ఈ
రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదమూడేళ్ళు గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను
వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట
భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి
అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.
ఈ దాడి
జరిగి నిన్నటికి పదమూడేళ్ళు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు
మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య
అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా
ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం
అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో
ఇదొకటి.
తన
అధికారానికీ, తన
పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో
తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం
పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి తననే కబళించడానికి వచ్చిన తరువాత
కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి
సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను,
వెంటాడి, వేటాడి
మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో
అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా కొనసాగుతోంది. సిరియా
కేంద్రంగా పనిచేస్తున్న 'ఇసిస్' ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం అంటూ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు దీనికి
అద్దం పడుతున్నాయి. 'అమెరికాకు హాని తలపెట్టేవాడి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత
ప్రాంతం వుండదు. ఇదే నా పాలన మూలసూత్రం' అని హెచ్చరిక చేయడం ఈ విషయంలో ఆయన యెంత
పట్టుదలతో ఉన్నారో అన్న సంగతి తెలియచేస్తుంది. సెప్టెంబర్ పదకొండో తేదీనే ఒబామా ఈ
ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు చెందినా ఇద్దరు జర్నలిష్టులను
ఇస్లాం ఉగ్రవాదులు తలనరికి దారుణంగా చంపివేసిన సంఘటన నేపధ్యంలో ఈ ప్రకటన
వెలువడింది. అయితే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే ప్రయత్నంలో అమెరికా, అమెరికాను ఉగ్రవాద
చర్యలతోనే నిలువరించే దిశగా 'ఇసిస్' , వీటిమధ్య జరిగే పోరులో ఇతర ప్రపంచదేశాలకు
నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.
సెప్టెంబర్
11 దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక
వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.
2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్
విమానాన్ని నడుపుతూ, మన్ హటన్
లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితోనే డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది
పేరే మహమ్మద్ అత్తా.
అత్తా
పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత
కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్
లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.
అత్తా
చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన
పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.
కెయిరో
విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో
అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే
మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల
ప్రభావితుడై, వారి
ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు.
చివరకి, ఒసామా
బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన
జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.
అత్తా
మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.
1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా
ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో
ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన
పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు
మరకలు’ అంటిన
ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్
క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్
స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు.
దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్
అత్తా కూడా వారిలో ఒకడు.
చూసే
కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా
దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.
2001 లో దశాబ్దం
క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు
నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో
పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ
కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు
విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు
బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది.
ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి
వస్తోంది.
హైదరాబాదులో, ముంబైలో, ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో
పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.
ఈ హింస
ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు.
రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు
పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు
తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో
రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.
ఏంటో ఈ జర్నలిస్ట్ లు , విశ్లేషకులు !!!
రిప్లయితొలగించండిఒకరేమో అమెరికానే చేయించింది అంటారు , మరొకరు లాడెన్ చేసాడు అంటారు .
అత్యంత క్రమ శిక్షణ కలిగిన ఆ మతం ఇలాంటివి చేయదు అని ఒకలు గొంతు చించుకుంటారు, పోస్ట్ లు మీద పోస్ట్ లు వేస్తుంటారు .
ఇసిస్ వాళ్ళు అమ్మాయిలు ని అమ్మేస్తున్నారు అంటే, అది అమెరిక పాచిక
సున్ని షియా లు కొట్టుకుంటున్నారు అంటే అది అమెరిక పాచిక
ఆఫ్గనిస్తాన్ లో హింస ఎక్కువైంది అంటే అది అమెరిక పాచిక
బ్రిటన్ లో డబ్బు ఎక్కువై ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు అంటే అది అమెరికా పాచిక ,
జర్నలిస్ట్ లని చంపేశారు అంటే అది అమెరికా పాచిక
అమెరికా పాచిక లన్ని కేవలం ఇస్లామిక్ దేశాలలోనే పారతాయేమో !!!
:venkat
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి@Venkat - పేరూ ఊరూ లేకుండా పెట్టే కామెంటు అనుకున్నా. పరవాలేదు, కింద పేరు వుంది.
రిప్లయితొలగించండి