9, జనవరి 2014, గురువారం

చీమ చెప్పే భగవద్గీత



ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.

అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.

దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో మోటివేషన్ గురుఅని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన విజయ సూత్రాలకుస్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు యాం ట్స్' ఫిలాసఫిఅంటే చీమలు బోధించే తత్వశాస్త్రంఅని దగ్గరి అర్ధం.

చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.



ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి సారో సాంగులు సోలో సాంగులుమొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండిఅని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.
(09-01-2014)
NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి