బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని, రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా
సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై పాళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై పాళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక పాళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు విధాత.
'అమ్మతనం అరవై ఆరుపాళ్ళు, ఆత్మబలం ఆరుపాళ్ళు, అహంకారం మరో ఆరుపాళ్ళు.
వినయం అయిదుపాళ్ళు, అణకువ ఆరుపాళ్ళు, మేధస్సు ముప్పై పాళ్ళు, మానసిక బలహీనతలు నలభై
పాళ్ళు, శారీరకబలం లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి.
విధాత వింటూనే ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.
బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటక
గర్భురాణికే మతి పోయింది. ఇంత సౌందర్యం, ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని
గాభరా పడిపోయింది.
బ్రహ్మ భార్య కంగారు చూసి మూడు బోసి నోళ్ళతో ముసి
ముసి నవ్వులు నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం
వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే, సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం
వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అనిచెప్పలేదు.
ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా
ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు.
వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే, ఈ బొమ్మ బతుకూ అంతే. తెలివితేటలు,
బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే
తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా
అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన
అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది. ఈ
పుత్తడి బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం
ఇదే'
NOTE : Courtesy Image Owner
చాలా బాగా చెప్పారు!
రిప్లయితొలగించండి