మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని
అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో, కారణం ఏదయినా, 1980 అక్టోబర్ 10 న
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జీ.వెంకటరామారావు ఆ
వుదంతం గురించి చేసిన వ్యాఖ్యానం ఇక్కడ
పేర్కొనడం సముచితంగా వుంటుంది.
"పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో, పదవీ
విరమణ చేసే అవకాశం కాంగ్రెస్(ఐ) అధిస్థానం ముఖ్యమంత్రులకు ఏనాడు ఇవ్వలేదు. మర్రి
చెన్నారెడ్డిని మూడు నెలలు ముప్పుతిప్పలు
పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదులను ప్రోత్సహించారు. గవర్నరుకు రాజీనామా
లేఖ పంపమన్నారు. అంతలోనే ఇప్పుడు వద్దు అన్నారు"
చెన్నారెడ్డి 1989 లో
రెండోమారు ముఖ్యమంత్రి అయ్యారు కాని, నేను అప్పుడు మాస్కోలో వున్నాను. అప్పుడు
కూడా ఇదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీయార్
నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీని
వోడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలో చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని
చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గురించిన అధ్యాయం ముగించేముందు
ఆయనతో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.
ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను
ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా
జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు.
గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే
ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది.
రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు
వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో
పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే
అనిపించి, సీ.ఎం. చెన్నారెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు
ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర
ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫేసు చిరునామాతో
నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో
కాగితాల్లో మరుగునపడి, ఇప్పుడు కానరావడం
లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి. ఆ జీవోలో నా పేరు కూడా వుంది. 'పలానా శ్రీనివాసరావు
ఇచ్చిన ధరకాస్తు పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది. (ఇంకా
వుంది)
There is nice writeup on this in Andhrayanam from Andhrabhoomi. Adikasya adhikam ...
రిప్లయితొలగించండి