28, జూన్ 2014, శనివారం

నిప్పుతో చెలగాటం


అట్టడుగున భూగర్భపు పొరల్లో నిక్షిప్తం అయివున్న చమురు గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడం, వాటిని వొడిసిపట్టి వినియోగంలోకి తీసుకు రావడం నిజంగా నిప్పుతో చెలగాటమే.     
అయినా  సరే చెలగాటానికే సిద్ధం అంటున్నారు ఈ రంగంలో మునిగితేలుతున్న వారందరూ.  
దీనికి కారణం వుంది. మిగిలిన ఇంధన వనరులతో పోలిస్తే ఇది నమ్మకంగా లభ్యం అవుతుంది. అలాగే ఇతరేతర   ఇంధన  వనరులు  అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా ఇది దొరుకుతుంది. నిలవచేసుకుని వాడుకునే సౌలభ్యం వుండడం అనేది మరో అదనపు ఆకర్షణ.
అంతా బాగానే వుంది కాని భూమి లోపలి పొరల్లో దాగున్న గ్యాస్ నిక్షేపాలను పైకి తీసుకురావడం అన్నది మాటలు కాదు. ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రభుత్వ రంగంలో వుండాల్సిన గ్యాస్ ఉత్పత్తిని క్రమంగా ప్రైవేటు సంస్థలు  చేజిక్కించుకున్నాయి. కృష్ణా గోదావరీ బేసిన్ ఇందుకు ఉదాహరణ. ఇక్కడ జరిగే గ్యాస్  ఉత్పత్తిలో  ప్రభుత్వ రంగ సంస్థ ఓ.ఎన్.జీ.సీ.తో పాటు రిలయెన్స్ వంటి బడా ప్రైవేటు సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్న ఈ ఉత్పాదక  రంగం మరోపక్క సృష్టిస్తున్న భీతావహ దుర్ఘటనలు గమనించినప్పుడు, మనం  వేస్తున్న ఈ అడుగులు సరిగా ముందుకు పడుతున్నాయా లేక గోతిలోకి నెడుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ముందే చెప్పుకున్నట్టు గ్యాస్ వెలికితీత  అనేది నిప్పుతో చెలగాటమే. భూమి అట్టడుగు పొరల్లో దాగున్న  గ్యాస్, అక్కడ  అనేక వొత్తిడులకు గురవుతూ వుంటుంది. భూమిపై జరిపే నిర్మాణాలు  కూడా ఒక్కోసారి ఈ వొత్తిళ్లలో హెచ్చుతగ్గులకు కారణం అవుతుంటాయి. వొత్తిడికి గురైన గ్యాస్ పైకి  తన్నుకువచ్చే  క్రమంలో దాన్ని నిరోధించేందుకు, క్రమబద్ధం చేసేందుకు గ్యాస్ సంస్థలు ఏర్పరచుకున్న  అదుపు వ్యవస్థలు పనికిరాకుండా పోయే ప్రమాదం వుంటుంది. ఆ సందర్భాలలో బయటకు దూసుకు వచ్చే గ్యాస్ మంటల్ని అదుపు చేయడం అసాధ్యంగా మారుతుంది. ఇలా గ్యాస్ తన్నుకువచ్చేటప్పుడు వెలువడే ధ్వని - వెయ్యి ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఒకేసారి  దూసుకువచ్చేటప్పుడు వినవచ్చే  భీకర ధ్వని మాదిరిగా వుంటుందట.
1995 లో తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద సంభవించిన బ్లో అవుట్,  మొత్తం చమురు గ్యాస్ నిక్షేపాల వెలికితీత చరిత్రలోనే అతి ఘోరమైనది. అప్పుడు  ఎగసిన అగ్ని కీలలు ఆ ప్రాంతంలోని 19 డ్రిల్లింగ్ కేంద్రాలను చుట్టుముట్టాయి. 12 కోట్లు ఖరీదు చేసే ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్గు, మరో 7 కోట్లు విలువచేసే డ్రిల్లింగ్ పరికరాలు,ఇతర  సామగ్రి  నాటి దుర్ఘటనలో కాలి బూడిద అయ్యాయి.  ఆ మంటలను ఆర్పడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. విదేశీ నిపుణులను రప్పించి వారి  సాయంతో వాటిని అదుపు చేయడానికి రెండు నెలలకు పైగా వ్యవధి పట్టింది. అయినా  కానీ ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడం అన్నది  వూరట కలిగించే విషయం.  
ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా చిన్నవీ పెద్దవీ కలిపి మొత్తం ఇరవై ఇటువంటి  సంఘటనలు జరిగాయి. మొన్న శుక్రవారం తొలిపొద్దులో సంభవించిన ఆకస్మిక ప్రళయం మాత్రం  చాలా భయంకరం. మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది.  ఈ వ్యాసం రాస్తున్న సమయానికి అందిన  సమాచారం ప్రకారం పదిహేనుమంది గ్యాస్ పైప్ లైన్  పగిలిన కారణంగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్తితి విషమంగా వున్నట్టు చెబుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు చెప్పే విషయాలు హృదయ విదారకంగా వున్నాయి. తెలవారకముందే ఇది సంభవించడం వల్ల కొంతమంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉలిక్కిపడి లేచారు. చూస్తే  చుట్టూ మంటలు. ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతున్నదో అర్ధం కాదు. దిగ్గునలేచి దగ్గర్లో వున్న పొలాల్లోకి పరిగెత్తారు. ఎటు చూసినా కార్చిచ్చులా మంటలు. ఎవరు వున్నారో, ఎవరు పోయారో తెలవదు. అంతా అయోమయం, గందరగోళం.  బతికి బట్ట కట్టిన వారు చెప్పే మాటలవి.
'నిన్నటి నుంచీ అనుమానంగానే వుంది. ఎక్కడో గ్యాస్ లీకవుతున్నట్టు. కానీ అది ఇంత ప్రాణాంతకంగా  పరిణమిస్తుందని అనుకోలేదు. ఎందుకంటే రిఫైనరీ వాళ్లు అప్పుడప్పుడు పనికి రాని  గ్యాస్ ను ఇలా వొదిలి పెట్టడం మామూలే. అంచేత, అంతే  అయివుంటుందని పెద్దగా పట్టించుకోలేదు'  అన్నది మరో స్థానికుడి  కధనం.
అధికారులు ధృవపరచడం లేదు కాని మంటలు అలా వువ్వెత్తున ఎగసిపడడానికి కొందరు మరో కారణం చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో  టీ దుకాణం నడుపుకునే ఓ వ్యక్తి తన రోజువారీ పనులకు సమాయత్తమవుతున్నాడు. అంతకుముందే అ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ పగిలి అందులోనుంచి గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్ముకుంటున్న సంగతి ఎవరూ గమనించలేదు. పైగా వాతావరణం మబ్బులు పట్టి వుండడం వల్ల కూడా గ్యాస్ అంతటా కమ్ముకుంటున్న సంగతిని గమనించడానికి వీలు లేకుండా పోయింది. పైపెచ్చు ఇలా వెలికి తీసే సహజ వాయువుకు, ఇళ్ళల్లో వాడే వంట గ్యాస్ మాదిరిగా  రంగూ, వాసనా వుండదు. అందువల్ల కూడా కమ్ముకువస్తున్న మృత్యు వాయువు ఆనవాళ్ళు వారికి కానరాలేదు. ఈ నేపధ్యంలో స్టవ్ వెలిగించడానికి ఆ టీ కొట్టు యజమాని వెలిగించిన అగ్గిపుల్లతో చుట్టుపక్కల ఆవరించి వున్న గ్యాస్ ఒక్కసారిగా భగ్గుమని మండింది. క్షణాల్లో అగ్ని కీలలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. ఏం జరుగుతున్నదో తెలిసేలోపే జరగరానిది మొత్తం జరిగిపోయింది.     
గతంలో పసర్లపూడిలో జరిగిన బ్లో అవుట్ కు,  శుక్రవారం నాటి  సంఘటనకు తేడావుంది. అది ప్రమాదం. తాజాది  మానవ తప్పిదం. సహజవాయువుకు రంగూ, వాసనా లేకపోవడం వల్ల,  పైప్ లైన్ పగిలి గ్యాస్ గాలిలో కలిసి మృత్యు రూపంలో పాకివస్తున్నా జనం దాని జాడ కనిపెట్టలేకపోయారు. అగ్గిపుల్ల గీసే దాకా అక్కడే మృత్యువు పొంచి వున్న సంగతి వారికి  తెలియదు.
కొన్ని నెలలక్రితం మా ఇంట్లో గ్యాస్ లీకయింది. పిర్యాదు చేస్తే గ్యాస్ కంపెనీ సిబ్బంది తాపీగా వచ్చి, 'అప్పుడప్పుడూ సిలిండర్ పైపు మార్చుకుంటూ వుండాలని  చదువుకున్న వాళ్లు మీకు కూడా తెలియకపోతే యెట్లా' అని లెక్చర్ ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు కోనసీమను మరుభూమిగా మార్చిన సంఘటనలో, అధికారులు చెప్పే ఇలాటి  సుద్దులు ఎక్కడికి పోయాయో.
మరో విషయం మెల్లగా వెలుగులోకి వస్తోంది. గ్యాస్ పైప్ దుస్తితి గురించి స్థానికులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. గ్యాస్ నిల్వలు వెలికి తీసే ప్రాంతం అంటే వంద ఆటం బాంబుల మీద పక్క పరచుకుని పండుకున్నట్టు. అంతటి ప్రమాదం ఎల్లవేళలా పొంచే  వుంటుంది.
జనావాసాల ప్రాంతంలో గ్యాస్ వెలికి తీస్తున్నప్పుడు అధికారులు కనీస ముందు జాగ్రత్తలు తీసుకున్నారా అన్నదానిపై ఆలశ్యంగా చర్చ మొదలయింది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సరపరా నిలిచిపోయేలా అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్టు లేదు.  జనవాసాల నడుమ  గ్యాస్  పైపు లైన్లు వేసినప్పుడు హెచ్చరిక  బోర్డులు కూడా పెట్టలేదంటున్నారు.  చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, ముగ్గురు సభ్యులతో విచారణా సంఘం ఏర్పాటు, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు, అన్నీ రొటీన్ ప్రకటనలు. ఇవన్నీ సరే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనే ఆ ఒక్క మాట అన్నా నిలబెట్టుకుంటే అదే పదివేలు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి