26, ఆగస్టు 2014, మంగళవారం

ఐస్ బకెట్ సవాల్


ఓ  అరవై  ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో  అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. దానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము,  వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు  అన్నం వొండిపెట్టేవారు. అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునేవాళ్ళు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,  చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు.
ఈనాడు బహుళప్రచారంలో వున్న 'ఐస్ బకెట్ ఛాలంజ్' గురించి చదువుతున్నప్పుడు జ్ఞాపకాల పొరల్లో దాగుండిపోయిన అన్నదాన సమాజం గుర్తుకువచ్చింది.   
సోషల్ మీడియా సైట్స్ తెరిచి చూస్తె చాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తాయి ఐస్ బకెట్ ఛాలంజ్  వీడియోలు. వాటి తాలూకు  ఫోటోలు, బకెట్ల కొద్దీ ఐస్ నీళ్ళను నెత్తిన దిమ్మరించుకుంటూ, 'చూశారా నేనెంత సాహసం చేశానో, మీరూ చెయ్యండి చూద్దాం' అనే  సవాళ్లు విసురుతూ
బకెట్లకొద్దీ ఎన్ని నీళ్ళు వృధా  అయ్యాయో తెలియదు కానీ, ఈ బకెట్ల సవాళ్ళ ఉద్యమం మొదలైన నెల రోజుల్లోనే అక్షరాలా పదహారు మిలియన్  డాలర్లు  ఏ.ఎల్.యస్. అసోసియేషన్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నందుకు, ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు   ఇదే  అసోసియేషన్ కు నిరుడు ఇదే కాలంలో వచ్చిన విరాళాలు పద్దెనిమిది లక్షల డాలర్లు మాత్రమే. కానీ ఈసారి సోషల్ మీడియా పుణ్యమా అని విరాళాల  మొత్తం ఒక్కసారిగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. 'అమ్యోట్రాపిక్ లేటరల్ స్క్లెరోసిస్' అనబడే ఒక నోరు తిరగని వ్యాధిపై ఈ అసోసియేషన్  ఏళ్ళతరబడి పరిశోధనలు చేస్తూ వస్తోంది. అది మరీ నోరుతిరగడం లేదని మరొకరు దీనికి లౌ గెహ్రిగ్స్ జబ్బు అంటూ మరో నోరుతిరగని పేరు పెట్టి ప్రచారంలో పెట్టారు. నరాలకు సంబంధించిన ఒకరకమైన జబ్బు ఇది. నరాలు కుంచించుకుపోవడం, మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు. అమెరికాలో ఏటా అయిదారువేలమంది దీని బారిన పడుతున్నారని, వ్యాధి సోకినవారిలో లక్షమందిలో ఇద్దరు మృత్యువాత పడుతున్నారనీ గణాంకాలు తెలియచేస్తున్నాయి. బకెట్ ఐస్ నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుంటూ, దాన్ని వీడియోలు తీయించుకుంటూ, మళ్ళీ వాటిని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తూ, 'మీరూ ఇలా చేయగలరా' అని తమ సన్నిహితులకు సవాళ్లు విసురుతూ వందలకొద్దీ డాలర్లు ఆ ఏ.ఎల్.యస్. అసోసియేషన్ కు విరాళాలు పంపుతున్న వారికి అసలు ఏ.ఎల్.యస్. అసోసియేషన్ అంటే ఏమిటో తెలుసా అంటే అనుమానమే. ఇందులో పాల్గొంటున్నవాళ్ళు  ఆ అసోసియేషన్ కు ఇచ్చే విరాళం కంటే కూడా ఎక్కువ మొత్తాలను  ఐస్ కొనడానికి  ఖర్చుచేస్తున్నారని విమర్శించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే, ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఐస్ వాటర్ బకెట్లకొద్దీ నెత్తిన దిమ్మరించుకుంటున్న వాళ్ళలో అనేకమంది ఆ సంస్థకు విరాళాలు పంపుతున్నారో లేదో తెలియదు కాని. ఐస్ వాటర్ బకెట్ దృశ్యాలను వీడియోల్లో  చిత్రీకరించి, సోషల్ మీడియాలో ప్రదర్శించడం ద్వారా మంచి ప్రచారం మాత్రం కల్పిస్తున్నారనేది కాదనలేని సత్యం. అందుకే ఈ ఉద్యమం ''భయంకరమైన అంటువ్యాధి' మాదిరిగా అతి తక్కువకాలంలో దేశదేశాలకు పాకిపోయింది. పైగా మైక్రో సాఫ్ట్ వంటి కంప్యూటర్ దిగ్గజాల సీ.ఈ.ఓ. లు స్వయంగా ఈ ఐస్ వాటర్ బకెట్ ఛాలంజ్ వీడియోల్లో స్వయంగా దర్శనం ఇవ్వడంతో దీనికి విశ్వవ్యాప్త ప్రచారం ఇట్టే లభించింది. ఇక మనదేశంలో సరేసరి. అమెరికాలో ఎవరయినా విజిల్ చేతిలో పట్టుకుంటే మనదగ్గర ఈలలు వేసే సంస్కృతి. ఇక చెప్పాలా. ఐస్ వాటర్ బకెట్లకు ఎక్కడలేని ప్రచారం. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని సెలెబ్రిటీ అనిపించుకోవాలని చూసేవారే.  
     
సరే బాగానే వుంది. ప్రచారం బాగానే వుంది. కానీ ప్రచారం ఒక్కటే ఏ ఉద్యమానికయినా ఊతం ఇస్తుందా. ఈ ప్రశ్నకు సమాధానం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ 'యునిసెఫ్' ఒక ప్రకటన రూపంలో కనబడింది.
'ఫేస్ బుక్ లో మాకు లైక్ కొట్టండి. కానీ ఆ లైక్ లతో  మేము ఒక్కరంటే ఒక్కబిడ్డకు కూడా పోలియో చుక్కలు వెయ్యలేము'  (అంటే ఏమిటన్నమాట. ప్రచారంతో పనులు జరగవని)
ఏ.ఎల్.యస్. సంస్థ పేరుతొ సాగిపోతున్న ఈ ఆన్ లైన్ ప్రచారంపై కెనడాలో కొంత పరిశోధన జరిగింది. 'ఆన్ లైన్ లో ఏదో చేస్తున్నారు అని ఒక వ్యక్తికీ కానీ, సంస్థకు కానీ బహుళ ప్రచారం జరిగిందంటే, ఇక వాస్తవ జీవితంలో వాళ్ళు సాధించేది ఆ స్థాయిలో వుండదు'అన్నది ఆ పరిశోధన సారాంశం.
సోషల్ సైట్లను సందర్శించేవారికి అనునిత్యం ప్రజా సమస్యలపై  అనేక రకాల పిటీషన్లు , విరాళాలకోసం విజ్ఞప్తులు కోకొల్లలుగా కానవస్తుంటాయి. చాలామందికాకపోయినా కొందరయినా వాటికి స్పందించి చేతనయిన సాయం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఆ రకమైన ఆన్ లైన్ పిటీషన్ లపై స్పందించనివారు, సంతకాలు చేయనివారు కూడా తమకు ఏమాత్రం సంబంధం లేని ప్రజాహిత కార్యక్రమాలకు అంతకంటే ఎక్కువగా విరాళాలు పెద్ద ప్రచారం లేకుండా ఇస్తుంటారని మరో అధ్యయనంలో తేలింది.
ఇప్పుడు ఉధృతంగా సాగిపోతున్న ఐస్ బకెట్ ఛాలంజ్ విషయానికి వస్తే, ఇది ఎన్నాళ్ళు నిలవగలదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మనిషి సంఘజీవి (సోషల్ యానిమల్) అంటారు. ఈనాటి మనుషుల్లో కొందర్ని 'సోషల్ మీడియా యానిమల్స్' అనొచ్చు అనేది శాస్త్రవేత్తల అబిప్రాయంగా వుంది.
'కొన్ని అంశాలు  సోషల్ మీడియాలో సంచరించే ప్రజల  దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిపై స్పందించి దాన్ని వెంటవెంటనే ఇతరులకు క్షణాలమీద చేరవేస్తారు. కాని ఇటువంటివారు తాము ఇచ్చిన  విరాళాలు ఎలా ఖర్చు అవుతున్నాయో అనే దానిపై దృష్టి పెడతారు. వారికి ఆ విధానాలు నచ్చకపోతే మరోసారి అటువంటివాటి జోలికి వెళ్ళరు' అంటున్నారు వారు.

ఐస్ బకెట్ వాటర్ ఛాలంజ్ పట్ల  భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా  ప్రాచుర్యం పొందిన అంశం మరోటి లేదు అనే విషయంలో మాత్రం అందరు ఏకీభవిస్తున్నారు.   

NOTE: Photo Courtesy Image Owner  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి