడుగులు వేయరు అని చాలామంది నమ్మకం పెంచుకోవడానికి దోహదం చేసింది. వారే ఇప్పుడు జరుగుతున్న తతంగాలు చూసి నొచ్చుకుంటున్నారు. ఏమిటి ఇలా జరుగుతోందని బాధ పడుతున్నారు.
సమీకరణోసేకరణో మొత్తం మీద అనుకున్నమేరకు కాకపోయినా అత్యధిక విస్తీర్ణంలోనే  భూములు సర్కారుకు దఖలు పడడం ఖాయం. తరువాత ఏమిటికేంద్ర  సాయం గురించి ఎలాటి ఊసు వినరావడం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి చూస్తె 'లోటులో కొట్టుమిట్టాడుతోంది. మరి ప్రపంచం మెచ్చే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం సాగేదేలా?ఈ ప్రశ్నకు సర్కారు నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్లనే రాజధాని పేరుతొ  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతోందనే నిందను ప్రభుత్వం మోయాల్సివస్తోంది. ఒకరంటున్నారని కాదు. ఒకరికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ అంతరాత్మకు అయినా సంజాయిషీ ఇవ్వకతప్పదు కదా! 
అందుకే ఇప్పుడయినా మించి పోయింది లేదు. ఇలాటి సమయంలో వొత్తిళ్ళు వుండడం సహజం. వాటిని ఎదుర్కోగలిగితేనే నాయకత్వ లక్షణాలు గుభాలిస్తాయి. ఘనమయిన ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన బెట్టి, సాధ్యాసాధ్యాలను మరోమారు పరిశీలించిప్రజలనుంచి అసమ్మతి  వీలయినంత తక్కువగా ఉండేలా చూసుకుంటూ మొత్తం వ్యవహారాన్ని పునః సమీక్ష చేసుకోవడం మంచిది. తీరిగ్గా విచారించడం కంటే సత్వరంగా మేలుకోవడం మేలు కదా! పై పంచ ముళ్ళ కంచెకు  చిక్కున్నప్పుడు దాన్ని సుతారంగా తిరిగి తీసుకోగలగాలి. అది చాతుర్యం అనిపించుకుంటుంది. 


పొతే, ఇలాటి సందర్భాలలలో అనుసరించాల్సిన కొన్ని విధి విధానాలు వుంటాయి. అది ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు.
ఎవరయినా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఏం చేస్తారు. ముందు అందుకు తగిన సొమ్ములు సమకూర్చుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టాలో నిర్ణయించుకుంటారు. యెంత వసతిగా వుంటే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇల్లంటే ఒకనాటి  వ్యవహారం కాదుపదేపదే కట్టుకునేది కాదు. కనుక ఓ పదేళ్ళ తరువాత అవసరాలకు తగ్గట్టుగా ప్లాను వేసుకుంటారు. వృద్దులయిన తలితండ్రులు వుంటే వారి అవసరాలకు తగిన విధంగా అంటే వారి స్నానపు గదుల్లో కాలు జారడానికి వీలుండని గరుకు బండలువాళ్లకు వసతిగా  తక్కువ మెట్లు ఉండేలా చూసుకోవడం ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే ఒక వూరిలో ఒక కాలనీ  నిర్మాణం బాధ్యత మీద పడిందని అనుకోండి. జనాభా యెంతవారి అవసరాలు ఎలా వుంటాయివీధి లైట్లు తగినన్ని ఉన్నాయా ? పారిశుధ్యం విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలిడ్రైనేజీ సదుపాయం ఎలా వుండాలిఅసాంఘిక శక్తులు తలెత్తకుండా రాత్రి వేళల్లో గస్తీ,  కాలనీ వాసులకోసం చక్కని పార్కు ఇలాటి అంశాలన్నీ ముందు గమనంలో పెట్టుకుని ప్రణాళికలు వేసుకుంటారు.
ఒక నగరం కొత్తగా నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఇలాటి విషయాలు అన్నింటినీ మరింత విస్తృత రూపంలో ఆలోచించుకోవాల్సి వుంటుంది. పధక రచన చేసుకోవాల్సి వుంటుంది.
ఈ విషయంలో గతం నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో వుంటుంది. మొహెంజొదారోహరప్పా చారిత్రిక శిధిల సంపదను పరిశీలించేవారికి అలనాటి పాలకులు నగర నిర్మాణాలలో ఎంతటి ముందు చూపు ప్రదర్శించారన్నది తేలిగ్గానే అవగత మవుతుంది. ఈ చారిత్రిక నగరాలే కాదువందల ఏళ్ళ చరిత్ర కలిగిన  ఏ నగర చరిత్రను తిరగేసినా ఇలాటి ఉదాహరణలే కానవస్తాయి. హైదరాబాదు నగరాన్నే తీసుకుంటే అప్పటి నిజాం నవాబునగర పౌరుల దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేయడానికి యెంత శ్రద్ధ వహించారో తెలుసుకోవడానికి చరిత్ర గ్రంధాలు తిరగేయనక్కరలేదు. అప్పుడు నగర జనాభా కేవలం యాభయ్ వేలే. అయినా  ఎంతో ముందు చూపుతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా  లక్షల జనాభాకి సరిపడేలా నగర డ్రైనేజీ వ్యవస్థను సయితం  రూపొందించిన ఇంజినీర్ మోక్షగుండం  విశ్వేశ్వరయ్య గారు నిజమైన దార్శనికుడు. ఈనాడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ విమర్శలు వినవస్తున్నాయంటే ఈనాటి పాలకులు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న నిజం బోధ పడుతుంది. కేవలం బహుళ అంతస్తుల భవనాలుఅందమైన వీధి దీపాలు మాత్రమే నగర సౌందర్యానికి  కొలమానాలు కావు. ఒక్క వర్షం గట్టిగా కురుస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం అయ్యే రోడ్లు నాగరిక జీవనానికి అద్దం పట్టవు. వర్తమానంలోని అవసరాలను అంచనా వేసుకుంటూభవిష్యత్తులో తలెత్తగల సమస్యలను ముందుగా ఊహించుకుంటూ వాటికి తగ్గట్టుగా ప్రణాలికలను రూపొందించచగలిగిన నాయకులు ద్రష్టలు అవుతారు. దార్శనికులు అనిపించుకుంటారు.
(22-11-2014)

NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి