1, ఏప్రిల్ 2014, మంగళవారం

జై జగన్ ! నై జగన్ !


గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలు, ఇక దేశంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా కేవలం రెండే రెండు అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఒకటి తెలంగాణా, రెండోది జగన్. ఒకటి కాంగ్రెస్ పుణ్యమా అని ఎన్నికలకు ముందే దాదాపుగా సమసిపోయింది. అది వున్నన్నాళ్ళు,  'ప్రో తెలంగాణా యాంటీ తెలంగాణా' అనే రెండు కోణాలుగా విడిపోయాయి. సమాజంలో వున్న అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, చదువుకున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, పత్రికలు, టీవీలు, జర్నలిస్టులు చివారాఖరుకు బంధుమిత్రులు అందరూ రాష్ట్రం చీలకముందే రెండుగా చీలిపోయారు. సరే ఆ అంకం ముగిసింది. కానీ మిగిలివున్న జగన్ అంశం ఇంకా సెలవేస్తూనే వుంది. నిజం చెప్పాలంటే తెలంగాణా అంశం వల్ల జగన్ అంశం కాస్త తెరచాటు అయింది కానీ, ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేసిన విషయం మరోటిలేదు. జగన్ని సమర్ధించేవాళ్ళందరూ అవినీతిని సమర్ధించేవాళ్లని కొందరు ఆరోపిస్తే, జగన్ని వ్యతిరేకించేవాళ్లందరూ  పైకి కనబడేంత పత్తిత్తులు కాదని జగన్ మద్దతుదారుల వాదనగా సాగింది. ఈ వాదోపవాదాల మాటున అనేక కీలక అంశాలు చాటుకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో, మళ్ళీ ముందు చెప్పుకున్నట్టుగానే పౌర సమాజం రెండుగా విడిపోయింది.
పోతే, జర్నలిస్టులుగా వున్నవాళ్ళు కూడా ఇందుకు అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వుండడం ఇందులో విషాదం. తెలంగాణా వంటి భావోద్వేగ సమస్య పట్ల వైఖరులను కొంత సమర్ధించుకోవచ్చు కానీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న అంశం పట్ల కూడా ఉద్వేగాలకు ఆవల నిలబడి ఆలోచించుకోలేని పరిస్తితి ఏర్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. కాకపొతే ఈ విషయంలో సమాజంలోని అన్నివర్గాలు ఇక వెనక్కు రాలేనంత ముందుకు వెళ్ళిపోవడం చూస్తే, రాగల పరిణామాలను కాలానికి వొదిలి వేచి చూడడమే మంచిదని అనిపిస్తోంది.
సరే! మిగిలిన అన్ని వర్గాలను వొదిలిపెట్టి విషయాన్ని  మరో  కోణం నుంచి చూద్దాం.
పదిమందిని కలుసుకోవడంతో పాటు పది రకాల మనుషుల్ని కలుసుకోగగల వెసులుబాటు జర్నలిష్టులకు (మాత్రమే) వుంటుంది. ఈ క్రమంలోనే  ఒక సైకాలజిష్టు కలిసారు. ఆయన విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా వుందా లేక ఆయన కూడా ఈ సమాజంలో భాగమే కనుక అందరిలాగే ఒక వాదానికే కట్టుబడి ఈ మాటలు చెబుతున్నారా అన్నది ఆయన విజ్ఞతకు, ఆ పలుకులలోని వాస్తవికతను ముందే చెప్పినట్టుగా కాలానికి వొదిలి వేద్దాం. తొందరపడడం యెందుకు, తేల్చే ఘడియ కనుచూపు మేరలో వున్నప్పుడు. ఎలాగు మనకో సామెత వుండనే వుంది. 'విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ'ని. ఇక ఆయన ఏం చెప్పారంటే....ఆయన మాటల్లోనే......
"ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు దానిలోని ఔచిత్యాలను గమనంలోకి తీసుకోరు. నమ్మకం, అభిమానం, కొండొకచో ప్రేమ వారినలా ప్రవర్తించేలా చేస్తుంది. వాటికి హేతుబద్ధమైన  లేదా శాస్త్రీయమైన  ప్రాతిపదికలు వుండవు. మన పిల్లవాడు అద్దం పగలగొడితే, చిన్నవాడు పోనీలే అనుకుంటాం. అదే పక్కపిల్లవాడు చేస్తే రాలుగాయి, అసలు పెంపకాన్ని అనాలి అనేస్తాం. ఇది మానవ సహజం.
"ఒకప్పుడు, ఆ మాటకు వస్తే ఇంత చదువు సంధ్యలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా సినిమా అభిమానులది ఇదే వరస. వాళ్ళకో అభిమాన హీరో వుంటాడు. అతన్ని ఎంతగా అభిమానిస్తారో అతడికి సినీ రంగంలో ప్రత్యర్ధిగా వున్న మరో హీరోను అంతగా ద్వేషిస్తారు. యెందుకు అంటే ఇతమిద్ధంగా కారణం చెప్పలేరు. ఎదుటి హీరోలో కనిపించే లక్షణాలన్నీ వారికి అవలక్షణాలుగా కానవస్తాయి. తమ హీరోలో బలహీనతలను వారసలు పట్టించుకోరు. ఈ అభిమానం, ఈ  వైమనస్యం వారిని ఏ స్తితికి తీసుకువెడతాయంటే ఆఖరికి వాళ్లు సినిమా పోస్టర్ల మీద పేడ కొట్టే పరిస్తితి వరకు దిగజారుస్తాయి. ప్రస్తుతం ఈ మనస్తత్వమే రంగూ రూపూ మార్చుకుని సోషల్ మీడియాలో విశృంఖల విహారం చేస్తోంది. మొదటి వాక్యం  చదివేసి ఒక అభిప్రాయానికి వచ్చేసి కామెంట్లు పెట్టేస్తారు. ఆవిధంగా ఇప్పుడు పౌర సమాజం, చదువుకున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తారతమ్యం లేకుండా రెండు వర్గాలుగా విడిపోయి, 'జై జగన్, నై జగన్' అని  వాదించుకుంటోంది. ఎవరి శాతం యెంత అన్న విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకు వున్నా  ఇంకా అసలు  లెక్కలు తేలలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రస్పుటం అయ్యే ఈ లెక్కల్లోని వ్యత్యాసమే ఆయా రాజకీయ పార్టీల లెక్కల్ని, తలరాతల్ని  మార్చబోతోంది"
అయితే 'ఇందులో కొత్త విషయం ఏముంది, వేచి  చూడడం అన్న సలహా తప్ప' అన్న అనుమానం నాకూ వచ్చింది.
నాకనిపించేది ఏమిటంటే సినిమా హీరోలని అమితంగా అభిమానించే జనాలు వున్నట్టే, అసలు  అభిమానాలు, దురభిమానాలతో నిమిత్తంలేని ప్రేక్షక జనాలు కూడా వుంటారు. సినిమాల జయాపజయాల్లో వాళ్ల పాత్ర కూడా అంతర్లీనంగా వుంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా. 'చంద్రబాబు మా మేనత్త కొడుకు కాదు,  జగన్  మా మేనమామ కొడుకు కాదు' అనే బాపతు. వారెవరో, వారెందరో ఒక పట్టాన తేలడం కష్టం. చివరికి తేల్చేది, ముంచేది అలాటి వాళ్ళేనేమో!   

2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పింది నిజమే.ఈ విషయంలో ప్రజలు రెండు వర్గాలు గా చీలి పోయారు. మేధావులమనుకునే వారు కూడా నిదానంగా అలోేచించే స్థితిలోే లేరు. చేయగలిగిందేమీ లేదు వేచి చూడ్డం తప్ప.






































    ీ వి,యంలో ప్ేరజలు రెండు వర్గాలు గా చీలి పోేయారు.

    రిప్లయితొలగించండి
  2. ఏది ఏమైనా సినిమా హీరోలయినా, రాజకీయ నాయకులయినా, మరొకరైనా చదువుకుని ఆలోచించగల వాళ్ళు సైతం గుడ్డి అభిమానం చూపించడమే విచిత్రంగా వుంటుంది. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు " వినదగునెవ్వరు చెప్పిన.... " అనే పద్యం యొక్క భావం ఒక్కసారి ఆలోచెస్తే బాగుంటుంది అనిపిస్తుంది. cell:9010619066

    రిప్లయితొలగించండి