20, జూన్ 2014, శుక్రవారం

నల్ల ధనంపై టీవీ 99 చర్చ


ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన నల్ల ధనం గురించి టీవీ 99  ఈ రోజు (20-06-2014) రాత్రి ఎనిమిది గంటలకు 'ఓపెన్ టాక్' కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. నాతొ పాటు ప్రముఖ విశ్లేషకులు, శాసన మండలి సభ్యులు  శ్రీ నాగేశ్వర్, బీజేపీ తరపున శ్రీ కృష్ణ సాగర్ పాల్గొన్నారు. న్యూ ఢిల్లీ  నుంచి  ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీ సురవరం సుధాకర రెడ్డి ఫోన్ ఇన్ లో అభిప్రాయం తెలియచేసారు. యాంఖర్ గా కాట్రగడ్డ అజిత వ్యవహరించారు.
టీవీ 99 అన్నది కొత్తగా ప్రవేశించిన తెలుగు టీవీ ఛానల్. కొత్తగా రావడం వల్ల టీవీ రంగంలో సరి కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి వీలుపడినట్టు వుంది. ఓపెన్ కాన్సెప్ట్ తో ఏర్పాటు చేసిన మొట్టమొదటి తెలుగు టీవీ ఛానల్ గా నిర్వాహకులు చెబుతున్నారు. స్టూడియోను నాలుగు కృత్రిమ గోడల మధ్య కాకుండా సిబ్బంది అందరూ పనిచేసే హాలులోనే ఏర్పాటు చేశారు. అంతా చూస్తూ వుండగానే కార్యక్రమం ప్రసారం అవడం ఇందులోని విశేషం.


షరా మామూలుగా నల్ల ధనం వెలికితీతకు సంబంధించి నా సూచనలు క్లుప్తంగా:
"దేశం బయట స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి  తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే మంచిదే. కానీ అసలు నల్ల ధనం దేశం దాటి బయటకు పోకుండా చర్యలు తీసుకోగలిగితే ఇంకా మంచిది.
"ఖరీదైన బంగారు ఆభరణాల దుకాణాల్లో దొంగతనాలు అరికట్టేందుకు కెమెరాలు పెడుతుంటారు. ధనవంతులు ఖాతాల్లో చూపని నల్ల డబ్బును కరెన్సీ రూపంలో అలాటి చోట్ల విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. దొంగల్ని పట్టుకునే కెమేరాలతో ఈ అసలు దొంగల్ని పట్టుకుంటే ఒక పని అయిపోతుంది.

"అమలుకు సాధ్యం కాని సలహా ఒకటి చెప్పదలచుకున్నాను. ఈ మధ్య జరిగిన ఎన్నికలు స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో అతి ఖరీదైన ఎన్నికలు అంటున్నారు. గెలిచిన వాళ్ళే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్ధి  కోట్లాది రూపాయలు మంచి నీళ్ళ మాదిరిగా ఖర్చు చేసిన మాట వాస్తవం. ఈ విధంగా,  లెక్కలేనంత నల్లధనం పెద్ద మొత్తంలో చెలామణీ లోకి వచ్చింది. అయిదేళ్ళకోమారు కాకుండా ఏడాదికోసారి ఎన్నికలు నిర్వహిస్తే చాలు. కొన్నేళ్లలో  మొత్తం నల్లధనం అంతా హారతి కర్పూరంలా హరించుకు పోవడం ఖాయం"                    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి