17, జులై 2014, గురువారం

"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"


(సీరియస్ గానే సుమా!)


sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై  ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక ఛానలుకు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. 'ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను' అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు  తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు. చాలామందికి వున్న  మరో భావన  ఏమిటంటే ఇలా చర్చల్లో పాల్గొనేవారికి బాగానే సంభావనలు ముడతాయని. ఒక్క ఉచిత వాహన సౌకర్యం మినహా ఇంకా ఎలాటి గిట్టుబాటు వ్యవహారాలు వుండవు అన్నది అసలు నిజం.
పోతే, ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఏడున్నరవరకు  - 10 టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ,  గురువారం ఉదయం ఏడు గంటలనుంచి  ఏడున్నర వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడుంబావు నుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు ఆరోజు వెడతాను. ఆదివారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదివరకు టీవీ 5. ఇవికాక  రాత్రి వేళల్లో  సందర్భాన్నిబట్టి వివిధ ఛానళ్లలో    చర్చాకార్యక్రమాలు వుంటాయి. కొన్ని యెన్ ఆర్ ఐ కార్యక్రమాలు నెలకు రెండు సార్లు అర్ధరాత్రి సమయాల్లో వుంటాయి.  గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత ఛానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. ఒకవేళ నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు" (ఇది మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు రాసిన ఒక గేయంలో వాక్యం)
వందనాలు  

              


5 కామెంట్‌లు:

  1. నాకేమీ అర్ధం కాలేదు.

    టీవీ ఛానెల్లలో వ్యాఖ్యాతగా పనిచేసినందుకు పారితోషకం తీసుకొంటే తప్పేముంది?

    తీసుకోకపోతే తీసుకోవడంలేదని సంజాయిషీలు వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం మీకుందా? ఒక వేళ తీసుకొంటే, అదేమైనా సిగ్గు పడాల్సిన లేక దాచుకోవాల్సిన విషయమా?

    వర్తమాన విషయాలపై మీ అభిప్రాయాలకు గిరాకి ఉంది కాబట్టే, టీవీ చానెల్లు మిమ్మల్ని పిలుస్తున్నాయి. అవి లాభాపేక్షతో వ్యాపారం చేసే సంస్థలేకదా.

    వార్తా పత్రికలలో syndicated opinion columns రాసి పారితోషకం పొందడం సాధారణమే కదా. అదే పని టీవిలో చేస్తే తప్పేముంది?

    అసలు ఈ మొత్తం విషయంలో అమ్ముడుపోవడం అనే ప్రశ్న ఎలా తలెత్తింది?

    నాకేమీ అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  2. @Edge - వీలుంటే మొదటి వాక్యం మరోసారి చదవండి

    రిప్లయితొలగించండి
  3. మీ వ్యక్తిగత వివరణ వరకూ వ్యక్తం చేయడం బాగుంది. అయితే టీ.వీలలో వ్యాఖ్యాతలు పారితోషికం తీసుకోవడం పై మీ అభిప్రాయం ఏమిటండీ? అదే వృత్తిగా ఉన్నవారికీ, ఇతర అకేషనల్ గా చర్చలలో పాల్గొనేవారికీ తేడా ఉంటుంది కదా? ఓ విషయం పై వ్యాఖ్యానించాలంటే చాలా అధ్యయనం అవసరం కదా? సాధారణ వ్యక్తులు (ఆర్ధికంగా) ఆ ఖర్చును, శ్రమను ఎలా భరించాలి? ఈ వ్యవస్థలో? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?

    రిప్లయితొలగించండి
  4. @ Kondala Rao Palla and Edge - మీ ఇద్దరికీ నా వివరణ. పారితోషికాలకు నేను వ్యతిరేకం కాదు. కాని ఎస్ ఆర్ అనే పేరుతొ రాసిన వ్యక్తి నామీద ఒక అభియోగం చేశారు. మీరు ఏదైనా ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా అని. ఆ విషయం నేను మొదట్లోనే ప్రస్తావించాను. దురదృస్తం మీరు దాన్ని గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  5. నేను గమనించానండి, కొండలరావుగారు కూడా గమనించే ఉంటారనుకొంటున్నాను. ఐతే ఎక్కడో కొంచెం క్లారిటీ తగ్గింది, అందుకే అన్ని follow-up questions. ఇప్పుడు ok.

    రిప్లయితొలగించండి