15, అక్టోబర్ 2014, బుధవారం

ప్రకృతి ప్రకోపాలు - పాలకులు నేర్వాల్సిన పాఠాలు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 16-10-2014, Thursday)

2014 అక్టోబరు 12. 
కాకతాళీయం కావచ్చు కానీ 'అంతర్జాతీయ విపత్తుల అదుపు దినం' - అక్టోబర్ 13 వ తేదీకి ఒక్క రోజు ముందరే  'హుద్ హుద్' తుపాను విశాఖ తీరాన్ని తాకింది.
'హుద్ హుద్' అనేది ఆరబ్ పదం. ఇది ఒక పక్షి పేరు. ముస్లిం ల పవిత్ర గ్రంధం 'ఖుర్ ఆన్' లో కూడా ఈ పక్షి ప్రసక్తి వుంది. అండమాన్ సముద్రజలాల్లో అక్టోబర్ ఆరో తేదీన పొడసూపిన ఈ తుపానుకు, నిండా తొంభయ్ గ్రాముల బరువు తూగని ఈ పక్షి -  'హుద్ హుద్' పేరును, అంతర్జాతీయ నియమావళి ప్రకారం  ఒమన్ దేశం సూచించింది.  అల్పపీడనంగా పురుడుపోసుకున్న ఈ సముద్ర రాకాసి మరునాటికల్లా  తీవ్ర రూపాన్ని ధరించి  రెండు రోజుల వ్యవధిలోనే అత్యంత  తీవ్రమైన పెను  తుపానుగా తయారయింది. అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ  'నాసా' సయితం ఈ తుపాను తీవ్రతను గుర్తించి హెచ్చరికలు  జారీచేయడంతో -  తరువాతి కొద్ది రోజుల్లో ఈ తుపాను  సృష్టించబోయే విలయం ఏ స్థాయిలో వుంటుందో అర్ధం చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యుద్ధ ప్రాతిపదికపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అధునాతన ఉపగ్రహ  పరిజ్ఞానం పుణ్యమా అని వెనుకటి రోజుల్లో మాదిరిగా కాకుండా తుపాను కదలికలను ముందస్తుగా, అదీ అతి ఖచ్చితంగా తెలుసుకోగల  అవకాశం వుండడం వల్ల ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమై తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో   ప్రాణ నష్టాన్ని దాదాపు పూర్తిగా తగ్గించగలిగారని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వ అధికారులు అభినందనీయులు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న వేలాదిమందిని నచ్చచెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం శిబిరాలు ఏర్పాటు చేసారు. బస్సులు, రైళ్ళు ఆఖరికి విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ ఇతర ఆధునిక ప్రసార సాధనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు.  తుపాను తీవ్రతను, కదలికలను జనాలకు తెలియచేసారు. ఈ చర్యలన్నీ ప్రాణ నష్టం నివారణకు బాగా దోహదం చేసాయి. వీటికి మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎప్పటికప్పుడు చర్చించుకుని చర్యలు తీసుకోవడం కూడా చక్కగా ఉపకరించింది. తుపాను  తీరం దాటిన  వెంటనే తీరిక చేసుకుని విశాఖకు వచ్చి క్షేత్ర స్థాయిలో విషయాలను అధ్యయనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంద్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించిన తీరు ఇందుకు నిదర్శనం.
అనుకున్న విధంగానే, అనుకున్న రీతినే, అనుకున్న రోజునే, అనుకున్న ప్రదేశంలోనే పెనుగాలులతో కూడిన  ఈ భయంకర తుపాను తీరాన్ని తాకింది. వర్షం వల్ల కంటే కూడా పెనుగాలులు సృష్టించిన ప్రళయమే ఉత్తరాంధ్రను ఎక్కువ  వణికించింది. ఎన్నో దశాబ్దాలుగా చరిత్రకు సాక్షీభూతాలుగా నిలచిన వందలాది  పెను వృక్షాలు నేలకొరిగాయి. ఇక మానవ నిర్మితమైన కరెంటు స్తంభాలు, మేడలూ మిద్దెలూ లెక్కాజమా లేకుండా నేలమట్టం అయ్యాయి. ప్రాణనష్టం నివారించగలిగామన్న అధికారుల ఆనందం, తుపాను కలిగించిన అపార ఆస్తి నష్టంతో   ఆవిరైపోయింది.
'హుద్ హుద్' తుపానుకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా, విశాఖ నగరం పరిస్తితి తారుమారయింది. ప్రభుత్వానికి అసలయిన పరీక్షాసమయం మొదలయింది. విశాఖవాసులకే కాదు, యావత్ దేశానికీ ఈ తుపాను కంటి మీద కునుకు లేకుండా చేసింది. సమర్ధతతకు మారుపేరుగా పేరు గాంచిన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ, ఆయన ప్రభుత్వానికీ తుపాను తీరం దాటిన తర్వాతి  పరిణామాలు  పెనుసవాలుగా మారాయి. కూలిన చెట్లూ, వాలిన కరెంటు స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లూ, కోతకోసిన సముద్రపు వొడ్లూ,ధ్వంసం అయిన రైలు మార్గాలు,  నేలమట్టమయిన ఇళ్లూ, మేట వేసిన పొలాలు, తెగిపోయిన చెరువులూ, పోటెత్తిన నదులూ, నీట మునిగిన పొలాలు, గాలికి లేచిపోయిన పైకప్పులూ, ఇలా ఆస్తి నష్టం పలు  రూపాలలో ఆవిష్కృతమైంది. నష్టం తొలి అంచనాలు వేయడంలో అధికారులు కాలయాపన చేయలేదు. నివేదికలు తయారయాయి. సుమారు రెండు వేల కోట్ల రూపాయల   సాయం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తలమునకలుగా వున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా హుటాహుటిన విశాఖ పట్నం చేరుకున్నారు. హెలికాప్టర్ లో తిరిగి తుపాను సృష్టించిన భీభత్సాన్ని కళ్ళారా చూసారు. తన పర్యటనను కేవలం 'ఏరియల్ సర్వే' కి మాత్రమె పరిమితం చేసుకోకుండా అధికారులతో మాట్లాడి, తుపాను బాధిత ప్రదేశాల్లో కలయ తిరిగి  వాస్తవ పరిస్తితులను స్వయంగా గమనించి  ఒక అంచనాకు వచ్చారు. తుపాను సహాయక చర్యలకు, పునరుద్ధరణ కార్యక్రమాలకు తక్షణం వెయ్యి కోట్ల కేంద్ర ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనాలకు ఊరట కలిగించే ప్రయత్నం చేసారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎలాటి సమయం వృధా చేయలేదనే చెప్పాలి. విశాఖ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకే కాదు, పాలకులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 'ప్రతి దుర్ఘటన పాలకులకు ఒక పాఠం. ప్రతి అనుభవం భవిష్యత్తులో ఇలాటి సంఘటనలు పునరావృతం అయినప్పుడు గుర్తుంచుకుని వ్యవహరించేలా ఒక శాశ్విత విధానాలను రూపొందించు కోవాలి' అని ప్రధాని హితబోధ చేసారు.
నిజమే కదా! తుపాను కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ప్రాణ నష్టం నివారించడంలో విశేష ప్రతిభ కనబరచిన వారు, తుపాను తీరం దాటిన  తరువాత ఏర్పడబోయే సంక్షోభం నుంచి ప్రజలను వొడ్డున పడేసే ముందస్తు చర్యలపై అంతగా దృష్టిపెట్టినట్టులేదు. తీరం దాటిన  తరువాత కుంభ వృష్టి కురుస్తుందనీ తెలుసు. ప్రచండమయిన వేగంతో పెను గాలులు  వీస్తాయని తెలుసు. పెద్ద పెద్ద వృక్షాలే కూకటి వేళ్ళతో కూలిపోయే ముప్పు  పొంచివుందని ముందుగా తెలిసినప్పుడు కరెంటు స్తంభాలు ఆ ఉధృతానికి ఏపాటి. అవి నేలకొరిగితే,  రోజుల తరబడి విద్యుత్  సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనీ తెలుసు. తుపాను తీరం దాటేది పట్టణ ప్రాంతం అని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వేరేగా వుంటాయి. బియ్యం పప్పు, ఇతర పచారీ సామాను కంటే, వారి అవసరాలు భిన్నంగా వుంటాయి. పాలు, నీళ్ళు కొరత లేకుండా, రాకుండా చూడాల్సిన అవసరం వుంటుంది. కరెంటు లేకపోవడం వల్ల   అపార్ట్ మెంట్లల్లో మోటార్లు పనిచేయవు. నీళ్ళు పైకి ఎక్కవు. రోడ్డు రవాణా  దెబ్బతినడం వల్ల పెట్రోలు, డీసెలు సరఫరాకు ఆటంకం ఎట్లాగు తప్పదు. ఈ విషయాలను అధికారులు గమనంలో వుంచుకున్నట్టు లేదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ఏర్పాట్లు సరిపడా చేసి వుండరు. ఫలితం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. చెవులారా వింటున్నాం.
ఇలాటి పరిమాణంలో ఒక ప్రకృతి విపత్తు వచ్చిపడ్డప్పుడు  ఎలాటి లోటుపాట్లు లేకుండా సహాయ కార్యక్రమాలు అమలు చేయడం అన్నది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అలా జరగాలని ఆశించినా అది అత్యాశే అవుతుంది. కానీ, అలాగని, కొంత ముందు చూపు ప్రదర్శించకపోతే ఎలా వుంటుంది? అన్నదానికి విశాఖపట్నం, తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల దుస్తితే అద్దం పడుతోంది.
వీటినుంచే పాలకులు పాఠం నేర్చుకోవాలి.
మంచి చేసినప్పుడు వెల్లువెత్తిన ప్రశంశలను స్వీకరించినట్టే ఈ రకమైన సద్విమర్శలను కూడా ఔదలదాల్చగల ఔదార్యం వున్న పాలకులు చరిత్రలో మిగిలిపోతారు.(15-10-2014)         

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి