31, ఆగస్టు 2014, ఆదివారం

డెబ్భయ్ ఏళ్ళుగా రాస్తున్న కలం


ఆయన రచనా దాహం తీరనిది. అందుకే డెబ్భయ్ ఏళ్ళనుంచి రాస్తూ నిన్నటికి నిన్న తొంభయ్యవ పడిలో ప్రవేశించిన జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో తనకోసం ఏర్పాటయిన ఆత్మీయ సత్కార సమావేశానికి వచ్చేముందు కూడా వీక్షణం పత్రిక్కి వ్యాసం రాసేవచ్చారు. ఇన్నేళ్ళుగా ఆయన్ని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చిన వారి శ్రీమతి సరళ గారు, కుమారుడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ బాబు, కోడలు మాధురి, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు వరదాచారి గారు, చాలా నిరాడంబరంగా, సంసార పక్షంగా సాగిపోయిన ఈ  ఈ చిరు కార్యక్రమంలో పాల్గొన్నారు.



జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు అనేకమంది ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ తొంభయ్యవ ఏట ప్రవేశించిన హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి.
ఈ చిన్ని సమావేశంలో చాలాకాలం గుర్తుంచుకోవాల్సిన అనేక గొప్ప విషయాలను వక్తలు ప్రస్తావించారు. పాత సంగతులు నెమరు వేసుకున్నారు. హనుమంతరావు గారితో తమ పరిచయం గురించి సింహావలోకనం చేసుకున్నారు. ఆయన గురించి బాగా తెలిసిన వారికి కూడా ఆయన్ని గురించి తెలియని విషయాలు బాగా తెలిసివచ్చేలా ప్రసంగాలు సాగాయి.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకే. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా నిన్న జరిగిన సత్కారంలో  న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగం వాటా నిస్సంశయంగా హనుమంతరావు గారి అర్ధాంగి సరళ గారిదే.  

           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి