22, డిసెంబర్ 2013, ఆదివారం

శ్రీ తిరుమల రామచంద్ర గారి శత జయంతి


నా వయస్సు అరవై ఎనిమిది. అంటే నేను పుట్టకమునుపే ఆయన విఖ్యాత పత్రికల్లో జర్నలిష్టు. ఒకటి రెండు భాషల్లో అరకొర అభినివేశం నాదయితే అనేక భాషల్లో మంచి పట్టు సాధించిన ప్రజ్ఞాశీలి వారు. ఎక్కడో ఏదో జెర్రి పోతంత అదృష్ట రేఖ కనీ కనబడకుండా వుందేమో. లేకపోతే నేనేమిటి ? అంతటి పండిత ప్రకాండుడి శత జయంతి సందర్భంగా ఈరోజున జరిగే ఓ సమావేశానికి అధ్యక్షత వహించడం ఏమిటి? పెట్టిపుట్టకపోతే ఇలాటిది సాధ్యమా!


తిరుమల రామచంద్ర గారి గురించి చెప్పడం ఆయనకే సాధ్యం అని నా నమ్మకం. తనని గురించి తాను చెప్పుకున్నా అందులో సొంత గొప్పలు కనబడవు. పైగా మానవ సహజమైన బలహీనతలను కూడా ఆయన ఎంతమాత్రం భేషజాలకు పోకుండా నిర్భీతిగా రాసుకున్నారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి ఇదే గీటురాయి.
పుట్టిన వందేళ్ళ తరువాత ఆయన్ని గుర్తుంచుకుని వేడుక చేస్తున్న సందర్భం ఇది. ఈ పుణ్యం కట్టుకున్నవాళ్ళు బహుధా అభినందనీయులు. ఎందుకంటే – అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నట్టు రామచంద్ర గారు జీవించి వుండగా వారికి ‘షష్టిపూర్తి జరగలేదు. సప్తతి లేదు. అశీతి అసలే లేదు. సహస్ర చంద్ర దర్శన ఉత్సవం సమకూడలేదు. పూర్ణ జీవితం అనుభవించి కూడా రామచంద్రగారు త్రిదశుడు’ అన్నారు అక్కిరాజువారు. అంటే ఏమిటట. ఎప్పుడూ ముప్పయ్యేళ్ళవాడిగానే జీవించారట. బాల్య, కౌమార, యవ్వన, నిర్మల, నిర్భర, నిరంతర, సమధికోత్సాహ మనస్విత తోనే ఆయన ఎనభై నాలుగేండ్ల జీవితాన్ని యదృచ్చాలాభ సంతుష్టంగానే గడిపారని అద్భుతమయిన కితాబు ఇచ్చారు.
కొందరు కొన్నిట్లో తమ ప్రతిభ కనబరుస్తారు. కానీ రామచంద్రగారో. ఆయన వేలు పెట్టని రంగం లేదు. పత్రికా రచయిత, కవి, గ్రంధకర్త, విమర్శకుడు, బహుభాషా కోవిదుడు. అంతేనా అంటే అంతే  కాదు. పదం బాగాలేదేమో కాని ఆయన దేశదిమ్మరి. ఆయనలా వూళ్ళుపట్టుకుని తిరిగిన జర్నలిష్టు మరొకరు కనబడరు. జీవిక కోసం ఆయన ఎత్తని అవతారం లేదు. అనంతపురం జిల్లాలో ఓ మారుమూల కుగ్రామం రాఘవం పల్లి(రాగంపల్లి) లో పుట్టి, నాటి బళ్ళారి జిల్లా ఆనెగొందిలో ప్రాధమిక విద్య, తిరుపతి దేవస్థానం కళాశాలలో చదువు, నెల్లూరు ఆయుర్వేద కళాశాల, చెన్నపట్నం మైలాపూర్ కాలేజీ ఇలా ఇలా సాగి లాహోరు, బెలూచిస్తాన్, క్వెట్టా, చమన్ ప్రాంతాలు తిరిగి, కాన్పూర్ లో డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికలో చేరడం వరకు సాగిపోయింది. అంతటితో ఆగితే ఆయన రామచంద్రగారు యెట్లా అవుతారు. హైదరాబాదులో మీజాన్ ఉర్దూ పత్రిక, తరువాత ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక దినపత్రికల్లో చాలాకాలం తన రచనలతో వాటికి ఒక విశిష్టతను తెచ్చిపెట్టారు.
‘హంపీ నుంచి హరప్పా దాకా’ అనే రచనలో తిరుమల రామచంద్ర గారు తన జీవితానుభవాలను రసరమ్యంగా కూర్చారు. ఈ శుభ సందర్భంలో వారికి నా కైమోడ్పు. (22-12-2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి