13, సెప్టెంబర్ 2014, శనివారం

నారావారి నూర్రోజుల పాలన

PUBLISHED IN 'SURYA'  TELUGU DAILY IN ITS EDIT PAGE ON 14-09-2014
(నూతన రాష్ట్రం 'ఆంద్ర ప్రదేశ్' ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల పదిహేనవ తేదీన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా) 


గతంలో తొమ్మిదేళ్ళు పై చిలుకు అఖండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిజానికి ఈ వంద రోజుల పాలన ఓ లెక్కలోనిది కాదు. కానీ ఈసారి లెక్క మారింది. ఆయన ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేనాటికి రాష్ట్రం రెండు ముక్కలయింది. ఇరవై మూడు జిల్లాలు కలిగిన  సువిశాల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదమూడు జిల్లాలకు కుంచించుకు పోయింది. ఆయన ఒకనాడు కంటిచూపుతో శాసించిన సచివాలయం పరిస్తితీ అదే. వరసగా అనేక సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా సికింద్రాబాదు పెరేడ్ మైదానంలో  జాతీయ పతాకం ఎగరేసిన పంద్రాగష్టు పండుగను ఈసారి కర్నూలు వెళ్లి జరుపుకోవాల్సివచ్చింది. ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రం రాజధానిలో ఉంటూ, పొరుగునే వున్న మరో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వుండడం అనే విచిత్ర పరిస్తితి కనీవినీ ఎరుగనిది. పాలకులు ఒకచోట, పాలితులు మరోచోట అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఓ కొత్త ముచ్చట.
ఇలాటి వింత పరిరిస్తితి వల్ల పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చెబుతూవస్తూనే వున్నారు.  ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిపి, ఆ తరువాత విడతీయడం వల్ల అనునిత్యం  బయట పడుతున్న కొత్త చిక్కులు ఆయన్ని సతతం చీకాకు పరుస్తున్న మాట కూడా కాదనలేనిది. పైపెచ్చు ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ రెండు రాష్ట్రాల నడుమ సరికొత్త వివాదాలకు కారణం కావడం కూడా మరో కొత్త పరిణామం. పొరుగున వున్న తెలంగాణా ముఖ్యమంత్రి, ఆయన సహచరులు సహకార హస్తాన్ని అందించడం లేదన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో ప్రబలుతోంది. పైగా తమని  చుట్టుముడుతున్న అన్ని చిక్కులకు వారే కారణమన్న భావం కూడా టీడీపీ నాయకుల్లో బలపడుతోంది. దానాదీనా ఉభయుల మధ్య ఒకరకమైన 'అసహన వాతావరణం' నెలకొని, ఇచ్చిపుచ్చుకోళ్ళవంటి సర్దుబాటు ధోరణి కనుమరుగవుతోంది. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు, కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, పాత కొత్త రాష్ట్రాల నడుమ  ఈ విధమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న దాఖలా లేదు.  ఏదో ఒక అంశంపై వాదప్రతివాదాలు చోటుచేకుంటూ వుండడం, అవి ప్రసారమాధ్యమాల్లో చర్చోపచర్చలకు దారితీస్తూవుండడం నిత్యకృత్యమైపోతోంది. సహజంగానే ఇవన్నీ సరి కొత్త రాష్ట్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. అధికారం చేతికిచిక్కి నెలలు గడిచిపోతున్నా సొంత రాజధాని, సొంత సచివాలయం, సొంత పాలనా వ్యవస్థ లేకపోవడం అనేది పరిపాలనపై ప్రభావం చూపుతుంది. సమర్ధుడైన పాలకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో మాదిరిగా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారని, కేవలం పర్యటనలతో, ప్రకటనలతో పొద్దుపుచ్చుతున్నారని ప్రత్యర్ధులు విమర్శించడానికి ఈ నేపధ్యం కొంత కారణం. అయితే, ఇటువంటి విపత్కర పరిస్తితులను నిభాయించుకుని రావడంలో ఆయన అనుభవమే ఆయనకు చక్కగా అక్కరకువస్తోందన్న అభిప్రాయం కూడా వుంది. 'ఏవీ లేకుండా ఆయన మాత్రం ఏం చేస్తాడు' అనే సానుభూతి మాటలు  టీడీపీ కార్యకర్తలనుంచే కాకుండా సామాన్య ప్రజలనుంచి కూడా వినబడుతున్నాయి. రైతుల రుణ మాఫీ హామీ అమలులో జరుగుతున్న  తాత్సారం, లేదా ఆ హామీల విషయంలో వెలువడుతున్న కప్పదాటు ప్రకటనల దరిమిలా కూడా ప్రజలనుంచి నిరసన వ్యక్తం కాకపోగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని  టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.  కాకపొతే ఇదంతా మీడియా మీద ఆయనకు వున్న పట్టువల్ల జరుగుతున్న ప్రచారమే కాని,  ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ప్రత్యర్ధులు కొట్టిపారవేయడం జరుగుతోంది. కాని ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన ప్రతిపక్షం, వై.ఎస్.ఆర్.సీ.పీ.  తొందరపడి చేపట్టిన ఆందోళన కార్యక్రమం పట్ల ప్రజలనుంచి ఆశించిన స్పందన రానిమాట మాత్రం వాస్తవం. ఇదే విషయంపై మరోసారి, కాకపొతే ఈసారి కొన్నాళ్ళు వేచి చూసిన తరువాత తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని అ పార్టీ హెచ్చరికలు చేస్తోంది. రుణ మాఫీ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అని ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి ఆ హామీ అమలు అనుకున్నంత సులభం కాదని నెమ్మది నెమ్మదిగా అర్ధం అవుతోంది. కానీ, తనకున్న అపార పరిపాలనానుభవాన్ని, కేంద్ర ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని తుదికంటా వాడుకుని అయినా సరే రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అడుగులువేస్తున్నట్టు కనబడుతోంది. అసలు ఇటువంటి వాగ్దానాలు చేయడమే రాజకీయం అయినప్పుడు వాటి అమలు తీరు విషయం కూడా రాజకీయం కావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేసేటప్పుడు కొంత సంయమనం పాటించాల్సిన అవసరాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడులకు ఈ విషయంలో  ఎదురయిన  అనుభవం తేటతెల్లం చేస్తోంది.
పొతే,  రాజకీయంగా కుదురుకుని, మరో రెండు తడవలు రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆయన పరిపక్వతని చాటుతున్నాయి. పార్టీని పటిష్టపరచుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆకర్ష్ పధకాన్ని ఆయన కట్టుదిట్టంగా అమలుచేస్తున్నాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దిగ్గనాధీరులను టీడీపీలోకి తీసుకోవడం ఎంతగానో లాభించిన విషయం ఆయన మరచిపోలేదు. అందుకే, ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే సువర్ణావకాశాన్ని ప్రజలు ఎన్నికల్లో కట్టబెట్టిన తరువాత కూడా ఆయన చేతులు  ముడుచుకుని కూర్చోలేదు. ఇలాటి విషయాల్లో  నైతికత అంటూ మడికట్టుకుని  కూర్చోలేదు. జిల్లాపరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు తన రాజకీయ విశ్వరూపాన్ని పూర్తిగా ప్రదర్శించారు. టీడీపీ చేతిలో ప్రభుత్వ పగ్గాలను  2029 వరకు ఉంచుకోవడం లక్ష్యంగా ఆయన చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతోంది. సరే ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా ఇలాటి సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకోవడం తప్పేమీ లేదు. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి సయితం కొన్ని దశాబ్దాలపాటు తాము ఏర్పరచబోయే ప్రభుత్వానికి ధోకా ఉండదని పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తు గురించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించడానికి ఈ రకమైన ప్రకటనల అవసరం వారికి వుంటుంది. దాన్ని అలావుంచి, వర్తమానంలో ప్రజలకు ఏమిచేస్తున్నాము అనేది కూడా ప్రధానమైనదే. గతం నుంచి నేరుగా భవిష్యత్తులోకి అడుగువేయాలని   ఆలోచిస్తూ వర్తమానాన్ని మరచిపోవడం విజ్ఞుల లక్షణం అనిపించుకోదు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముందు సవాలక్ష సమస్యలు వున్నాయి. అన్నింటికంటే ముందు రాజధాని నిర్మాణం లేదా ఏర్పాటు. అత్యంత క్లిష్టం అనుకున్న ఈ నిర్ణయం విషయంలో చంద్రబాబు చురుకుగా, వ్యూహాత్మకంగా పావులు కదిపి సమస్యను చాలా సులువుగా తేల్చేసారు. ఇలాటి అతిముఖ్యమైన నిర్ణయంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా,  ప్రజాస్వామ్య స్పూర్తితో వ్యవహరించిందన్న మంచి పేరు ప్రభుత్వానికి  వస్తుందన్న సూచనలను కూడా ఆయన ఖాతరు చేయలేదు. విజయవాడ పరిసర ప్రాంతాలలో కొత్త రాజధాని ప్రతిపాదనకు  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించుకుని కొన్ని నెలలుగా ఈ అంశంపై నెలకొనివున్న అసందిగ్ధతకు, ముసురుకుంటున్న ఊహాగానాలకు ఒక్కమారుగా తెర దించారు.  బహుశా వంద రోజుల పాలనలో చంద్రబాబు సాధించిన ఘన విజయం ఇదేనేమో!  ఇంకా అనేకం చేసినా, చెప్పినా, ప్రకటించినా, ప్రచారం చేసినా   అవన్నీ చాలావరకు కాగితాలకే పరిమితం. కార్యాచరణకు దూరంగానే వున్నాయి.
అన్ని అవరోధాలను అధిగమించి, ఆయన కలగంటున్న'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరు'  ఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం' (13-09-2014)
NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి