(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్
కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం- భండారు శ్రీనివాసరావు)
అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక.
వచ్చేది వర్షాకాలం కాబట్టి పిచ్చుక ముందు
జాగ్రత్తగా అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ
ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు వెతుక్కొచ్చి ఎత్తుకొచ్చి వెచ్చగా వుండే ఓ గూడు కట్టుకుంది. కాకి బద్ధకస్తురాలు. 'వర్షాలు
పడ్డప్పుడు చూసుకుందాములే' అనే దిలాసాతో వుండిపోయింది. చూస్తుండగానే వర్షాలు మొదలయ్యాయి. కష్టపడి ముందు చూపుతో కట్టుకున్న కొత్త గూడులో పిచ్చుక
వెచ్చగా పడుకుంది. తలదాచుకునే గూడు లేక కాకి 'కావ్వో కావ్వో' అంటూ అరచుకుంటూ పోయి, అర్జంటుగా మీడియా సమావేశం పెట్టి తన కష్టాలు ఏకరవు పెట్టుకుంది.
'నేనూ పిచ్చుకా ఇద్దరం పక్షులమే. పిచ్చుకేమో
హాయిగా వెచ్చగా గూట్లో పడుకుంటే నేనేమో ఇల్లా ఇల్లూ వాకిలీ లేకుండా ఎండకు ఎండుతూ,
వానకు తడుస్తూ అఘోరిస్తున్నాను. ఇంత అన్యాయం ఎక్కడయినా వుందా అవ్వా' అంటూ దవడలు
నొక్కుకుంది. కాకి పిచ్చుకల వ్యవహారం మీడియాకు విందు భోజనంగా మారింది. పిచ్చుక
గూట్లో అనుభవిస్తున్న వైభోగాలు, బయట కాకి పడుతున్న కష్టాలు, అన్నింటినీ గ్రాఫిక్కులు జోడించి రంగు రంగుల విజువల్స్ తో కధనాలు వండి వార్చాయి.
'ఈ అన్యాయాన్ని సహించేది లేదు. కాకికి న్యాయం
చేయాలి' అంటూ కాకిహక్కుల సంఘాలు పిచ్చుక గూడు ఎదుట ధర్నా చేశాయి. 'కాకులకూ పిచ్చుక కట్టుకున్నలాంటి గూళ్ళు కావాలంటూ నిరసన
దీక్షలు నిర్వహించాయి. గూడుకు కూడా నోచుకోని కాకులకు న్యాయం జరిగేదాకా
విశ్రమించేది లేదం'టూ హెచ్చరించాయి.
ఈ కాకిగోల ప్రాంతీయ చానళ్ళ నుండి జాతీయ ఛానల్లకూ
అక్కడినుండి అంతర్జాతీయ ఛానల్లకూ విస్తరించింది. దాంతో, ఆ పల్లవి అందుకున్న అంతర్జాతీయ వాయసహక్కుల సంఘం - ఈ విషయంలో భారత ప్రభుత్వం ఘోరంగా
విఫలం అయిందని ఆరోపించింది.
ఇక ఇంటర్ నెట్ లో సరేసరి. కాకికి మద్దతుగా
అభిప్రాయ సేకరణ ఉవ్వెత్తున ఒక ఉద్యమం మాదిరిగా మొదలయింది.
పార్ల మెంటులో ప్రతిపక్షాలు కాకులకు మద్దతుగా వాకవుట్ చేసాయి. ప్రతిపక్షాలు బలంగా వున్నరాష్ట్రాల్లో
బందులు జరిగాయి.
విషయం ఇంతగా ముదిరిపోయిన తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాకులకు న్యాయం
చేసేందుకు ఒక అత్యున్నతే స్తాయి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ కాలయాపన చేయకుండా నివేదిక ఇచ్చింది.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం 'పోటా' తరహాలో 'కాకులపై ఉగ్రచర్యల నిరోధక చట్టం - 'కాటా'
తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కాకితో అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగి, కాకితో మాట మాత్రం చెప్పాపెట్టకుండా గూడు కట్టుకున్న పిచ్చుకకు మూడేళ్ళు
జైలు శిక్ష విధించి అది కట్టుకున్న గూడును కాకికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం
ఆ సిఫారసులను 'ఇన్ టోటో' అమలు చేసింది.
జాతీయ ఛానల్లతో సహా దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ చానళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి.
ఏతావాతా జరిగింది ఏమిటంటే-
కష్టపడి గూడు కట్టుకున్న పిచ్చుకకు గూడంటూ లేకుండా
పోయింది. గూడు కట్టుకోవడానికి బద్ధకించిన కాకి మాత్రం గూడు సంపాదించుకుంది.
(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్
కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం)
NOTE : Courtesy Image Owner
Good story! Reminds me of what happened with AP State division.Hard working and pro active spirit lost to lost to lazy,vociferous,escapist and blaming attitude.
రిప్లయితొలగించండిI leave it to wise and other'wise people to decide who is sparrow and who is crow here.Poor sparrows lost their hard earned shelter and blamed for everything even though their only fault is hard work and thinking for future.
IRONY IS:story changed, morale changed, but people are not learning.even the canvas of the story also changed, innocent persons and ignorant are the real losers....!?
రిప్లయితొలగించండి