15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి - 4


ఒకప్పుడు బెజవాడలో ఎండాకాలం  అంటే నూట పది డిగ్రీలు దాటాలి. ఆరోజుల్లో హైదరాబాదులో నూరు డిగ్రీలకే జనం ఆవిర్లు కక్కేవాళ్ళు. అలాగే తిరుపతి రద్దీ ఓ మోస్తరు అంటే అక్కడికి వారికి నిజంగా ఓ మోస్తరే  కాని బయట నుంచి వచ్చిన యాత్రీకులకి మాత్రం చాలా రద్దీ అనిపిస్తుంది. 'మూడువందలు పెట్టి స్పెషల్  క్యూలో నిలబడ్డారంటే యెంత ఓ రెండుగంటల్లో దివ్యంగా దర్శనం అయిపోతుంది. పొద్దున్న వెళ్ళిన వాళ్లు గంటలోనే తిరిగొచ్చామన్నారు." ఇలా గెస్ట్ హౌస్ లో వాళ్లు చెప్పిన మాట విని క్యూలో చేరాము. అంతే! కాసేపు త్వరగా వెడుతున్నట్టే అనుపించింది. కాని అది కాసేపే. తరువాత క్యూ నిలిపేశారు. ఎంతసేపో చెప్పేవాళ్ళు వుండరు. ప్రతిచోటా 'అత్యవసర పరిస్తితి ఏర్పడితే కింది టోల్ ఫ్రీ నెంబరుకు ఫోను చేయండి' అని బోర్డులు పెట్టారు. సెల్ ఫోన్లు మాత్రం అనుమతించేది లేదన్నారు. దేవస్థానం వాళ్ళయినా అక్కడక్కడా బీ ఎస్ ఎన్ ఎల్ ఫోన్లు ఏర్పాటు చేశారా అదీ లేదు. మరి ఆ బోర్డులు యెందుకు? బహుశా బోర్డులు రాసే కాంట్రాక్టర్ల కోసం కావచ్చు.  పక్కనే వీ ఐ పీ పాసులు వున్నవాళ్ళు వేచి వుండే విశాలమైన హాళ్ళు అనేకం ఖాళీగా వున్నాయి. ఆ సమయంలో వాళ్లు వుండరు.  కానీ, సామాన్య భక్తులు మాత్రం ఇరుకయిన సందులాంటి త్రోవ ద్వారానే  వెళ్ళాల్సి వుంటుంది.  అందులో వెళ్ళేవాళ్ళు 'భయంకరమైన బందిపోట్లు' అన్నట్టుగా ఇరువైపులా  ఇనుప తీగెల తెరలు. దోవలో మళ్ళీ మెట్లు. ఎగుడు దిగుడుగా వున్న చోట వేసిన చెక్క పలకలు జర్రున జారే విధంగా వున్నాయి. ఒకావిడ మా కళ్ళముందే జారి పడింది. నిజమైన భక్తురాలేమో తుంటి విరగలేదు. అమెరికా వంటి దేశాల్లో జారుడు ప్రదేశం వుంటే హెచ్చరికగా బోర్డు పెడతారు. ఇక్కడ మాత్రం భక్తుల్ని వాళ్ల మానానికి వాళ్ళను వొదిలేశారు. అలాటి చోట్ల 'ఇంకా ఇంత సమయం మీరు వేచి వుండాల్సి వుంటుంది' అని లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తుంటే ఏదో ఒక సమాచారం తెలిసిందని వూరట చెందుతారు. టీటీడీ వంటి సంస్తకు ఈ ఖర్చు ఓ లెక్క కాదు. కానీ అక్కడ ఆ పరిస్తితి కనిపించలేదు.


(టీటీడీ బందీలు)

మధ్య మధ్య అక్కడక్కడ గేట్లు తెరుచుకుంటాయి. కొందరు మధ్యలో క్యూలో ప్రవేశిస్తారు. వారు ఉద్యోగులో తెలవదు. పలుకుబడి వున్న భక్తులో తెలవదు. అక్కడక్కడ కానవచ్చే  టీటీడీ సిబ్బందికి భక్తులు మనుషుల్లా కనిపించరు. అడిగిన దానికి జవాబు చెప్ప రు.
ఆ మధ్యాన్నం జేఈవొ  తిరుమలలో కొన్ని గెస్ట్ హౌసుల్లో ఆకస్మిక తనిఖీ చేసి  టాయిలెట్ల దగ్గర నుంచి అన్నీ చూసివెళ్ళినట్టు మరునాడు ఉదయం పేపర్లో వచ్చింది. అలాటి అధికారులు పనిలోపనిగా వారానికి ఒకసారో రెండుసార్లో తామెవరో తెలియకుండా క్యూ లైన్లలో వెళ్ళి చూస్తే భక్తులు అనుభవిస్తున్న ఇబ్బందులను కళ్ళారా  గమనించడానికి వీలుంటుంది. కాని పెద్దల టాయిలెట్ల వంటి ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి  ఇంత చిన్న విషయాలను పట్టించుకునే తీరిక వారికి  యెలా వుంటుంది. వాళ్ల ఇబ్బందులను కూడా భక్తులు కాస్త అర్ధం చేసుకోవాలి. (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి