18, జూన్ 2014, బుధవారం

సాక్షి టీవీ హెడ్ లైన్ షో

ఈరోజు (18-06-2014) ఉదయం ఏడుగంటలకు సాక్షి టీవీ హెడ్ లైన్ షో, సమన్వయకర్త దేవులపల్లి అమర్. నాతొ పాటు పాల్గొన్నది తెలంగాణా విద్యాశాఖ మంత్రి శ్రీ జీ. జగదీశ్వరరెడ్డి, శ్రీకాకుళం నుంచి వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు,  మాజీ మంత్రి శ్రీ దర్మాన ప్రసాద రావు, బీజేపీ శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి. ఫోన్ ఇన్ లో తెలంగాణా హోం మంత్రి శ్రీ నాయిని నరసింహా రెడ్డి. ప్రస్తావనకు వచ్చిన అంశాలు, వాటిపై నా అభిప్రాయాలు సంక్షిప్తంగా:


"కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే గవర్నర్ల మార్పు కూడా సహజమే. రాష్ట్రపతి మాదిరిగా గవర్నర్లు ఎన్నికయినవారు కాదు. నామినేట్ అయిన వారు. స్వచ్చందంగా  తప్పుకోవడం సత్సంప్రదాయం. ఇక వారిని  తొలగించె పని  గతంలో ఎన్డీయే చేసింది. యూపీయే కూడా చేసింది. ఒకరినొకరు తప్పుపట్టడం పెద్ద తప్పు.   రాజకీయ కోణంలో ఆలోచించి గవర్నర్లను నియమించే  విధానం మారనంతవరకు ఈ విమర్శలు, ఆరోపణలు  తప్పవు"
"ఎవరి విద్యుత్ వారిదే అని వాదించడం వినడానికి బాగుండవచ్చు కాని ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని  ఆలోచిస్తే ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం అనిపిస్తుంది. అసలు ఇటువంటి కీలకమైన విషయాలను,  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సబబుగా వుంటుంది. వీరి నడుమ గెట్టు తగాదాలు లేవు. ఒకే వూరిలోవుంటూ, ఒకే సచివాలయానికి వెడుతూ ఒకరినొకరు కలుసుకుని మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం వింతగా అనిపిస్తుంది. రెండు కొత్త రాష్ట్రాలు బాలారిష్టాల్లో వున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులకి పరిపాలన విషయంలో విశేష అనుభవం వుంది. దాన్ని సమస్యల పరిష్కారానికి వాడాలి కాని కొత్త సమస్యలు సృష్టించడానికి కాకూడదు"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి