2, మార్చి 2014, ఆదివారం

పాతికేళ్ళనాటి మాస్కో - 9


 దేశంలో పిల్లలే ప్రత్యేకం అనుకుంటే - వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రులు,ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక దుస్తుల దుకాణాలు, ప్రత్యేక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గవున్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు, దువ్వెనలు, బ్యాటరీతో పనిచేసే బుల్లి బుల్లి హెయిర్ డ్రయర్లు మొదలయినవన్నీ అమ్మే ప్రత్యేక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈత కొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు, మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు, పడక గదులు - అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం - మరికొన్నింటి ధరలు నామమాత్రం.


(మాస్కోలో ఇండియన్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ్)

మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదానుఉద్యోగాన్ని బట్టి కాకుండా వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు ఉండడంవల్ల మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.
మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి