"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం
ఆరుద్ర రచించిన గీతం - 'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే
రీతిలో సాగిపోయే పాట మళ్ళీ ఈనాడు స్పురణకు
వస్తోంది.
దీనికి నేపధ్యం అంతరిక్ష పరిశోధనారంగంలో
భారత్ తాజాగా సాధించిన అపూర్వ విజయం.
2014 సెప్టెంబర్ 24. ఉదయం ఏడుగంటలు. బెంగుళూరులో
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ 'ఇస్రో' కు చెందిన మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ భవనం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా అంతా ఎంతో
ఆసక్తిగా, అంతకుమించి ఆదుర్దాగా ఎదురు చూస్తున్న సమయం.
'అనుకున్నది
అనుకున్నట్టు జరిగితే బాగుంటుంది' అందరి మదిలో మెదులుతున్న ఆకాంక్ష.
'అలా జరుగుతుందా?'
ఎక్కడో ఓ మూల కదలాడుతున్న సందేహం.
సరిగ్గా ఏడుగంటల
యాభయ్ తొమ్మిది నిమిషాలకు వీటన్నిటికీ తెర
పడింది. అంగారక గ్రహం పరిశోధనల నిమిత్తం
ఇస్రో పది మాసాల క్రితం ప్రయోగించిన
ఉపగ్రహం - మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్), కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసి,
అత్యంత క్లిష్టమైన సమస్యలను అధిగమించి, ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశానికి సాధ్యం కాని
రీతిలో మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి
ప్రవేశించచడంతో అక్కడ ఉన్నవారందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇస్రో డైరెక్టర్ రాధాకృష్ణన్
ని, ప్రధాని ఆలింగనం చేసుకుని మనసారా అభినందించారు. 'ఇస్రో సాధించిన ఈ విజయం
అసామాన్యమైనది. ఈ రంగంలో మన దేశం సత్తాను, శక్తి
సామర్ధ్యాలను ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పింది' అని ప్రధాని ప్రసంశల జల్లు
కురిపించారు. అమెరికాకు కూడా తొలి ప్రయత్నంలో అలవికాని ఈ బృహత్తర కార్యాన్ని సాధించి - ప్రధాని హోదాలో
తొలిసారి అమెరికా గడ్డపై అడుగిడుతున్న మోడీకి, ఒకరోజు ముందుగా
ఇస్రో అందించిన కానుకగా ఆయన భావించారేమో తెలియదు. కాని ప్రధాని ఈ విజయం పట్ల ఎంతగానో
పులకరించిపోయినట్టుగా ఆయన మాటలే తెలియచేస్తున్నాయి. 'అసాధ్యాన్ని సుసాధ్యం
చేయగలిగారు మన శాస్త్రవేత్తలు. వారందరికీ వందనాలు' అంటూ ధన్యవాదాలు తెలిపారు.
'ఈరోజు దేశంలోని ప్రతి పాఠశాలలో విద్యార్ధులను సమావేశ పరచి మన దేశం సాధించిన ఈ ఘన
విజయాన్ని వారి చప్పట్ల నడుమ ప్రకటించాలి' అని అన్నారంటే ఇస్రో సాధించిన విజయం
పట్ల ఆయన ఎంతగా పులకితులయిందీ అర్ధం చేసుకోవచ్చు.
ఈ విజయానికి ఇంతటి
ప్రాముఖ్యత రావడానికి కారణం లేకపోలేదు. రోదసీ పరిశోధనల్లో దూసుకు పోతున్న ఏ దేశం
కూడా మొదటి ప్రయత్నంలో అంగారకుడి కక్ష్యలో
ప్రవేశించలేదు. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ సయితం అనేక
విఫలయత్నాల తరువాతనే అరుణ గ్రహం కక్ష్యలోకి తమ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టగలిగాయి.
ఇక, చైనా, జపాన్ లకు ఇంతవరకు ఇది సాధ్యపడనే లేదు. తీరని కలగానే
మిగిలిపోయింది.
ఈ అనంత కాల
విశ్వంలో సెకనుకు కొన్ని వేల మైళ్ళ వేగంతో ముందుకు దూసుకుపోయే ఉపగ్రహాన్ని, కొన్ని
మాసాల అనంతరం, నిర్దేశించిన మార్గంలో దారి మళ్లించడమే గగనం. అంతేటే కాదు, ఈ
సుదీర్ఘ ప్రయాణం ముగియవచ్చే సమయంలో ఒక విషమ పరీక్షను తట్టుకోవాల్సి వుంటుంది.
చైనా, జపాన్ దేశాలు ఈ తుది పరీక్షలోనే నెగ్గలేక బొక్కబోర్లా పడ్డాయి. దాదాపు అరవై
కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం సాగాక, ఇంకా అక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్న
అంగారకుని కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడానికి దాని వేగాన్ని అత్యంత తక్కువ
స్థాయికి తగ్గించాల్సివుంటుంది. ఇందుకోసం 'మామ్' లో పదిమాసాలుగా నిద్రాణంగా
భద్రపరచిన ఇంధనాన్ని తగుస్థాయిలో మండించాల్సిన ప్రక్రియ బహు సంక్లిష్టమైనది. ఇందు నిమిత్తం ఒక రోజు ముందుగానే ప్రయోగాత్మకంగా ఆ ఇంధనాన్ని కొన్ని సెకన్ల పాటు మండించి చూసిన ఇస్రో శాస్త్రవేత్తలు సెమీ ఫైనల్స్ దాటగలిగారు. అయితే అసలు ముహూర్తం వేళకు ఆ ఇంధనాన్ని దాదాపు ఇరవై మూడు నిమిషాల కొన్ని
సెకన్ల పాటు అటు ఎక్కువా ఇటు తక్కువా
కాకుండా మండించగలిగితేనే, అంగారకుడి కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశించగలిగే వేగనియంత్రణ
వీలుపడుతుంది. అంటే అప్పటి వరకు సెకనుకు 22.1 కిలో మీటర్ల
(గంటకు అక్షరాలా డెబ్బయ్ తొమ్మిదివేల అయిదువందల అరవై కిలోమీటర్లు) వేగంతో
ప్రయాణిస్తున్న 'మామ్' ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 4.4 కిలోమీటర్లకు తగ్గించగలగాలి. లేని పక్షంలో
మొత్తం వ్యవహారం బూడిదలో పోసిన పన్నీరు
చందమే. బుధవారం ఉదయం ఇస్రో సాదించిన విజయం అదే. దాటిన మైలురాయి అదే. అందుకే అన్ని జయ
జయ ధ్వానాలు. హర్షధ్వానాల జల్లులు,
అభినందనల వెల్లువలు.
భారత్ సాధించిన ఈ
ఘన విజయంలో మరికొన్ని పార్శాలు వున్నాయి. ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో
సాధించింది. పెట్టిన ఖర్చు కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే బహు తక్కువ.
ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పినట్టు, రోదసీ పరిశోధనల నేపధ్యంలో తీసిన హాలీవుడ్ చిత్రం
- 'గ్రావిటీ' నిర్మాణ వ్యయం ఆరు వందల కోట్లు కాగా 'మామ్' ప్రయోగ వ్యయం కేవలం నాలుగు
వందల యాభయ్ కోట్లే. పోతే, అమెరికా ప్రయోగించిన అంగారక పరిశోధన ఉపగ్రహం, 'మావెన్'
పై పెట్టిన ఖర్చులో పదో వంతు కూడా లేదు. భారత్
ప్రయోగించిన 'మామ్' ఉపగ్రహం ప్రయాణించిన కోట్లాది కిలోమీటర్ల దూరాన్ని గమనంలో
వుంచుకుంటే, ప్రతి కిలోమీటరుకు వెచ్చించిన డబ్బు, హైదరాబాదులో మీటరు మీద వచ్చే ఆటో రేటుకంటే
తక్కువ పడుతుందని సోషల్ మీడియాలో కొందరు
లెక్కలు కడుతున్నారు.
పోతే, దేశాలన్నీ ముక్తకంఠంతో
భారత్ సాధించిన విజయానికి జేజేలు పలికాయి. చైనా కూడా ఈ విజయం ఆసియాఖండపు విజయంగా అభివర్ణించింది.
'విజయం సరే.
అభినందనలు సరే. పేద దేశం అయిన భారత దేశానికి అంగారక గ్రహం గురించిన పరిశోధనలుల వల్ల వొనగూడే ప్రయోజనం ఏమిటి?' అని
మెటికలు విరిచేవాళ్ళు లేకపోలేదు.
వారికి సమాధానం
ఒక్కటే.
శాస్త్రీయ పరిశోధనలను
మిగిలిన పరిశోధనల సరసన చేర్చి మదింపు చేయడం సరికాదు. అన్నింటినీ అణాపైసల
లెక్కన చూడకూడదు. మొదటిసారి అమెరికా వ్యోమగామి
ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన ఏడాదే మనదేశంలో ఇస్రో తన కార్యకలాపాలను ఓ
మోస్తరు స్థాయిలో మొదలుపెట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇతర దేశాల ఉపగ్రహాలను
వాణిజ్య ప్రాతిపదికపై రోదసిలో ప్రవేశ పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇదంతా ఎవరిమీదా
ఆధారపడకుండా, కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో సాధించుకున్న ఆస్తి. బుధవారం నాటి విజయంతో
భారత దేశం, ఈ రంగంలో ముందున్న అన్ని అగ్ర
దేశాలను దాటుకుని ఒక అడుగు ముందుకు వెళ్ళగలిగింది. ఇదొక రికార్డు అయితే,
దశాబ్దాల క్రితం, ఇస్రో
జరిపిన మొదటి ప్రయోగం గురించి ప్రజలు
మరునాడు మాత్రమె పత్రికల్లో చదివి
తెలుసుకోగలిగారు. అదే, ఈనాడు 'అంగారక విజయయాత్ర'ను ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో కళ్ళారా వీక్షించగలిగారు. సెల్ ఫోన్ల ద్వారా తమ ఆనందాన్ని
తమవారితో పంచుకోగలిగారు. వీటన్నిటి వెనుకా 'ఇస్రో' పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన
విషయమే.
అందుకే 'ఇస్రో'
సాధించిన ఇలాటి విజయాలను జనం తమ సొంతం చేసుకుంటున్నారు.
ఇస్రో
తలపెట్టిన 'మంగళయాన్' మనదేశానికి మంగళప్రదం
కావాలనీ, భవిష్యత్తులో ప్రపంచం గర్వించే మరికొన్ని విజయాలను మూటగట్టుకోవాలనీ మనసారా కోరుకుందాం. (25-09-2014)
> సెకనుకు కొన్ని వేల మైళ్ళ వేగంతో
రిప్లయితొలగించండికాదండీ. సెకనుకు 22కి.మీ. వేగాన్ని సెకనుకు 4.4కి.మీ. వద్దకు వచ్చేలా తగ్గించారు.
@శ్యామలీయం - నా బ్లాగును మీరు ఎంతో సునిశితంగా పరిశీలించి చదువుతున్నందుకు ధన్యవాదాలు. అయితే నేను రాసింది ఇది:
రిప్లయితొలగించండి".....అంటే అప్పటి వరకు సెకనుకు 22.1 కిలో మీటర్ల (గంటకు అక్షరాలా డెబ్బయ్ తొమ్మిదివేల అయిదువందల అరవై కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తున్న 'మామ్' ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 4.4 కిలోమీటర్లకు తగ్గించగలగాలి. లేని పక్షంలో మొత్తం వ్యవహారం బూడిదలో పోసిన పన్నీరు చందమే......." ఎక్కడా ఈ వాక్యంలో మైళ్ళ ప్రసక్తి లేదు. గమనించగలరు.
Your enthusiasm to appreciate the great fete by the Scientific Community of our Country is very much evident from the size of your post in the blog.
రిప్లయితొలగించండిI want to congratulate you first for writing a biggest post in your blog.
కప్పగంతు వారి భావం feat అనుకుంటాను. fete అని పడింది. ముద్రారాక్షసం అయ్యుంటుంది.
రిప్లయితొలగించండి@SIVARAMAPRASAD KAPPAGANTU - Very many thanks
రిప్లయితొలగించండి