17, సెప్టెంబర్ 2014, బుధవారం

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?


(Published by  SURYA daily in its edit page on 18-09-2014)
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల దరిమిలా వెంటనే వచ్చే ఉపఎన్నికల ఫలితాలు ఆయా పాలకపక్షాల తల  రాతను మార్చలేవు. ప్రతికూల  ఫలితాలు వచ్చినా,  వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం అసలే వుండదు. అంచేత ఉపఎన్నికల ఫలితాలపై చర్చకు ప్రాధాన్యత తక్కువ. సంకీర్ణయుగంలో వీటికి కొంత ప్రాముఖ్యత వుండే వీలుంది  కాని ప్రస్తుత తరుణంలో దానికీ అవకాశం లేదు. ఎందుకంటే,  గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమికీ, ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కేసీయార్ ఆధ్వర్యంలోని టీ.ఆర్.యస్. కు ప్రజలు ఎవరి మీదా ఆధారపడి మనుగడ కొనసాగించే అగత్యంలేని  మెజారిటీతో ఆయా పార్టీలకి అధికార పగ్గాలను అప్పగించారు. అందువల్ల ఉపఎన్నికల ఫలితాలు తారుమారయినా కూడా వాటికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ వుండదు. అయినా కానీ, ఫలితాల్లో ప్రతికూలతను తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు మరిన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేము. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడి ప్రకారం,  'గెలిచి తీరుతాం' అనే నమ్మకం వున్న పాలక పక్షాలు, 'గెలవడం అంత తేలిక కాదు' అనే అనుమానం వున్న ప్రతిపక్ష పార్టీలు కూడా  ఉప  ఎన్నికలను  సయితం ఒక సవాలుగా తీసుకుని ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెడతాయి. తమకున్న శక్తియుక్తులనన్నింటినీ పణంగా పెట్టి పోరాడతాయి. గెలిచిన పక్షంలో  తమ పాలనకు మెచ్చి ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించుకుంటూ పాలక పక్షం జబ్బలు చరుచుకుంటుంది. అదే ప్రతిపక్షానికి ఆ అవకాశం దక్కితే, పాలకపక్షం పట్ల ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం ఒక సంకేతం అంటూ  బొబ్బలు పెడుతుంది. ఇది ఎన్నాళ్ళనుంచో సాగుతూ వస్తున్న జనమెరిగిన రాజకీయమే.
ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుని ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 54 అసెంబ్లీ, మూడు  లోక సభ స్థానాల్లో ఉపఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటే తేటతెల్లం అయ్యేది ఒక్కటే. అదేమిటంటే రాజకీయపార్టీల పట్ల ప్రజల ఆదరణ ఎప్పుడూ  ఒకే తీరున ఉండదనీ, ఆ ఆదరణలో హెచ్చుతగ్గులు అతిసహజమనీ.



నాలుగునెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం నాలుగుచెరగులా మారుమోగి, ప్రజలను అనూహ్యంగా ఆకట్టుకున్న 'నమో' మంత్రం ఈ ఉపఎన్నికల్లో పనిచేయలేదు. అప్పుడు ప్రభంజనం మాదిరిగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లోక సభ సీట్లను కొల్లగొట్టిన బీజేపీ, తాజాగా ఆ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చతికిలపడిపోయింది.  యూపీలో గత అసెంబ్లీ  ఎన్నికల్లో గెలుచుకున్న పది సీట్లలో బీజేపీ ఏకంగా ఏడింటిలో వోటమి చవిచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాష్ట్రంలో ఆ పార్టీ ఎనభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా డెబ్బయ్ ఒకటి  గెలుచుకుని 'మోడీ హవా' అంటే ఏమిటో యావత్ దేశానికి రుజువుచేసి నెలలు తిరక్క ముందే ఈ మాదిరి పరాజయం మూటగట్టుకోవడం అన్నది నిజంగా బీజీపీ నాయకులకు మింగుడు పడని ఫలితమే. అలాగే మరో దారుణమైన వోటమి రాజస్థాన్ లో ఎదురయింది. ఆ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పాతిక లోకసభ స్థానాల్లో ఏ ఒక్కటీ బీరుపోకుండా అన్నింటినీ తన ఖాతాలో వేసుకుని విజయకేతనం ఎగరేసిన బీజేపీకి ఈసారి అక్కడ జరిగిన నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒకే స్థానం దక్కింది. కిందటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు దక్కాయి.   ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్రంలో పనిచేస్తున్న ఎండీయే సర్కారు పట్ల వోటర్ల వైఖరి ఈ కొద్దికాలంలోనే ఇంతగా మారిపోవడానికి ఆయన చేసిన ఘోర తప్పిదాలు ఏమీ లేవు. ఎన్నికలకు ముందు మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవీ లేవు, ఈ స్వల్పకాలంలో అవేవీ అమలుచేయలేదని కినుక వహించడానికి. అయినా ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు అందరి మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నే! దానికి మోడీయే స్వయంగా వివరణ ఇచ్చారు. మొదట్లో చెప్పుకున్న విధంగానే ఆ వివరణ సాగింది. కొత్త పద్ధతిలో తాను పరిపాలన  సాగిస్తున్నాననీ, ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు తన పని తీరు అర్ధం కావడానికి కొంత  సమయం పడుతుందనీ  ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సరే! వాళ్ళు ఎట్లాగో విమర్శలు చేయక మానరు. ఈ ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు మోడీ సర్కారుకు వచ్చే ముప్పు  ఏవీలేని మాట కూడా నిజమే.  కానీ ప్రజలనుంచి  సయితం  ఇలాటి ప్రశ్నలు మొదలుకాకుండా చూసుకోవాలి. మోడీ విశ్వసిస్తున్నట్టు ప్రజలు మార్పు కోరుకుంటారు. అలా కోరుకునేవారు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పట్టం కట్టారు. మళ్ళీ వాళ్ళు మరోసారి మార్పుకోరుకోకుండా చూసుకోవడానికి ఈ ఉపఎన్నికల ఫలితాలను    ఒక హెచ్చరికగా పరిగణించాలి. లేని పక్షంలో ప్రజల ఆదరణ, ఆగ్రహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు ప్రజలు కోరుకుని ప్రభుత్వ పగ్గాలు అప్పగించిన అన్ని రాజకీయ పార్టీలకీ వర్తిస్తుంది. (17-09-2014)                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి