17, మార్చి 2014, సోమవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 23


మాస్కోలో మెక్ డొనాల్డ్ 

1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు, టై బిస్కెట్లు  తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయంలో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.
 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.
ఇనుప తెర దేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్  ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్ మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్ అనేవారు. రష్యన్లో బల్షోయీ అంటే పెద్ద అని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.

 (20-03-2012)

4 కామెంట్‌లు:

  1. మాస్కో, సెయింట్ పీటెర్స్ బర్గ్ లల్లో పక్కా వారం రోజులున్నాం కానీ...మీరు చూపించినంతగా రష్యా ని చూడలేకపోయాం.Thank you sir.

    రిప్లయితొలగించండి
  2. >> మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే పట్టేది.

    When did McDonalds start selling Pizza? SIR?

    రిప్లయితొలగించండి
  3. @ prasad mallarapu - నిజమే. కానీ మేము అయిదేళ్ళు వున్నాం కదా!

    రిప్లయితొలగించండి
  4. @అజ్ఞాత -మీరు వెటకారంగా అన్నా అది నా పొరబాటే.

    రిప్లయితొలగించండి